గుజరాత్ లో తొలి దశ పోలింగ్
posted on Dec 13, 2012 @ 1:22PM
గుజరాత్ లో నేడు తొలి దశ పోలింగ్ ప్రారంభమయింది. మొత్తం 182 స్థానాలకు గాను, 12 జిల్లాల్లోని 87 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.
సుమారు 1.81 కోట్ల మంది ఓటర్లు 846 అభ్యర్దుల భవితవ్యాన్ని నేడు తేల్చనున్నారు. అధికార బిజెపి నుండి 40 మంది, కాంగ్రెస్ నుండి 16 మంది సిట్టింగ్ ఎంఎల్ఏ లు నేడు జరిగే పోలింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగెస్ నుండి ముగ్గురు సిట్టింగ్ ఎంపి లు బరిలోకి దిగారు.
అయితే, ప్రీ పోల్ సర్వే ఫలితాలు ముఖ్య మంత్రి నరేంద్ర మోడి కి అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, అందులో బిజెపి కి 122 స్థానాలు వస్తాయని ఓ సర్వే వెల్లడించింది. ఓట్ల శాతం పెరిగితే, ఈ సంఖ్య 130 కి చేరవచ్చని కూడా ఆ సర్వే వివరించింది. దీనితో, మూడింట రెండొంతుల మెజారిటీతో నరేంద్ర మోడి తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. గత ఎన్నికల్లో బిజెపి 117 సీట్లు మాత్రమే సాధించగలిగింది.
అందులో కాంగ్రెస్ కు 53 సీట్లు, కేశూభాయ్ పటేల్ కు చెందిన గుజరాత్ పరివర్తన్ పార్టీకి ఒక్క సీటు వస్తాయని ఆ సర్వే వెల్లడించింది. బిజెపి కి 46 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 36 శాతం ఓట్లు, కేశూభాయ్ పటేల్ పార్టీకి ఆరు శాతం ఓట్లు వస్తాయని అ సర్వే పేర్కొంది. ఆరు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్దులు, చిన్న పార్టీలకు గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
మణి నగర్ నియోజక వర్గంలో నరేంద్ర మోడి కి ప్రత్యర్ధిగా, సస్పెండ్ అయిన ఐపిఎస్ అధికారి భార్య శ్వేత బట్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె పోటీ చేస్తున్నారు. ముస్లిం ఓట్ల ఫై కూడా గురి పెట్టిన నరేంద్ర మోడి, వారిని ఆకట్టుకొనేందుకు క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ సేవలను వినియోగించుకొంటున్నారు.
ఈ నెల 17 వ తేదీన రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 20 వ తేదీన జరుగుతుంది.