ఎలాంటి షరతులకైనా ఓకే.. బెయిలివ్వండి చాలు!.. హైకోర్టులో పిన్నెల్లి బెయిలు పిటిషన్
posted on Aug 5, 2024 @ 10:47AM
అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా చెలరేగిపోయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో, డిప్రషన్ లో కూరుకుపోయారు. పల్నాడు పులిని అంటూ విర్రవీగిన ఆయన ఇప్పుడు పిల్లిలా మారిపోయారు. నెల రోజులకు పైగా నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి.. ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉంటాను బెయిలు మంజూరు చేయండి చాలు అంటూ హైకోర్టును ఆశ్రయించారు. బెయిలు కోసం ఇప్పటికే రెండు సార్లు కోర్టును ఆశ్రయించారు. అయితే రెండు సార్లూ ఆయన బెయిలు పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో ఇప్పుడు ఏ షరతులైనా విధించండి.. బెయిలవ్వండి చాలు అంటై హైకోర్టును వేడుకున్నారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ సోమవారం (ఆగస్టు 5) ఏపీ హైకోర్టు విచారించనుంది.
అదలా ఉంచితే.. జగన్ ఐదేళ్ల పాలనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యర్థులపై దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. అధికారం చేతిలో ఉంది.. తనను అడ్డుకునేవాడెవరన్న రీతిలో ఇష్టారీతిగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో పాల్వాయి గే ట్ పోలింగ్ బూత్ లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుపడిన తెలుగుదేశం ఏజెంట్ పై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ ముగిసిన మరునాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో కలిసి కారంపూడిలో విధ్వంసం సృష్టించారు. అనుచరులతో కలిసి సోదరులిద్దరూ కారంపూడిలో స్వైర విహారం చేశారు.
మారణాయుధాలతో రోడ్లపై తిరుగుతూ తెలుగుదేశం శ్రేణులపై విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లు కొట్టారు. ఏకంగా సీఐపైనే దాడికి పాల్పడ్డారు. ఈ రెండు సంఘటనలపై కారంపూడి పోలీసులు పిన్నెల్లి సోదరులపై హత్యా యత్నం కేసు నమోదు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ 26న అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు జైలుకు తరలించారు. అప్పటి నుంచి పిన్నెల్లి నెల్లూరు జైలులోనే ఉన్నారు. బెయిలు కోసం రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. రెండు సార్లూ కోర్టు పిన్నెల్లికి బెయిలు నిరాకరించింది. దీంతో తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో ఉన్న పిన్నెల్లి ఎటువంటి షరతులకైనా కట్టుబడి ఉంటాను బెయిలు మంజూరు చేయండంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆ బెయిలు పిటిషన్ సోమవారం (ఆగస్టు5) విచారణకు రానుంది.