ఫేక్ వీడియోతో అమరావతిపై మరోసారి విషం కక్కిన వైసీపీ
posted on Aug 28, 2025 @ 5:44PM
వైసీపీ ఫేక్ ప్రచారం విషయంలో డాక్టరేట్ సాధించిందా అనిపించక మానదు. పదే పదే ఫేక్ ప్రాపగాండాతో ప్రజలను తప్పుదోవపట్టించాలన్న ఆ పార్టీ ప్రయత్నాలు విఫలమౌతూ వస్తున్నాయి. అయినా వైసీపీ తీరు మారడం లేదు. ముఖ్యంగా అమరావతి విషయంలో వైసీపీ ఫేక్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పలు సార్లు ఇలాంటి ప్రచారాన్ని వ్యాప్తి చేసి విఫలమైన వైసీపీ తాజాగా మరో సారి అదే విషప్రచారానికి తెగబడింది. ఇప్పటికే అమరావతి వరదల్లో మునిగిపోయిందంటూ నకిలీ వీడియోలను విడుదల చేసి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ఇప్పుడు తాజాగా మరో ఫేక్ వీడియోతో అమరావతిలో దళితులకు అవమానం జరుగుతోంది. వారిపై దాడులు జరుగుతున్నాయంటూ జనాలను నమ్మించడానికి ప్రయత్నించింది.
వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ నకిలీ వీడియోలో ఒక దళిత మహిళను అవమానానికి గురి చేస్తున్నట్లుగా ఉంది. ఒకింత నిశితంగా పరిశీలిస్తే అది ఫేక్ వీడియో అని ఇట్టే తేలిపోతుంది. ఎందుకంటే ఆ వీడియో తమిళ టెక్స్ట్ స్పష్టంగా కనిపి స్తున్నది. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఆ వీడియో అమరావతికి సంబంధించినదని చెప్పుకుంటోంది. అలా చెప్పడం ద్వారా అమరావతిలో దళితులకు అన్యాయం జరుగుతోందని, వారి మనోభావాలు దెబ్బతింటున్నాయనీ చాటడం ద్వారా కుల విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. ఇవన్నీ చూస్తుంటే.. అమరావతికి, దళితులకు వ్యతిరేకంగా వైసీపీ చేసే ఫేక్ ప్రచారానికి అంతం అన్నదే ఉండదా అనిపించక మానదు. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం కూటమి వర్గాలు.. ఈ ఫేక్ వీడియో పోస్టు చేసిన వారు చట్టపరమైన చర్యలను ఎదుర్కొనక తప్పదని హెచ్చరించాయి.