ఏపీ అసెంబ్లీలో తొలి రోజే రచ్చ! 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్
posted on Nov 30, 2020 @ 4:44PM
శీతాకాల సమావేశాల్లో తొలి రోజే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. తుపాను పంట నష్టంపై సభలో అధికార, విపక్షాల మధ్య రగడ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలకు సీఎం జగన్ సమాధానం ఇచ్చారు. అయితే సీఎం జగన్ సమాధానంపై మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా.. చంద్రబాబు ఎలా మాట్లాడుతారంటూ అధికార పక్షం అడ్డుకుంది. దీంతో అధికార పక్షం తీరుకు నిరసనగా చంద్రబాబు పోడియం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా 12 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయస్వామి, రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, భవానీ, గద్దె రామ్మోహన్, జోగేశ్వరరావు, సత్యప్రసాద్, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవానీ, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్ సస్పెండ్ అయ్యారు. దీంతో అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన చంద్రబాబు, ఎమ్మెల్యేలు.. రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఫ్లోర్‌పై కూర్చున్న ప్రతిపక్షనేత చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. సభలో రౌడీయిజం చేస్తున్నారని, మళ్లీ ఆయనకేదో అన్యాయం జరిగిపోతున్నట్లు చంద్రబాబు తీరు ఉందన్నారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్ నెలాఖరునాటికి ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని సీఎం చెప్పారు. చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని, గతంలో ఏ ప్రతిపక్ష నేత ఇలా వ్యవహరించలేదని జగన్మోహన్ రెడ్ది అన్నారు.వయస్సుకు తగ్గట్టు చంద్రబాబు వ్యవహరించాలని సీఎం అన్నారు.
శాసనమండలిలోనూ తుపాను నష్టంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలు వ్యవసాయమే దండగని చంద్రబాబు అన్నారని మంత్రి బొత్ససత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై నారా లోకష్ సీరియస్ అయ్యారు. ఎప్పుడు, ఎక్కడ చెప్పారో నిరూపించాలని, ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. లేదంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సభ్యతకాదని మంత్రికి సూచించారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని మంత్రి బొత్సపై నారా లోకేశ్ మండిపడ్డారు.
నారా లోకేశ్ కు ఏ పంట ఎక్కడ పండుతుందో తెలుసా అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. తన ప్రశ్నకు లోకేశ్ సరైన జవాబు చెబితే తాను తల దించుకుని కూర్చుంటానని బొత్స సవాల్ చేశారు. ట్రాక్టర్ ఎక్కి ఫొటోలకు పోజులివ్వడం కాదు... ట్రాక్టర్ ను బురదగుంటలోకి పోనివ్వడం తప్ప ఏం తెలుసు?.. చివరికి ఆ ట్రాక్టర్ ను రైతులతో బయటికి తీయించారు అంటూ లోకేశ్ పై విరుచుకుపడ్డారు. బొత్స వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు కూడా దీటుగా స్పందించారు. మంత్రి బొత్స వ్యాఖ్యల పట్ల ఆందోళనకు దిగడంతో మండలిలో గందరగోళం ఏర్పడింది. అటు వైసీపీ సభ్యులు కూడా చైర్మన్ పోడియం వద్దకు దూసుకువచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాసనమండలిని రేపటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు.