మంచాన్ని వెచ్చగా ఉంచడమే ఆమె పని
posted on Feb 20, 2017 @ 11:06AM
మంచులా చల్లబడిపోయిన దుప్పటి మీద నడుం వాల్చాలంటే చిరాకే! మనకే ఇలా ఉంటే రక్తం గడ్డకట్టేంత చలి ఉండే పాశ్చత్య దేశాల పరిస్థితి చెప్పేదేముంది. అందుకనే వాళ్లు తమ మంచాలను వెచ్చగా ఉంచేందుకు రకరకాల bed warming పరికరాలను వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఓ యువతి మీ మంచాన్ని నేను వెచ్చగా ఉంచుతానంటూ విభిన్నమైన సేవను అందచేస్తోంది.
రష్యాకు చెందిన ‘విక్టోరియా ఇవాచ్యోవా’ ప్రపంచంలోనే తొలి ‘human bed warmer’గా పేరు తెచ్చుకొంది. ఎవరన్నా క్లైంట్లు తమ మంచాన్ని వెచ్చపరచమంటూ విక్టోరియాను సంప్రదించగానే... ఆమె నిర్దిష్ట సమయానికి అక్కడికి చేరుకుటుంది. పైజమా వేసుకుని ఓ గంటసేపు క్లైంట్ మంచం మీద పడుకొని, పక్క వెచ్చబడేలా చేస్తుంది. ఆ గంటసేపూ కావాలంటే క్లైంట్ కూడా ఆమె దగ్గరే కూర్చుని ఏమన్నా కబుర్లు చెప్పవచ్చు. తమ బాధలు పంచుకోవచ్చు. కానీ ఆ సంభాషణ శృతి మించకుండా ఉండేలా విక్టోరియా జాగ్రత్తపడుతుంది. క్లైంట్ ఏదన్నా హద్దుమీరి ప్రవర్తిస్తే బయటపడేందుకు ఆమె తన దగ్గర ఓ అలారంను కూడా సిద్ధంగా ఉంచుకుంటుంది.
వినడానికి విచిత్రంగా ఉన్నా విక్టోరియా సేవల కోసం ఎగబడేవారి సంఖ్యలో ఏమాత్రం లోటు లేదు. అందుకు ఆమె వసూలు చేసే ఫీజూ తక్కువేమీ కాదు. ఒక గంటసేపు మంచం మీద పడుకునేందుకు ఆమె అక్షరాలా 5 వేల రూపాయలు చార్జ్ చేస్తుంది. ఇక రోజుకి గంటపాటు, నెలంతా సేవలు అందించాలంటే లక్షరూపాయలకు పైమాటే వసూలు చేస్తుంది. విక్టోరియా ఫీజులు చూసి కూడా క్లైంట్లు వెనక్కి తగ్గకపోవడం ఆశ్చర్యకరం. పైగా చాలారోజుల తరువాత సుఖంగా నిద్రపోయానని ఒకరంటే, పొద్దున నిద్ర లేచిన తరువాత జీవితం మీద కొత్త ఆశలు మొదలయ్యాయి అని మరొకరు మురిసిపోయారు. ఇలా తన సేవల కోసం తపించిపోయేవారి కోసం విక్టోరియా www.she-is-generator.ru/ పేరుతో ఒక వెబ్సైటుని కూడా ప్రారంభించి, ఆన్లైన్ సేవలను అందిస్తోంది.
విక్టోరియా చేస్తున్న పని మనకు వింతగా కనిపించవచ్చు. కానీ తను విజయం అయితే సాధించింది కదా! ఎవరూ ఊహించని రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఓ బాట వేసుకుంది కదా! ఇలా Human bed warmingను ఓ వ్యాపారంలా మార్చేందుకు తను చదివిన ఓ పుస్తకమే ప్రేరణగా నిలిచిందని చెబుతోంది విక్టోరియా. ఆ పుస్తకంలో ఓ రచయిత వద్ద పనిచేసే టైపిస్టు, తన యజమానికి త్వరగా నిద్రపట్టేందుకు తను కాసేపు అతని మంచం మీద పడుకునేదట. నవల్లో ఉన్న ఆ విషయాన్ని నిజం చేయాలనుకుంది విక్టోరియా! పైగా తను మంచం మీద పడుకోవడం వల్ల తనలోని సానుకూలమైన విద్యుత్ తరంగాలు మంచానికి బదిలీ అవుతాయని చెబుతోంది. అన్నింటికీ మించి... సదరు మంచం మీద ఒరిగిన వెంటనే క్లైంట్లు ఆ వెచ్చదనానికి గాఢంగా నిద్రపోతారని హామీ ఇస్తోంది.
- నిర్జర.