విజయమ్మ దీక్ష యాసిడ్ దాడిలాంటిదే
posted on Aug 16, 2013 @ 12:02PM
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైయస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాననడం తెలంగాణపై యాసిడ్ దాడి చేయడంతో సమానమని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. అమ్మాయికి ఇష్టం లేకపోయిన ప్రేమించమని వెంటబడే యువకుడి ప్రేమను ఆ అమ్మాయి తిరస్కరిస్తే.. భరించలేక ఎలాగైతే యాసిడ్ దాడి చేస్తాడో అలాగే తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకపోయినా.. బలవంతంగానైనా కలిసి ఉండాలని విజయమ్మ దీక్షకు కూర్చోబోతున్నట్లు చేసిన ప్రకటనను యాసిడ్ దాడిగా అభివర్ణించారు.
నాలుగేళ్ల క్రితం కెసిఆర్ దీక్ష చేస్తే ప్రభుత్వం అనుమతివ్వకుండా అడ్డుకుందని, ఇప్పుడు విజయమ్మ దీక్ష పట్ల ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు కట్టుబడి ఉన్నామని లేఖ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రకటన రావడంతో తనలో ఉన్న సమైక్యవాదాన్ని ప్రధానికి పంపిన లేఖ ద్వారా బహిర్గతమైందన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ఆంటోని కమిటీ అని, అది తెలంగాణను అడ్డుకోవడానికి ఏమాత్రం కాదన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయి ఆత్మీయులుగా కలిసి ఉందామని సీమాంధ్ర ప్రజలకు సూచించారు.