Read more!

2 వేల నోటు ఇక ఉండదా! 

రెండు వేల నోటుపై ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. 2 వేల నోటును కేంద్ర సర్కార్ రద్దు చేస్తుందనే ప్రచారం కూడా చాలా సార్లు జరిగింది. అయితే తాజా కేంద్ర ప్రభుత్వమే రెండు వేల నోటుకు సంబంధించి కీలకమైన ప్రకటన చేసింది.  2019 ఏప్రిల్ నుంచి రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడంలేదని ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

ఎన్డీయే సర్కారు 2017లో పెద్ద నోట్లను రద్దు చేసింది.  వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకువచ్చింది. పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర సర్కార్... మునుపెన్నడూ లేనివిధంగా రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. దీవిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగానే  కొద్దికాలానికే రెండు వేల నోటు లభ్యత తగ్గిపోయింది. తాజాగా ఈ అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది.ఈ నోట్లను పెద్ద ఎత్తున దాచుకోవడంతో పాటు, నల్లడబ్బు రూపేణా విపణిలో చలామణీ చేసే అవకాశం ఉందని... అందుకే ఈ నోట్ల ముద్రణను రెండేళ్లుగా నిలిపివేసినట్టు వివరించారు. లోక్ సభలో ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చర్చించిన మీదటే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

2018 మార్చి 30 నాటికి దేశంలో 3,362 మిలియన్ల రూ.2000 నోట్లు చలామణీలో ఉండగా... 2021 ఫిబ్రవరి నాటికి కేవలం 2,499 మిలియన్ల రూ.2000 నోట్లు చలామణీలో ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. కేంద్ర సర్కార్ నిర్ణయం ప్రకారం త్వరలో రెండు వేల నోటు రద్దు కాబోతోందని తెలుస్తోంది. రెండేండ్లుగా కొత్త నోట్లు ముద్రణ కావడం లేదు. అంటే ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల వరకే మార్కెట్లో వినియోగంలో ఉంటాయన్న మాట. దీన్ని బట్టి కొంత కాలానికి 2 వేల నోటు మొత్తానికే కనిపించకుండా పోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.