మధురగాయకుడు ఘంటసాల 40వ వర్ధంతి
posted on Feb 11, 2014 @ 9:59AM
గొంతులో తీపి, హృదయంలో మధురిమ గల గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయనది జన్మతహ గంభీరమైన స్వరం. అర్ధ శతాబ్దంపాటు పలు తరాల నటులకు, తెలుగు సినిమా పాటలకు గాత్రదానం చేశారు.శ్రోధల మదిలో చిరకాలం నిలిచిపోయే వరాన్ని పొందారు.
ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపథ్య గాయకులలో ప్రముఖులు. 1922 డిసెంబర్ 4న గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు. ఆయనను అంతా 'బాల భరతుడు' అని పిలిచేవారు. సూర్యనారాయణ మరణించే ముందు సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి గొప్ప సంగీత విద్వాంసుడివి కమ్మని కోరారు. ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్యగారు చూసుకోవడం మొదలుపెట్టారు.
తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా, ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశారు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులపాలయ్యారు. అప్పటినుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళలో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నారు... ఆలస్యమయినా తన తప్పు తెలుసుకొన్న ఘంటసాల తన దగ్గర ఉన్న నలభై రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి ఆంధ్రరాష్ట్రం లో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొన్నారు.
1944 మార్చి 4న ఘంటసాల తన మేనకోడలయిన సావిత్రిని పెళ్ళి చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రం తానే తన పెళ్ళికి కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెతారు. కొన్నాళ్ళకు దగ్గరి వూరికి సముద్రాల రాఘవాచార్యులు వచ్చినపుడు ఆయనను కలిశారు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాలవారు మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నారు. ఘంటసాల రెండు నెలలు కష్టపడి కచేరీలు చేసి, కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళారు. సముద్రాలవారు ఘంటసాలను రేణుకా ఫిలింస్‌కు తీసుకెళ్ళి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటకచేరీ చేయించారు.
ఘంటసాల పాట విని అవకాశాలు ఉన్నప్పుడు ఇస్తామన్నారు..సముద్రాల వారు అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయ కుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపు పొందారు. ఘంటసాల చేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తురు నాగయ్య, బి.ఎన్.రెడ్డిలు తమ సినిమా అయిన స్వర్గసీమలో మొదటిసారి నేపథ్య గాయకుడి అవకాశాన్ని ఇచ్చారు.
భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆ పాటకు ఆయనకు 116 రూపాయల పారితోషకం లభించింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు. 1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారు మోగింది. తరువాత విడుదలయిన మల్లిశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. సాలూరి రాజేశ్వరరావు సంగీతానికి ఘంటసాల గాత్రం తొడై రసానందం తారస్థాయికి చేరింది.
1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో మరో మైలురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో నా నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడూ చెపుతుంటారు. 1955లో విడుదలయిన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1960లో విడుదలయిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేష శైలవాస శ్రీ వేంకటేశ' పాటను తెరపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాట అయినా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతి పాట ఘంటసాల పాడినదే! ఏ నోట విన్నా ఆయన పాడిన పాటలే.
1970లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేశారు. 1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరారు. అప్పటికే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. చాలా రోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది. భగవద్గీత పూర్తి చేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నారు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలయిన హిట్ చిత్రాలకు పాటలు పాడారు. 1974 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూశారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు మనని వదలి వెళ్ళి దాదాపు దశాబ్దాలు కావస్తున్నా ఈనాటికీ ఆయన పాటలను ఎవరూ మరిచిపోలేదు. ఆయనకు సాటి రాగల గాయకుడూ రాలేదు. తెలుగు సినీ సంగీతపు స్వర్ణయుగానికి ప్రతీకగా ఆయన అమరుడే.