గవర్నర్ విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు డుమ్మా?
posted on Aug 16, 2015 @ 11:48AM
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా గవర్నర్ నరసింహన్ని నిన్న రాజ్ భవన్ లో ఇచ్చిన తేనీటి విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరవలేదు. అందుకు గవర్నర్ నొచ్చుకొన్నప్పటికీ ఈ విషయం గురించి అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని మీడియాని కోరారు. చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, కేసీఆర్ కృష్ణా జలాలపై సమీక్షా సమావేశాలతో తీరిక లేనందునే రాలేకపోయారని ఆయన తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులకి తను ఆమోదయోగ్యుడినేనని, హైదరాబాద్ లో ఉన్నంత వరకు అందరూ తనను ఆదరిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. తను చాలా ఆశవాదినని సమస్యలన్నీ క్రమంగా సర్దుకొంటాయని ఆశిస్తున్నానని తెలిపారు. తను గవర్నర్ పదవిలో చివరి రోజు వరకు కూడా సంతోషంగా ఉంటానని అన్నారు. ఈ సమావేశానికి తెలంగాణా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, కేంద్రమంత్రులు సుజనా చౌదరి, బండారు దత్తాత్రేయ, తెలంగాణా మంత్రులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్లే తదితరులు హాజరయ్యారు.