అన్ని పార్టీలు చుట్టేసిన రాములమ్మ! ఈసారైనా సెటిలయ్యేనా?
posted on Nov 9, 2020 @ 3:34PM
22 ఏండ్లు.. ఐదు పార్టీలు.. ఒకసారి ఎంపీ పదవి. ఇవీ తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండుగా పిలుచుకునే విజయశాంతి అలియాస్ రాములమ్మ రాజకీయ చరిత్రను సూచించే లెక్కలు. సినిమా రంగం నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన విజయశాంతి.. ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండలేకపోయారు. నాలుగు పార్టీలు మార్చారు. సొంతగా ఒక పార్టీ పెట్టుకుని కొంత కాలానికి దుకాణం ఎత్తేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రచార కమిటి చైర్మెన్ గా ఉన్న ఆమె,, త్వరలోనే బీజేపీలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.
1998లో బీజేపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు విజయశాంతి. తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. 2009లో ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి కేసీఆర్ తో కలిసి పనిచేశారు రాములమ్మ, 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్ సభ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. కేసీఆర్ తర్వాత గులాబీ పార్టీలో నంబర్2 పొజిషన్ లో విజయశాంతి ఉన్నారనిపించింది. అయితే కొద్ది రోజులకే కేసీఆర్ తో ఆమెకు విభేదాలొచ్చాయి. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాసైన సందర్భంలో ఆమె టీఆర్ఎస్ ఎంపీగా సభలోనే ఉన్నారు. అయితే కేసీఆర్ తో మాత్రం దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయశాంతిని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచార కమిటీ చైర్మెన్ ను చేశారు.
ఫైర్ బ్రాండ్ లేడీగా రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి ఎక్కడా స్థిరంగా ఉండకపోవడంపై విమర్శలకు తావిచ్చింది. ఆవేశపూరిత నిర్ణయాలే ఆమెకు నష్టం కల్గించాయనే భావన వ్యక్తమవుతోంది. ఎల్ కే అద్వాని శిష్యురాలిగా బీజేపీలో చేరిన రాములమ్మకు ఆ పార్టీలో మంచి గుర్తింపే దక్కింది. అయితే కొంత కాలానికే ఆమె తల్లి తెలంగాణ పేరుతొ సొంత పార్టీ స్థాపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే దేవేందర్ గౌడ్ పీఆర్పీ వైపు మొగ్గు చూపడంతో.. విజయశాంతి ఆయనతో విభేదించారు. అనూహ్యంగా తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు.
2009లో టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి.. కొంత కాలానికే ఆ పార్టీ నేతలతో విభేదాలొచ్చాయి. ఎంపీగా ఉంటూనే టీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం పీక్ స్జేజీలో ఉన్న సమయంలోఎంపీగా ఉన్న విజయశాంతి.. కేసీఆర్ తో మాత్రం గ్యాప్ పెంచుకుంటూనే వచ్చారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కొన్ని ఆందోళనల్లో పాల్గొన్నారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ 2013లో రాములమ్మని టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక 2014లో విజయశాంతి కాంగ్రెస్ లో చేరారు.
కాంగ్రెస్ లోనూ విజయశాంతికి మంచి స్థానమే దక్కింది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమెను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. తర్వాత ప్రచార కమిటి చైర్మెన్ చేశారు. నిజానికి ఎన్నికల ప్రచారంలో తప్ప మిగితా సమయంలో ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనరు. కొన్ని సార్లు నెలల తరబడి ఆమె బయటికే రారని ఆరోపణలున్నాయి. అయినా రాములమ్మకు కీలక పోస్టులు కట్టబెట్టింది కాంగ్రెస్. విజయశాంతికి కాంగ్రెస్ పెద్దలతోనూ మంచి సంబంధాలు ఉండేవంటారు. అందుకే టీపీసీసీ నేతలతో పని లేకుండానే ఆమెకు పార్టీలో కీలక పోస్టులు వచ్చాయంటారు. అయితే ఈ మధ్య రాష్ట్ర పార్టీ సీనియర్లు తనను పట్టించుకోవడం లేదని, కొన్ని కీలక సమావేశాలకు పిలవలేదనే భావనలో విజయశాంతి ఉన్నారని చెబుతున్నారు. దీంతో ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి ఆమె దూరంగా ఉన్నారు. గతంలో మెదక్ ఎంపీగా పనిచేసిన విజయశాంతి.. అదే జిల్లా పరిధిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉప ఎన్నికను పట్టించుకోకపోవడంతోనే ఆమె పార్టీ మారడం ఖాయమనే సంకేతమిచ్చింది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో రాములమ్మ పార్టీ మారకపోవచ్చని భావించారు. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్ తో పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.
బీజేపీ నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాములమ్మ.. తిరిగితిరిగి మళ్లీ అదే పార్టీ చేరబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెకు బీజేపీలో జాతీయ స్థాయి నాయకులతో మంచి పరిచయాలున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఘాటు విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో చేరి తనదైన ముద్ర వేసి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఇప్పుడు బీజేపీలో చేరడం.. అటు ఆ పార్టీకి, ఇటు ఈమెకు కూడా లాభం చేకూర్చే అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీజేపీలో ఈసారైనా విజయశాంతి నిలదొక్కుకోగలుగుతుందా లేద మళ్లీ కొన్ని రోజులపై పార్టీ మారుతుందా అన్నదానిపైనా చర్చ జరుగుతోంది.