హోంమంత్రి సబితాకు షాకిచ్చిన సీబీఐ
posted on Apr 8, 2013 @ 7:34PM
జగన్ అక్రమ ఆస్తుల కేసులో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి సిబిఐ షాక్ ఇచ్చింది. తాజాగా సి.బి.ఐ. నమోదు చేసిన ఐదవ ఛార్జి షీటులో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఆమె నాల్గవ నిందితురాలుగా ఉన్నారు. 120 బి, 420 సెక్షన్ల క్రింద, అలాగే అవినీతి నిరోధక చట్టం 9.12,13, 13(1) సెక్షన్ల క్రింద శ్రీమతి సబిత పేరును ఛార్జి షీటులో నమోదు చేశారు. సి.బి.ఐ, మొత్తం 13 మందిపై ఇందులో అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ కార్యదర్శి అయిన శ్రీలక్ష్మిని ఐదవ నిందితురాలు గా చేర్చారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి మొదటి సారి గెలుపొందినప్పుడు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఆమె 407 ఎకరాలను కడపలో దాల్మియా సిమెంట్సుకు కేటాయించారని సి.బి.ఐ. అభియోగం మోపింది. అందుకు ప్రతిగానే దాల్మియా సుమారు 95 కోట్లు జగన్ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్టు సి.బి.ఐ. తమ అభియోగ పత్రంలో పేర్కొన్నది.
సండూర్ వవర్, లేపాక్షి నాలెడ్జ్ హబ్, భారతి సిమెంట్స్, పెన్నా, దాల్మియా, ఇండియా సిమెంట్స్‌పై విడివిడిగా చార్జ్‌షీట్లు నమోదు చేస్తున్నట్టు సి.బి.ఐ. తెలియజేసింది ఆ సమయంలో అయినవారికి భూములు పంచిపెట్టడానికి మొత్తం 26 జి.ఓ.లు విడుదల అయిన విషయాన్ని కూడా సి.బి.ఐ. కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.