100 కోట్లతో 100 సంవత్సరాలు పడుతుంది...చంద్రబాబు
posted on Mar 9, 2015 @ 5:42PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై పరోక్షంగా విమర్సల వర్షం కురిపించారు. టీడీఎల్పీ కార్యలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం సాధారణ బడ్జెట్ లో ఏపీకీ ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. మొన్న నివేదికలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి నిధులు ఇచ్చారని, ప్రత్యేకంగా రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని అన్నారు. ఐదేళ్ల తర్వాత ఏపీ రెవెన్యూ లోటు దారుణంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకూ కేంద్రం చేయూతనివ్వాలని తెలిపారు. రూ 100 కోట్లతో పోలవరం నిర్మించాలంటే 100 సంవత్సరాలు పడుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రంలోని నదులన్నిటినీ అనుసంధానం చేయాలన్నారు. 300 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోందని, పోలవరం పూర్తయ్యేలోపు గోదావరి జలాలు కృష్ణానదికి అనుసంధానం చేయాలని కోరారు. అలాచేయడం వల్ల గోదావరి జిల్లాల రైతులకు అన్యాయం జరగదని తెలిపారు.