Read more!

రెండేళ్లయింది.. వివేకా కేసు ఏమైంది?

వైసీపీ నేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండు సంవత్సరాలు పూర్తయింది. పులివెందులలో వైఎస్ వివేకా రెండో వర్ధంతిని నిర్వహించారు.డిగ్రీ కళాశాల రోడ్డుకు సమీపంలో ఉన్న వైఎస్‌ కుటుంబీకుల సమాధుల ప్రాంగణంలో ఆయన సమాధి వద్ద పలువురు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన స్మారకార్థం నిర్మించిన చిన్న పిల్లల పార్కును ప్రారంభించారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి 2019 మార్చి 14 అర్ధరాత్రి తర్వాత పులివెందులలో తన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే వైఎస్ వివేకా వర్థంతి కార్యక్రమానికి కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులు హాజరుకాలేదు. వివేకా హత్య ఘటనపై ఆయన కూతురు మారెడ్డి సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల జాబితాలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిల పేర్లు ఉన్నాయి.  

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై రెండేండ్లు పూర్తైనా.. ఇప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులను గుర్తించలేదని, చార్జిషీటు కూడా దాఖలు చేయలేదని అన్నారు. ఇలా చేయడం వల్ల పోలీసు వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సిట్, సీబీఐలపై ప్రజలకు ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుందని తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయని తులసిరెడ్డి అన్నారు. 

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించిన తర్వాత, తొలిసారి షర్మిల తన తల్లితో కలిసి పులివెందుల వచ్చారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందారెడ్డి రెండో వర్ధంతి కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. అనంతరం షర్మిల వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌కు చేరుకొని తన తండ్రి సమాధి వద్ద నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వైసీపీ కీలక నాయకులు, గతంలో షర్మిలతో సన్నిహితంగా ఉన్న నాయకులు సైతం ఆమెను కలిసి పలకరించలేదు