అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్
posted on Jun 13, 2020 8:22AM
ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే అచ్చెన్నాయుడికి ఇటీవల శస్త్ర చికిత్స జరగడంతో, ఆయనకు ఆస్పత్రిలో వైద్యం అందించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు తొలుత అచ్చెన్నాయుడిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అనంతరం జైలు అధికారుల అనుమతితో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక, ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేష్ కుమార్‌ను రాజమండ్రి సబ్ జైలుకు తరలించారు.
ఈఎస్ఐ మందులు కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన కేసులో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అచ్చెన్నాయుడితోపాటు రమేష్ కుమార్‌ను కూడా న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వాదనల అనంతరం అచ్చెన్నాయుడు, రమేష్ కుమార్‌లకు న్యాయమూర్తి రెండు వారాల పాటు రిమాండ్ విధించారు.
అచ్చెన్నాయుడికి శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రిలో గురువారం స్వల్ప శస్త్రచికిత్స జరిగింది. కరోనా ఉధృతి కారణంగా ఆస్పత్రిలో విశ్రాంతి తీసుకోడానికి వీలులేకపోవడంతో ఆయన నిమ్మాడ వెళ్లారు. ఇదే విషయాన్ని న్యాయమూర్తికి అచ్చన్నాయుడు తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తెలిపారు. దీంతో గుంటూరు ఆస్పత్రిలో అచ్చెన్నాయుడికి వైద్యం అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు.