రక్తం దానం చేయడానికి ఏకంగా 440 కిలో మీటర్ల ప్రయాణం... షిర్డీ నుంచి ఇండోర్ కు చేరుకున్న దాత
posted on May 30, 2024 @ 12:08PM
రక్త దానం అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. చేసిన దానం సవ్యంగా వెచ్చించబడుతోందా, దుర్వినియోగం పాలవుతోందా అనే అనుమానం ఉండటం సహజం. దుర్వినియోగం అంటే మనం దానం చేసిన రక్తాన్ని కుళ్ళబెట్టి పారెయ్యడమయినా కావచ్చు లేదా నల్ల బజారులో అమ్మకానికి పెట్టినా పెట్టొచ్చు. మరి మహరాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి అరుదైన బ్లడ్ గ్రూప్ ను దానం చేయడం అందరినీ ఆకట్టుకుంది. రక్తాన్ని దానం చేయడమంటే ప్రాణాన్ని దానం చేసినట్టే. ఆ విషయం తెలుసు కాబట్టే ఓ వ్యక్తి ఏకంగా 400 కిలోమీటర్లు ప్రయాణించి చావుబతుకుల్లో ఉన్న ఓ మహిళ ప్రాణాలు నిలబెట్టాడు. ఇంతకీ ఆయన దానం చేసిన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? అత్యంత అరుదైన ‘బాంబే’ బ్లడ్ గ్రూప్.
మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన రవీంద్ర అష్తేకర్ (36) హోల్‌సేల్ పూల వ్యాపారి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహిళ (30) ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమెకు అత్యవసరంగా బాంబే బ్లడ్ గ్రూప్ అవసరమని వాట్సాప్‌లో సందేశం చూశాడు. అది చూసిన రవీంద్ర వెంటనే స్నేహితుడి కారులో షిర్డీ నుంచి బయలుదేరాడు. 440 కిలోమీటర్లు ప్రయాణించి ఈ నెల 25న ఇండోర్ చేరుకుని రక్తదానం చేసి ఆమె ప్రాణాలు కాపాడాడు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు తనవైపు నుంచి కొంతసాయం చేసినందుకు సంతోషంగా ఉందని రవీంద్ర పేర్కొన్నారు.
రవీంద్ర గత పదేళ్లలో 8సార్లు రక్తాన్ని దానం చేశారు. ఒక్క మహారాష్ట్రలోనే కాదు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో రక్తదానం చేశారు.
అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్‌ను 1952లో కనుగొన్నారు. ఈ గ్రూపు రక్తంలో ‘హెచ్’ యాంటీజెన్‌లు ఉండవు. బదులుగా యాంటీ హెచ్ యాంటీబాడీలు ఉంటాయి. ఈ గ్రూపు రక్తం కలిగినవారికి అటువంటి గ్రూపు కలిగిన వారు మాత్రమే రక్తం ఇవ్వాల్సి ఉంటుంది.