5 ప్రధాన నగరాల్లో పెరిగిన అద్దెలు! గిరాకీ తగ్గినా అద్దె పెరిగింది!
posted on May 4, 2020 @ 11:46AM
దేశంలో హైదరాబాద్ సహా 5 ప్రధాన నగరాల్లో ఆఫీసు కార్యాలయాల అద్దెలు ఏడాది వ్యవధిలో 8 శాతం వరకు పెరిగాయని అమెరికాకు చెందిన స్థిరాస్తి కన్సల్టెంట్ వెస్టియన్ నివేదిక వెల్లడించింది. 2020 జనవరి-మార్చిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్‌కతా నగరాల్లో కార్యాలయాల స్థలాలకు గిరాకీ 3 శాతం తగ్గినా, ఏడాది క్రితంతో పోలిస్తే అద్దెలు మాత్రం 8 శాతం వరకు పెరిగింది.
చదరపు అడుగు సగటు అద్దె బెంగళూరులో రూ.75.5 ఉండగా, హైదరాబాద్‌లో రూ.62గా ఉంది. చెన్నైలో చ.అడుగుకు రూ.60 ఉండగా, ముంబయిలో చ.అడుగుకు రూ.125గా ఉంది. కోల్‌కతాలో మాత్రం కార్యాలయాల అద్దె చ.అడుగుకు రూ.48గా ఉంది.
2020 జనవరి-మార్చి మధ్య కాలంలో ఈ ఐదు నగరాల్లో సుమారు 91.8 లక్షల చదరపు అడుగుల కార్యాలయాల స్థలాల్ని అద్దెకు తీసుకున్నారు. 2019 ఇదే కాలంతో పోలిస్తే ఇది 3 శాతం తక్కువ. తొలి రెండు నెలల్లోనే అధిక భాగం కార్యాలయాల స్థలాల్ని అద్దెకు తీసుకున్నారు. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ ప్రకటించగానే చాలా వరకు పెద్ద స్థాయి లీజింగ్ నిర్ణయాలు వాయిదా పడ్డాయి.
బెంగళూరులో 11 శాతం తగ్గి, 35.3 లక్షల చదరపు అడుగులకు, కోల్‌కతాలో 57 శాతం తగ్గి, 1.5 లక్షల చ.అడుగులకు, హైదరాబాద్‌లో 25 శాతం తగ్గి, 16.4 లక్షల చ.అడుగులకు గిరాకీ పరిమితమైంది. ముంబయిలో మాత్రం గిరాకీ 31 శాతం పెరిగి 23.9 లక్షల చ.అడుగులకు, చెన్నైలో 23 శాతం వృద్ధి చెంది, 14.7 లక్షల చ.అడుగులకు చేరిందని స్థిరాస్తి కన్సల్టెంట్ వెస్టియన్ నివేదిక తెలిపింది.
2020 తొలి త్రైమాసికంలో 75 లక్షల చదరపు అడుగుల కొత్త కార్యాలయాల స్థలాలు ఈ 5 నగరాల్లో కలిపి సిద్ధమయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే ఇది 22 శాతం తక్కువ అని నివేదిక విశ్లేషించింది.