ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? : కేటీఆర్
posted on Oct 29, 2018 @ 4:53PM
మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో తెరాస నేత కేటీఆర్ మాట్లాడుతూ.. మహాకూటమిపై విమర్శలు గుప్పించారు. మన తలరాతలు మనమే రాసుకునే ఎన్నికలివని, పాలమూరుకు నీరు రావాలా?.. కన్నీరు రావాలా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరో ఎవరికీ తెలియదని, నెలకో సీల్డ్ కవర్ సీఎం వస్తారని ఎద్దేవా చేశారు. తెరాస అధికారంలోకి వస్తే వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందిస్తామని, నిరుద్యోగ యువతకు రూ.3016 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రైతును రాజు చేయాలనే ఉద్దేశంతోనే రైతు బంధు పథకం తెచ్చామని వివరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది పాలమూరు జిల్లాయేనన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే జిల్లాలో వివిధ పథకాల కింద 9లక్షల ఎకరాలకు నీరందిస్తున్నట్టు చెప్పారు. పాలమూరుకు వలసలు వాపస్ వస్తున్నాయని అన్నారు. పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఎత్తిపోతల పథకం ప్రారంభించడం వల్ల పాలమూరు పచ్చబడుతుంటే చూడలేక పులులు, సింహాలకు ప్రమాదం వస్తుందని కాంగ్రెస్ నేతలు కేసులు వేశారని ధ్వజమెత్తారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై కోర్టులో కేసులు వేసి పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. మహాకూటమికి ఓటేస్తే టీడీపీకి వేసినట్టేనన్నారు. కూటమి అధికారంలోకి వస్తే పాలమూరులో ప్రాజెక్టులు ఆగిపోతాయన్నారు. పాలమూరు ప్రజల ప్రయోజనాల కోసం ఆ దేవుడితోనైనా కొట్లాడతామని అన్నారు.
మక్తల్ ప్రజలు ఏ గట్టునుంటారో తేల్చుకోవాలని సూచించారు. ఆ గట్టునేమో కరెంటు అడిగితే కాల్చిచంపిన ప్రతిపక్షాలు ఉన్నాయని.. ఈ గట్టున 24గంటలు ఉచిత విద్యుత్ అందించిన తెరాస ఉందని చెప్పారు. వ్యవసాయం దండుగ అని ప్రతిపక్షాలు అంటే.. వ్యవసాయం పండుగ అని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఏ గట్టున ఉంటారో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరో, సీఎం అయ్యేదెవరో అందరికీ తెలుసన్నారు. గెలిచేది తెరాస.. సీఎం అయ్యేది కేసీఆర్ అన్న మాట తెలంగాణలో చిన్న పిల్లవాడినడిగినా చెబుతారని అన్నారు.