తెలంగాణను నొప్పించకండి... వైసీపీ నాయకులకు పవన్ వార్నింగ్!
posted on Apr 18, 2023 @ 10:05AM
తెలంగాణ మంత్రి చేసిన ప్రకటనకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, మంత్రులు చేసిన ప్రకటనల వల్ల తెలంగాణ ప్రజలు తీవ్ర మనస్థాపానికి లోనయ్యారని, వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాలకులు, ప్రజలు వేర్వేరు అని , తెలంగాణ ప్రజల మనస్సులను గాయపరిచే వ్యాఖ్యలు చేయడం శోచనీయమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలను ఎలాంటి వివాదాల్లో లాగొద్దని ఆయన వైఎస్ఆర్ సీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఈ వాఖ్యల మీద వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వం స్పందించాలన్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు మీద ఆంధ్ర ప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బొత్స వ్యాపారాలు తెలంగాణలోనే ఉన్నాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
ఒక మంత్రి తప్పుగా మాట్లాడితే ముఖ్యమంత్రి జగన్ ఖండించాలని పవన్ డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. కొందరు నేతలు ఎగిరెగిరి పడుతున్నారని, ఉన్నది అంటే ఉలిక్కిపడుతున్నారంటూ సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఏపీ నేతలపై మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాడడం లేదని, పోలవరం పనులు ఎందుకు పూర్తికావడం లేదని నిలదీశారు. ఇందులో ఏమైనా తప్పుందా అని నిలదీశారు. తాను ప్రజల పక్షాన మాట్లాడానని, ఏపీ గురించి తప్పుగా మాట్లాడలేదని హరీష్ వివరణ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ మా బిడ్డలేనని హరీష్ రావ్ పేర్కొన్నారు.
ఏపీ ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి, బాగుండాలని చెప్పానన్నారు. తాము ఆంధ్రప్రదేశ్ గురించి తప్పుగా ఏం మాట్లాడలేదన్నారు. తెలంగాణలో అన్ని బాగున్నాయని.. ఇక్కడే ఉండండి అనీ, ఆ రోజు అన్నానన్నారు. కానీ ప్రజల్ని, ఏపీని కించ పరచే విధంగా మాట్లాడాను అని కొందరు నాయకులు ప్రచారం చేశారని , అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నానన్నారు. అడిగినదానికి సమాధానం చెప్పలేక ఇలాంటి మాటలాడుతున్నారని విమర్శించారు. చేతనైతే జాతీయ హోదా కోసం పోరాడాలని హితవు పలికారు. విశాఖ ఉక్కు కోసం పోరాడాలని, పోలవరం తొందరగా పూర్తి చేసి కాళేశ్వరంలా నీళ్లు అందించాలన్నారు. పవన్ స్టేట్ మెంట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడినట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.