ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తొలి అరెస్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపణలు
posted on Sep 29, 2022 @ 11:06AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. ‘ఓన్లీ మచ్ లౌడర్’ అనే ఈవెంట్స్ సంస్థ మాజీ సీఈఓ విజయ్ నాయిర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. విజయ్ నాయిర్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనిష్ శిశోడియా, మరో 13 మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో సీబీఐ చేర్చింది. వారిలో విజయ్ నాయిర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. మనీష్ శిశోడియాకు అత్యంత సన్నిహితంగా మెలిగే ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో సభ్యుగు విజయ్ నాయిర్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రముఖ పాత్ర పోషించినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించింది.
కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఈ లిక్కర్ స్కామ్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో దూకుడు పెంచడం తెలుగు రాష్ట్రాల్లోని నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు రాజకీయ నేతలకు లింకులు ఉన్నాయంటూ కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కేసుతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు సంబంధాలు ఉన్నాయనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విజయ్ నాయిర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ తదుపరి అరెస్టు ఎవరిదై ఉంటుంది అనే ఆందోళనతో పలువులు ఉన్నారంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సీబీఐ కేసులు నమోదు చేసిన తర్వాత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేస్తోంది. బినామీల ద్వారా ఢిల్లీలో లిక్కర్ దందాలో పెట్టుబడులు పెట్టారనే కోణంలో విచారణ జరుగుతోందంటున్నారు. బినామీల పేరుతో అనధికారికంగా పెట్టుబడులు పెట్టి, నల్లధనాన్ని వైట్ చేసుకున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన కీలక సమాచారం ఈడీ అధికారులకు దొరికిందని అంటున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్కామ్ తో సంబంధాలున్న రాజకీయ నేతల హార్ట్ బీట్ పెరిగిపోతోందని అంటున్నారు. అనుమానిత సంస్థలు, వాటికి సంబంధించిన లావాదేవీలను బట్టబయలు చేసే పనిలో ఈడీ అధికారులు నిమగ్నమై ఉన్నారనే తెలుస్తోంది.
ఈ స్కామ్ తో లింకులు ఉన్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల పై ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే ఏపీ సీఎం సతీమణి భారతి పేరు కూడా తెర మీదకు వచ్చింది. అలాగే హైదరాబాద్ లో ఉన్న పలువురి ఇళ్లలో సీబీఐ సోదాలు చేసింది. ఈ కేసులో ఏ14గా ఉన్న మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసం, కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సీబీఐ సోదాలు నిర్వహించింది. రామచంద్ర పిళ్లై వ్యాపార భాగస్వాములుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్లలో కూడా తనిఖీలు జరిపింది. ఏపీలోని ప్రముఖ వ్యాపారవేత్త, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి సంబంధించిన సంస్థల్లో ఈడీ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఇప్పుడు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి తొలి అరెస్ట్ జరగడంతో తదుపరి ఎవరి వంతు వస్తుందో అనే ఆందోళన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నెలకొందని తెలుస్తోంది.