తలాక్ కే బాద్ క్యా?

 

 

నిన్న మొన్నటి వరకు ‘భాయి భాయి’ అని భుజాలు పూసుకు తిరిగిన కాంగ్రెస్ యం.ఐ.యం. పార్టీలు అఫీషియల్ గా ‘తలాక్’ చెప్పేసుకొన్నాక మొన్నజరిగిన శాశనసభ సమావేశాలలో ఒకరి మీద మరొకరు తల్వార్లు దూసుకొన్నారు. శంఖంలో పోస్తే గాని నీరు తీర్దం గానట్లు, సభలో మిగిలిన ఆ ముచ్చటకూడా పూర్తీచేసేసారు గనుక ఇక బహిరంగంగానే నిర్బయంగా తిట్టేసుకోవచ్చు. నోరార విమర్శలు చేసుకోవచ్చు.


అయితే, ఇంతకాలం కాంగ్రెసుతో అంటకాగిన యం.ఐ.యం.కి హట్టాత్తుగా కాంగ్రెస్ అంటే ఎందుకు వెగటు పుట్టుకోచ్చింది? స్వయంగా మతతత్వపార్టీ అయ్యుండి, తన ముద్రని కాంగ్రేసుకి ఎందుకు అంటగట్టింది? కాంగ్రెసుతో విడాకులు తీసేసుకోన్నాక కిరణ్ కన్నా జగన్ మంచోడు అని ఓ మాటనేసిమరీ బయటకొచ్చిన అసదుద్దీన్ అక్కడనుండి నేరుగా చంచలగూడలో ఉన్న జగన్ ఆఫీసుకి వెళ్ళాకపోవడంతో ఆతను ఇంకా కొన్ని సస్పెన్స్ సీన్స్ చూపించబోతునట్లు అర్ధమవుతోంది. అయితే, మొన్న ఆ సస్పెన్స్ కీ తెరదించుతూ ఈ నెల అంటే డిసెంబర్ లో నిజామాబాదులో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు తెలియజేసాడు.



అయితే, త్వరలో రాష్ట్రమంతా పర్యటించి కిరణ్ కుమార్ కి వ్యతిరేఖంగా ప్రచారం చేస్తానని అంతే గాకుండా రాబోయే ఎన్నికలలో వీలయినన్ని స్థానాలకి పోటిచేస్తామని ముందే చెప్పిన సంగతి గుర్తుకు తెచ్చుకొంటే, యం.ఐ.యం. కూడా వీలయినన్ని సీట్లు సంపాదించుకొని, మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగానే కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పేయాలని తహతహలాడుతునట్లు అర్ధమవుతుంది. 



కాంగ్రేసుకి చిరకాలం తోక పార్టీగా మిగిలి పోవడంకంటే,  రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉన్నఈ తరుణంలోనే  ఒక ట్రయల్ వేసి అదృష్టం పరీక్షించుకోవడం మంచిదని భావించినట్లు అర్ధమవుతోంది. అందుకే యం.ఐ.యం. కాంగ్రెసుతో పూర్తిగా తెగ తెంపులు చేసేసుకొని మరీ బయటకి వచ్చేసింది. అయితే, ఎన్నికల ముందో లేక తరువాతనో అవసరాని బట్టి మళ్లీ కలవడం పెద్ద కష్టమూ కాదు నేరము కాదు గనుక, ప్రస్తుతానికి యం.ఐ.యం. ఇలాగ నిర్ణయం తీసేసుకొని ఉండవచ్చును.

Teluguone gnews banner