ఒక్కరోజులో 10,00,000 కేసులు! 'మే'లో మరింత ముప్పు..
posted on Apr 26, 2021 @ 4:06PM
సెకండ్ వేవ్ సునామీలా చుట్టేస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 2 లక్షలకు చేరుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక ముందుముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మే నెలలో కొవిడ్ ఉద్ధృతి తారస్థాయికి చేరుతుందంటూ.. మిచిగాన్ యూనివర్సిటీ చెబుతుండటం ఆందోళన రేపుతోంది. భారత్‌లో మే నెల మధ్యనాటికి రోజువారీ కేసుల సంఖ్య 8 నుంచి 10 లక్షలకు చేరుతాయని మిచిగాన్ విశ్వవిద్యాలయం హెచ్చరించింది. మే 23 నాటికి రోజుకు 4,500 మంది మరణించే అవకాశం ఉందట.
యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ ఇవాల్యువేషన్ (ఐహెచ్‌ఎంఈ) మాత్రం మే నెల ప్రారంభంలోనే.. అధికారిక, అనధికారిక లెక్కలతో కలిపి రోజుకు 10 లక్షల కన్నా ఎక్కువగానే కేసులు నమోదవుతాయని అంచనా వేసింది.
ఏప్రిల్ 1 నుంచి కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా.. కొవిడ్ వేరియంట్లు కాకుండా మరేమైనా కారణాలున్నాయా? అని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశ కరోనా కేసులు తగ్గిన తర్వాత మాస్కులు పెట్టుకోకపోవడం కూడా తీవ్రతకు కారణం కావచ్చని అభిప్రాయపడుతున్నారు. కరోనాని జయించామనే భావన ప్రజల్లో రావడం.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరగకపోవడం వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చిందని అంచనా వేస్తున్నారు.
గతేడాది చివర్లో తగ్గిన వైరస్.. ఆ తర్వాత చాపకింద నీరులా దేశాన్ని చుట్టేసింది. 1918లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ అనే ఇన్‌ఫ్లూయంజా సైతం అమెరికా, యూకేలలో ఈ తరహాలోనే విజృంభించింది. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యల్లో అలసత్వం కూడా వైరస్ తీవ్రరూపానికి కారణమవుతోంది.
మొదటి దశతో పోలిస్తే, రెండో దశలో మరణాల సంఖ్య అధికంగా ఉండనుందని మిచిగాన్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు హెచ్చరిస్తున్నారు. రానున్న ఆగస్టు 1 నాటికి దేశంలో 6.64 లక్షల కొవిడ్ మరణాలు సంభవిస్తాయని ఐహెచ్‌ఎంఈ అంచనా వేసింది. ఊహించిన దానికంటే అధిక మరణాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలిపింది.
ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఢిల్లీలో కేసులు పెరిగే అవకాశం ఉందట. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, కర్ణాటకలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపింది. బెంగాల్, యూపీ, బిహార్, కేరళలో లాక్‌డౌన్ విధించే పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని బట్టే మూడో దశ వస్తుందా, రాదా.. అనేది ఆధారపడి ఉందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితిని తట్టుకునేందుకు మెరుగైన ప్రజారోగ్య వ్యవస్థ అవసరమని సూచించింది.