గెయిల్ దుర్ఘటన: 25 లక్షల పరిహారం
posted on Jun 28, 2014 @ 11:09AM
తూర్పు గోదావరి జిల్లా నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ లీకేజీ - పేలుడు దుర్ఘటనలో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ దుర్ఘటనలో మృతులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం లభిస్తుందన్నారు. ‘‘మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందేలా వెంటనే చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబాల్లో పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్పొరేట్ పాఠశాలల్లో ఉచితంగా పదో తరగతి వరకూ చదువు చెప్పిస్తాం. కొబ్బరి తోటలు, పంటలు నష్టపోయిన వారందరికీ పరిహారం చెల్లిస్తాం’’ అని చంద్రబాబు చెప్పారు. మృతుల కుటుంబాలకు లభించే 25 లక్షల నష్ట పరిహారంలో 20 లక్షలు గెయిల్ సంస్థ ఇస్తుంది. 3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తాయి. మృతుల కుటుంబాల్లో ఒకరికి గెయిల్‌లో ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి లక్ష రూపాయలు నష్టపరిహారం అందుతుంది. ఈ లక్షలో 50 వేలు కేంద్ర ప్రభుత్వం, 50 వేల గెయిల్ సంస్థ చెల్లిస్తాయి. అలాగే చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును గెయిల్ భరిస్తుంది. ఈ దుర్ఘటనలో శాశ్వతంగా అంగవైకల్యం పొందిన వారికి గెయిల్ సంస్థ వారి పేరిట రూ.5 లక్షలు బ్యాంక్ డిపాజిట్ చేస్తుంది. ఆస్తులు కోల్పోయిన వారికి నష్టపోయిన పంట, ఆస్తులకు మార్కెట్ విలువ ప్రకారం గెయిల్ పరిహారం చెల్లిస్తుంది.