దలైలామాపై దాడి జరిగిందా?
posted on Jun 20, 2014 @ 5:57PM
శుక్రవారం నాడు ఇంటర్నెట్ ప్రపంచంలో కనిపించిన ఒక ఫొటో ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని ఆందోళనకు గురిచేసింది. ఆ ఫొటో మరెవరిలో కాదు.. బౌద్ధ బిక్షువు, శాంతిదూత దలైలామాది. ఆ ఫొటోలో దలైలామా మామూలుగా వుంటే ఆందోళన పడాల్సిన అవసరమే వుండేది కాదు. కానీ ఆ ఫొటోలో దలైలామా తీవ్రంగా గాయపడి వున్నారు. ఆయన ముఖమంతా రక్తం చిందుతూ వుంది. కళ్ళజోడు పగిలిపోయింది. పెదవులు పగిలిపోయి రక్తం కారుతోంది. ముక్కులోంచి కూడారక్తం కారుతోంది. ఈ ఫొటో చూసి చాలామంది ఆందోళన పడ్డారు. పాపం దలైలామాని ఇంత దారుణంగా గాయపరిచింది ఎవరని వెతికితే అసలు విషయం బయటపడింది. అది దలైలామాని ఎవరూ గాయపరచలేదు. అవి ఫొటోషాప్ ద్వారా దలైలామా ముఖంమీద కృత్రిమంగా సృష్టించిన గాయాలు. ఇలాంటి పత్యపు పని చేసింది ఎవరో కాదు.. ప్రపంచ ప్రఖ్యాత సామాజిక సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బెల్జియం బ్రాంచ్. హింసను వ్యతిరేకిస్తూ ఈ సంస్థ చేపట్టిన ‘స్టాప్ టార్చర్’ అనే కార్యక్రమంలో భాగంగా ప్రముఖుల ఫొటోలను ఫొటోషాప్‌లో గాయపడినట్టుగా మార్చి విడుదల చేసింది. దలైలామాతోపాటు లెపీపాప్, కార్ల్ లెగర్ ఫీల్డ్ అనే మరో ఇద్దరు ప్రముుఖుల ముఖాలను కూడా ఫొటోషాప్ ద్వారా గాయపడినట్టు తయారు చేసి ప్రపంచానికి విడుదల చేసింది. ఇలాంటి పనికిమాలిన పబ్లిసిటీ ద్వారా హింసను ఆపాలని పిలుపు ఇవ్వడం చాలా దరిద్రంగా వుందన్న విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఆమ్నె్స్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఇలాంటి కుళ్ళు ఐడియాలను మానుకోవాలని కూడా జనం విమర్శిస్తున్నారు.