అబ్ కీ బార్ హైదరాబాద్ బాహర్
posted on Jun 3, 2024 @ 2:10PM
అబ్ కీ బార్ 400 బాహర్ అనే నినాదంతో సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన బిజెపి తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తుందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. అయితే కౌంటింగ్ కు 24 గంట ముందు రెండు ప్రముఖ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో మాత్రం హైదరాబాద్ లోకసభ బిజెపి కైవసం చేసుకుంటుందని వెల్లడైంది. హైదరాబాద్ స్థానం గత 40 ఏళ్లుగా మజ్లిస్ చేతిలో ఉంది. బిజెపి ప్రాథమిక సభ్యత్వం కూడా లేని ఒక మహిళకు అధిష్టానం హైదరాబాద్ టికెట్ కేటాయించింది. బిజెపిలో పాతుకుపోయిన హిందుత్వ వాదులను కాదని పాతబస్తి మూలాలు ఉన్న మాధవిలతకు టికెట్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
సనాతన సంప్రదాయాన్ని ప్రమోట్ చేసే మాధవిలతకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. తాను హైదరాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు కూడా మాధవిలత ఏనాడు అధిష్టానానికి చెప్పుకోలేదు. కనీసం దరఖాస్తు చేసుకోలేదు. పాతబస్తీలో సున్నితమైన గోషా మహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన రాజాసింగ్ ను సైతం కాదని మాధవిలతకు బిజెపి టికెట్ ఇచ్చింది.
హైదరాబాద్ లోకసభ టికెట్ ఆశించిన రాజాసింగ్ తన సన్నిహితులతో బాటు పార్టీ ముఖ్యనేతలతో పలు మార్లు తన అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని చెప్పుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా మాధవిలతకు టికెట్ ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బిజెపి మహిళా మోర్చా అధికారప్రతినిధి యమునాపాఠక్ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేని మాధవిలతకు టికెట్ కేటాయించడం పార్టీలో అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. రాజాసింగ్ అయితే పార్టీలో మగాళ్లే దొరకలేదా అని అధిష్టానాన్ని ఏకిపారేశారు. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయినప్పుడు కూడా అధిష్టానాన్ని పల్లెత్తు మాట అనని రాజాసింగ్ మాధవిలత విషయంలో అధిష్టానాన్ని గట్టిగానే చురకలు అంటించారు.
ఎన్నికల ప్రచారంలో మాధవిలత వాహనం ఎక్కని రాజాసింగ్ పోలింగ్ తర్వాత మాత్రం లక్ష వోట్ల మెజార్టీతో మాధవిలత గెలుస్తారని ప్రకటన చేశారు. ఆ తర్వాత రాజాసింగ్ మాధవిలత విషయంలో అంటీ ముట్టనట్లు వ్యవహరించారు. తాజాగా మాధవిలత ఓడిపోతుందని, దీనికి ప్రధాన కారణం బోగస్ వోట్లేనని రాజాసింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ మాధవిలత కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గలేదు. హైదరాబాద్ సీటు నాదేనని ధీమా వ్యక్తం చేశారు.
మహరాష్ట్ర బిజెపి ఎన్నికల ప్రచారంలో కూడా మాధవిలత స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. హైదరాబాద్ లో పోలింగ్ తర్వాత ఆమె నేరుగా మహరాష్ట్రకు బయలేదేరారు. హైదరాబాద్ బిజెపిలో ఫైర్ బ్రాండ్ పేరున్న రాజాసింగ్ కు మాత్రం ఈ సారి మహరాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఆహ్వానం అందలేదు . ధీంతో ఆయన మహరాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నారు. కాని మాధవిలతను మాత్రం మహరాష్ట్ర బిజెపి శాఖ మాత్రం ఘనంగా ఆహ్వానించింది. తాను మహరాష్ట్రకు వచ్చినప్పుడు పుట్టింటికి వచ్చిన అనుభూతికి లోనయ్యానని మాధవిలత అక్కడ ఎన్నికల పచారంలో వ్యాఖ్యలు చేశారు.
మాధవిలత రాజాసింగ్ మధ్య విబేధాలు చాలకాలంగానే ఉన్నాయి. కానీ బయట మాత్రం సఖ్యతగా ఉన్నట్లు ఇద్దరూ కవరింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోకసభ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు మీడియా ప్రతినిధులు రాజాసింగ్ ను ప్రశ్నించినప్పుడు మాత్రం సమాధానాన్ని దాట వేశారు. తాను గోషా మహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాబట్టి హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో పర్యటించలేనన్నారు. పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి మాధవిలతకు సపోర్ట్ చేయాలని మౌఖికంగా చెప్పారు. రాజాసింగ్ తన తమ్ముడు వంటి వాడని మాధవిలత చెప్పినప్పటికీ ఎన్నికల ప్రచారంలో కల్సి పాల్గొనలేదు. రాజాసింగ్ మాధవిలత ఒకే ప్రేములో కనిపించలేదు. బోగస్ వోట్లతో మజ్లిస్ పార్టీ గెలుపొందుతూ వస్తోందని మాధవిలత ఆరోపిస్తూ వచ్చారు. చనిపోయిన వోటర్ల ను కూడా బతికి ఉన్నట్లు చూపించి మజ్లిస్ రిగ్గింగ్ కు పాల్పడుతుందని మాధవిలత ఆరోపిస్తూ వస్తున్నారు. మజ్లిస్ కార్పోరేటర్ కు చెందిన ఓ ఇంట్లో పోలింగ్ బూత్ ఉందని, ఆ బూత్ లోనే రిగ్గింగ్ జరిగిందని మాధవిలత ఆదారాలతో బయట పెట్టారు. తన సెల్ ఫోన్ లోనే రికార్డు చేసిన రిగ్గింగ్ దృశ్యాలను మాధవిలత సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇవే ఆధారాలు అని మాధవిలత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. వోటు వేయడానికి బురఖాతో వచ్చిన ఒక మహిళ హిజాబ్ తీసివేయాలని ఒక పోలింగ్ బూత్ లో అభ్యర్థి హోదాలో మాధవిలత అడగడం వివాదాస్పదమైంది. ముస్లిం మహిళ హిజాబ్ తీసివేయాలనడం చట్ట విరుద్దమని ఎన్నికల కమిషన్ పేర్కొంది. అంతే కాదు కేసు కూడా నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. పాత బస్తీలోని ఏడు నియోజకవర్గాల్లో రిగ్గింగ్ ను నిలువరించలేకపోయిందని, బోగస్ వోట్లను ఎన్నికల కమిషన్ ఏరివేయలేకపోయిందని మాధవిలత ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కు అన్ని ఆధారాలు ఇచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని మాధవిలత ప్రధాన ఆరోపణ. రిగ్గింగ్ జరిగిన ప్రాంతాల్లో రిపోలింగ్ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో మెజారిటీ వోట్లు గల్లంతయ్యాయని ఆమె ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే మాధవిలత ఆరోపణలను ఎన్నికల కమిషన్ ఖండించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు నాంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఇచ్చిన డాటానే మాధవిలత ఇచ్చిందని, తాను కొత్తగా ఇవ్వలేదని ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిన స్టేట్ మెంట్ వంత పాడాడు. పోలింగ్ జరిగిన తర్వాత కూడా మాధవిలత తన యుద్దాన్ని ఆపలేదు. ఎన్నికల కమిషన్ కు తన ఫిర్యాదుల పర్వం ఆపలేదు. హైదరాబాద్ లోకసభ పరిధిలో రీ పోలింగ్ జరపాలన్న మాధవిలత డిమాండ్ ను ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదు. ఓటు హక్కు రాని వోటర్లు తిరిగి తమ వోట్ల నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు ఇచ్చినప్పటికీ వోటర్లు పెద్దగా స్పందించలేదు. ఓటు నమోదు కార్యక్రమం కోసం మాధవిలత వాట్సాప్ లో క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసినప్పటికీ వోటర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో మాధవిలత మిన్నకుండిపోయారు. మాధవిలత ఓడిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా యాక్సెస్ మై ఇండియా, చాణక్యటుడే సర్వేలు మాత్రం మాధవిలత విజయం ఖాయమని డిక్లేర్ చేశాయి. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మాధవిలత గెలుపు బిగ్గెస్ట్ మిరాకిల్ అని చెప్పొచ్చు.