కాలి వేలికి ఫ్రాక్చర్.. అవి గాయాలే! సుప్రీం బోణులో జగన్‌రెడ్డి సర్కార్?
posted on May 21, 2021 @ 1:48PM
అవును, అవి గాయాలే. రఘురామ కాళ్లకు ఉన్నవి గాయాలే. కేవలం గాయాలు మాత్రమే కాదు.. రఘురామ కాలి వేలికి ఫ్రాక్చర్ కూడా అయిందంటూ సికింద్రాబాద్ ఆర్మీ వైద్యుల బృందం సుప్రీంకోర్టుకు షీల్డ్ కవర్‌లో నివేదిక ఇచ్చింది. కోర్టు పర్యవేక్షకుడి సమక్షంలో, వీడియో చిత్రీకరణ మధ్య జరిగిన మెడికల్ కమిటీ పరిశీలన రిపోర్ట్ దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు భద్రంగా ఉంది. ఆ నివేదికలో.. ఏపీ సర్కారును కోర్టు ముందు దోషిగా నిలబెట్టే అంశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. రఘురామకు జనరల్ ఎడిమా ఉందని.. ఆయన ఎడమ కాలి వేలికి ఫ్రాక్చర్ అయిందని.. కాలికి మరికొన్ని గాయాలు కూడా ఉన్నట్టు నివేదికలో పొందుపరచడం సంచలనంగా మారింది. అందుకు సాక్షంగా రఘురామ కాలికి తీసిన ఎక్స్‌రే రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టుకు అందజేశారు.
ఏపీ సీఐడీ పోలీసులు.. కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న తమ ఆరోపణలు నిజమని తేలాయని రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. ఏపీ సీఐడీ అధికారుల చిత్రహింసలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే స్పందిస్తూ రఘురామే స్వయంగా చేసుకున్న గాయాలా? కాదా? అన్నది తెలియదన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు స్వయంగా గాయాలు చేసుకున్నారని అంటున్నారా? అని ధర్మాసనం న్యాయవాది దవేను ప్రశ్నించింది. వైద్య పరీక్షల నివేదికను ఏపీ ప్రభుత్వం, న్యాయవాదులకు మెయిల్ చేస్తామని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు నివేదికకు.. ఆర్మీ వైద్యుల బృందం ఇచ్చిన మెడికల్ రిపోర్టుకు మధ్య ఎంతో తేడా ఉంది. ఫోటోలలో రఘురామ పాదాలకు గాయాలైనట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. అవి గాయాలు కావు.. ఎడిమా వల్ల వచ్చిన మచ్చలు అంటూ రాష్ట్ర వైద్యుల బృందం నివేదిక ఇవ్వడంపై ఆనాడే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ రిపోర్ట్ పచ్చి అబద్దమని ప్రస్తుత.. ఆర్మీ వైద్యుల నివేదికతో తేలిపోతోంది. అయినా.. ప్రభుత్వ న్యాయవాది అవి కస్టడీలో ఉన్నప్పుడు అయిన గాయాలు కాకపోవచ్చనే అర్థం వచ్చేలా వాదించడం.. అందుకు ధర్మాసనం స్పందిస్తూ.. అయితే ఆ గాయాలు రఘురామనే స్వయంగా చేసుకున్నారా? అంటూ కౌంటర్ వేయడం ప్రభుత్వ దురుద్దేశాన్ని ప్రశ్నించేలా ఉంది.
రఘురామరాజు కాలి దెబ్బల ఫొటోలు చూసిన హైకోర్టు డివిజనల్ బెంచ్ గత వారమే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించింది. దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఆర్మీ వైద్యులు షీల్డ్ కవర్‌లో ఇచ్చిన రిపోర్టులో రఘురామ కాలికి గాయాలు ఉన్నాయని తేల్చడంతో విషయం మరింత ముదిరింది. హైకోర్టు చెప్పినట్టుగానే పరిణామాలు తీవ్రంగా ఉండనున్నాయి.
రఘురామ కాలి గాయాల ఫోటోలు బయటకు వచ్చినప్పుడే ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఓ పార్లమెంట్ సభ్యుడిని అంతలా హింసించడం ఏంటని మండిపడ్డారు. ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఘోరం. క్రూరం. దారుణం. పైశాచికత్వం. కక్ష కడితే.. మరీ ఇంతలా కొడతారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. మరీ ఇంత దారుణంగా హింసిస్తారా? పాదాలు నల్లగా కమిలేలా.. కాళ్లు వాచిపోయేలా.. ఓ రౌడీనో.. ఏ గుండానో కొట్టినట్టు క్రూరంగా కొడతారా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులపై పోస్టులతో జగన్‌రెడ్డి సర్కారును, ఏపీ సీఐడీని ఉతికారేశారు నెటిజన్లు.
రఘురామ కాలి వేలికి సైతం ఫ్రాక్చర్ అయిందంటే.. అంతా అనుమానిస్తున్నట్టు.. రఘురామ ఆరోపించినట్టు.. అది పోలీసుల దెబ్బల వల్లే జరిగితే.. అంతకంటే దారుణం మరొకటి ఉండకపోవచ్చు. ఓ ఎంపీని కాలి వేలు విరిగేలా కొట్టడం పైశాచికత్వం కాక మరొకటి కానేకాదు. పాదాలు వాచేలా.. నల్లగా కమిలేలా.. లాఠీలతో కొట్టారంటే.. ఏపీలో ఉంది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? పోలీసు రాజ్యమా? ప్రభుత్వ విధానాలను తప్పుబట్టినందుకు ఇంత ఘోరంగా హింసిస్తారా? కాళ్లకు తాళ్లు కట్టి.. ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకొని.. కాలి ఎముక విరిగేలా లాఠీలతో కొడతారా? రఘురామ ఆరోపించన విషయాలన్నీ రుజువని తేలితే.. ఆ గాయాలు కస్టడీలో ఉన్నప్పుడే అయ్యాయని సుప్రీంకోర్టు భావిస్తే.. ఇక ఏపీ ప్రభుత్వానికి, సీఐడీ పోలీసులకు.. దేత్తడి.. పోచమ్మ గుడే. ముందుముందు జగన్‌రెడ్డి సర్కారుకు ముసళ్ల పండగే.