ఉద్యోగం పోయింది. దొంగతనం చేసిన 21 ఏళ్ళ యువతి..
posted on Apr 30, 2021 @ 4:54PM
ఆమె ఓ యువతి. వయసు 21 సంవత్సరాలు. గతంలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసింది. కారణం ఏంటో తెలియదు గానీ ఆ యువతి ఉద్యోగం పోయింది. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అందుకోసం ఆమె ఒక కొత్త అవతారం ఎత్తింది. అదేంటని అనుకుంటున్నారా.. ? మీరే చూడండి ఏం చేసిందో..
ఆమె ఓ జ్యూయలరీ షాప్‌కు వెళ్ళింది. ఓనర్ తో అది చూపించండి.. ఇది చూపించండి అంటూ మాటల్లో పెట్టింది. ఓనర్ అమ్మాయి కదా అని ఆమెను ఏం అనలేదు. కానీ ఆమె మాత్రం బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించింది. ఇక అంతే ఆమె దొంగతనాన్ని గమనించిన షాప్ యజమాని ఆమె పారిపోకుండా పట్టుకున్నాడు. చుట్టుపక్కన ఉన్నవారందరినీ పిలిచాడు. ఈ యువతి షాప్‌లో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుంటే పట్టుకున్నానని వాళ్లకు చెప్పాడు. అక్కడ వచ్చిన చుట్టుపక్కల వారందరి ముందే ఆ యువతిని రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి కట్టేశారు. ఆమె చేతులను తాళ్లతో కట్టేసిన తర్వాత ఆ యువతిని దుర్భాషలాడుతూ దాడికి దిగారు.
కట్ చేస్తే..ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన జరుగుతున్న స్థలానికి వచ్చారు. పోలీసులు వెళ్లే సరికి ఆమెను స్తంభానికి కట్టేసి మాకు ఏం సంబంధం లేదన్నట్లు. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అసలు అప్పటిదాకా ఏమీ జరగనట్టు, ఆమెను ఎవరో వచ్చి కట్టేసి వెళ్లిపోయినట్లు ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఆమెకు కట్లు విప్పిన పోలీసులు ఆ యువతిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.
దీంతో.. ఆమె అసలు నిజం బయటపెట్టింది. దొంగతనానికి ప్రయత్నించిన మాట వాస్తవమేనని.. కానీ దాని వెనుక ఓ కారణం ఉందని ఆమె చెప్పింది. తాను అంతకు ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశానని.. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయానని చెప్పింది. కొన్నిరోజుల క్రితం తనకు తెలిసిన వ్యక్తి ‘నవ్‌కర్ ఆర్నమెంట్స్’లో చోరీ చేయమని చెప్పి తనను ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేశాడని తెలిపింది.
షాప్‌లోకి వెళ్లి మత్తు మందును ఓనర్‌పై స్ప్రే చేసి జ్యూవెలరీని దొంగిలించి తీసుకొచ్చి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు చెప్పింది. తాను చెప్పినట్లు చేయకపోతే.. నీకున్న అఫైర్ గురించి బయటపెడతానని తనను బెదిరించాడని ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. ఈ బెదిరింపు వ్యవహారం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఓ వ్యక్తితో తనకు కొంతకాలంగా అఫైర్ ఉందని ఆ యువతి అంగీకరించింది. ఈ విషయం బయట తెలిస్తే ఇబ్బంది అవుతుంది చెపింది.
ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కరోనా వచ్చి ప్రాణం తియ్యడమే కాదు. ఉద్యోగం కూలిపోయి నిరుద్యోగం కొంత మంది పాలిట శాపంగా మారింది.