ప్రస్తుతం నేనీ ఇరకాటంలో వున్నాను. ఇంతవరకూ ఓ దారీ తన్నూ కనిపించడంలేదు. నన్నేం చెయ్యమంటావు? అన్నట్టు ఈ సారి రాసే జాబులో నాగమణి గురించి తప్పకుండా రాయి. రామచంద్రం, కోటేశ్వరరావు, మాధవరావుగార్లు ఎప్పుడైనా కనిపిస్తున్నారా? నీ ఎడ్రస్ వారికి తెలుసు. వస్తే నేనిలా వున్నానని వాళ్ళకు చెప్పు. నా అంతట నేను జాబు రాయడం బాగావుండదు. అడిగితే నా ఎడ్రస్ కూడా యివ్వు.జవాబు వెంటనే రాయి. వసంతకు -అదే వాసంతికి నా ముద్దులు. ఈసారన్నా ఆ పిల్ల పేరేమిటో ఖచ్చితంగా రాస్తావు కదూ?
ఉంటాను. ముద్దులతో,
నీ మంజరి.
"ఇంకో సంగతి రాయడం మరచిపోయాను ఓ శాస్త్రి గారు, పేరు మార్చుకో వలసిందని సలహా యివ్వడంచేత 'మంగమ్మ'ను కాస్తా 'మంజరి' గా మార్చేసుకొన్నాను. ఇహనుంచీ నాకు రాసే జాబుల్లో ఈ పేరే వాడగలవని ఆశించుతున్నాను.
సెలవు. మంజరి.
ఉత్తరమంతా పూర్తిచేశాక,మరోసారి చదువుకొంది. నాలుగైదు చోట్ల తప్పులు కనిపిస్తే సరిదిద్దింది. రెండు చోట్ల - వుండవలసిన సున్నాలు మరోచోట వున్నాయి. ఈ ఉత్తరం రాయడానికి దాదాపు ఓ గంటసేపు పట్టింది మంజరికి. తిమ్మిరెక్కిన వేళ్ళను విరుచుకొని, ఉత్తరాన్ని తాయారుకిచ్చి పోస్టు చేయమన్నది. అలా జాబురాసినట్టు చలపతికి చెప్పవద్దని కూడా అన్నది.
సాయంత్రానికల్లా అలసి సొలసి చలపతి ఇంటికొచ్చారు. మనిషి రవ్వంత చిరాకుగా కూడా ఉన్నాడు.
"నా కోసం ఎవరన్నా వచ్చారా?" అన్నాడు చలపతి వసారా లోని కుర్చీలో కూర్చుంటూ.
"ఎవరన్నా వస్తామన్నారా?" అన్నది మంజరి, తన సహజ ధోరణిలో.
చలపతి విస్సుగ్గా చూశాడు. అతనికి కోపం వచ్చిందని మంజరి గ్రహించింది.
"మరి అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. ముందు వెళ్ళి స్నానం చేయండి. ఈలోగా నేను కాఫీ తెప్పిస్తాను." అన్నది మంజరి. అతన్ని బలవంతపెడుతూ. పాపిస్టిదాన్ని నా వాళ్ళ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండీ మీరు? సుఖానవుండే ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకుంటున్నారు.... మీరనవసరంగా హైరానా పడకండి. అయినప్పటికి అవుతుంది. అసలు కానేకాదనుకోండి - విచారమేలేదు. ఎందుకొచ్చిన లాయలాసా ఇదంతా?"
మంజరి చల్లిన పన్నీటిజల్లులు చలపతి మీద బాగా పని చేశాయి. అతను సన్నగా నవ్వుతూ, "నాకా మాత్రం తెలీదా మంజరి ఓ పనిని సాధించాలను కొన్నప్పుడు మధ్యలో ఎదురయ్యే అడ్డంకులను లక్ష్యం చెయ్యకూడదు. అలా చేస్తే మన మొక్క అంగుళం కూడా ముందుకెళ్ళలేము" అన్నాడు.
మంజరి మరో అయిదారు సార్లు ఆ మాటనే తిప్పి తిప్పి వల్లించాక గానీ, చలపతి పూర్తిగా కోలుకోలేదు.
"అమ్మయ్య! ఈ పూటకు గండం గడిచింది" అనుకొంది మంజరి.
తాయారు గంగాళంలో నీళ్ళు నింపింది. చలపతి స్నానం చెయ్యడానికి లోపలికెళ్ళాడు. మంజరికూడా లోపలికెళ్ళడానికి ఓ అడుగు వేసింది. ఎవరో వీధి తలుపు తీసుకొని వస్తున్నారు.
అతనెక్కడో చూసిన జ్ఞాపకం మంజరి మనస్సులో కదిలింది. కానీ వివరాలు మాత్రం గుర్తుకు రావడం లేదు. ఆ కుర్రాడు మంజరిని చూసి నిండుగా నవ్వుతూ "ఇంట్లో ఎవ్వరూ లేరా?" అన్నాడు కూర్చోమని అనకముందే కుర్చీలో కూచుంటూ. 'ఉన్నారు' అన్నది మంజరి అతని చొరవకు ఆశ్చర్యపోతూ.
"అయితే ఓ సారిలా రమ్మనండి!" అన్నాడతను సిగరెట్ అంటించి.
మంజరి గదిలో కొచ్చింది. ఆసరికే చలపతి స్నానంచేసి, లుంగీ కట్టుకుంటున్నాడు. తలుపు సందులోంచి సిగరెట్ పొద లోపలికి రావడం చూసి "ఎవరన్నా వచ్చారేమిటి?" అన్నాడు.
"అవునన్నట్లు " తలాడించింది మంజరి. వచ్చినతన్ని తలుపు ప్రక్కనించి చూసి నీరైపోయాడు చలపతి. ఆ అదుటున లోలోపల అనుచుకొంటూ, సాధ్యమైనంత వరకూ, మామూలుగా ఉండటానికి ప్రయత్నిచాడు చలపతి.
"అమ్మయ్యా! నమస్కారం! మీరు వచ్చారేమోనని ఇంతకు ముందే కనుక్కొన్నాను. నిన్నా మొన్నా కూడా నాకోసం కబురు చేశారటగా! ఏమిటి విశేషం?" అన్నాడు చలపతి నక్కవినయాలు పోతూ.
"మీతో పనుంది.... ఆవిడకేమీ పనిలేకపోతే ఇక్కడకొచ్చి కూచోమనండి" అన్నాడతను.
వాళ్ళిద్దరూ ఏం చెప్పుకొనేదీవినాలని మంజరికి ఉంది. ఆ కుర్రవెధవను చూడగానే, అంతకద్దు చలపతీ ఎందుకు దిమ్మరపోయ్యాడో ఆవిడకు తెలీదు.
"మంజూ! మన శర్మ గారోచ్చారోయ్! "కొరడా" పత్రిక ఎడిటర్ గారు నిన్నకూడా మనం వీరి పత్రికను గురించి చెప్పుకొన్నాంగదా?" అని కేకేశాడు చలపతి.
మంజరి నవ్వుకొంటూ వచ్చికూచుంది. అసలాపత్రిక పేరు వింటేనే ఆవిడకు నవ్వుగా ఉంది. దానికితోడు ఆ ఎడిటర్ కూడా కొరడాపుల్లలాగా సన్నగా, పొడుగ్గా ఉంటాడు మొన్నీ మధ్య జరిగిన పత్రికలవాళ్ళ పార్టీలో తనకేసి మింగేలా చూసినవాడు వీడేనని ఇప్పటిగ్గానీ మంజరికి రూడికాలేదు.
"మంజరిని గురించి నేను వ్యాసం రాసుకొచ్చాను" అన్నాడు శర్మ.
చలపతి ముఖం విప్పారింది. మంజరి కళ్ళు మిలమిలలాడాయి. వినిపించడం మంచిదన్న ఉద్దేశంతో ఇలా వచ్చాను. విన్నాక మీ అభిప్రాయం చెప్పండి. అవసరమైతే, ఇంకేమన్నా మార్పులు చేసుకొందాం!" అన్నాడు శర్మ.
"అయ్యొయ్యో! ఎంతమాటన్నారు? మీరురాయడమూ, దానికింకా మార్పులుండటమూనా? ఖర్మకాలి మీరీ మద్రాసులో ఉండిపోయారుగానీ, ఏ హిందీ ప్రాంతంలోనో పుడుతే - గిరీశం అన్నట్టు సురేంద్రనాద్ బెనర్జీ అంత గొప్పవారయి
పోయేవారు. ఇప్పటికయినా మించిపోయింది లేదు. ఈ దిక్కుమాలిన మద్రాసు విడిచిపెట్టి చక్కా ఏ బోబాయో, కలకత్తాకో వెళ్ళగూడదూ - అని"
శర్మ కాలుస్తున్న సిగరెట్ ను కుర్చీకోటికి రుద్ది ఆర్పేసి, జేబులోంచి కాగితాలకట్ట తీశాడు.
మెల్లిగా గొంతు సరిచేసుకొన్నాడు. మంజరీ, చలపతి ఓసారి సర్దుకొని కూర్చున్నారు.
"ఈ వ్యాసానికి మార్వొలెస్ హెడ్డింగ్ పెడుదామనుకొంటున్నాను. ఆకటేమో "ఆంధ్ర చలన చిత్రాకాశంలో నూతనతార ఉదయించింది." అని 64 పాయింట్ టైపులో బేనర్ హెడింగ్ పెడదామని నా ఉద్దేశం? లేదా "సినిమా రంగంలో నూతన శకోదయం, నవరసాలనూ రసభరితంగా వొప్పించగల నూతన నటి మంజరి" అని ఉంచుదాం. ఈవిడ బొమ్మలను రకరకాల మేకప్పుల్లో మనకోసం ప్రత్యేకంగా తీయించి, గుండెలదిరిపోయేలాగా కింది కాప్షేన్స్ ఇచ్చేద్దాం. ఏమంటారు?" అన్నాడు శర్మ.
మంజరి నిజంగా పొందిపోయింది. శర్మ కేసి నిండుగా చూసి, చలపతికి కనిపించకుండా ఓ చిన్ననవ్వు శర్మ కిచ్చింది కూడానూ.
చలపతి మామూలు ధోరణిలో నేమాట్లాడేస్తున్నాడు.
"మీకు మేం చెప్పేదేమిటి శర్మగారూ! పత్రికా ప్రపంచంలో మీరో దృవతారలాంటి వారు, కానివ్వండి" అన్నాడు చలపతి, వ్యాసం కేసి వేలు చూపుతూ.
శర్మ చదవడం ప్రారంభించాడు.
"మన సినిమా పరిశ్రమ ఇంకా గుంటపూలు పూయడానికి, కొత్త పెట్టుబడులు ఈ పరిశ్రమలోకి రాకపోవడానికి కారణం ఏమిటి? ప్రేక్షకులు పాతమోఖాలను చూసి చూసి విసుగెత్తిపోయారు పాత తారలకు డిస్ట్రిబ్యూటర్ల దగ్గారా, ప్రొడ్యూసర్ల దగ్గరా పలుకుబడి ఉండటం వల్ల, కొత్తవారు రాలేకపోతున్నారు. ఓ సినిమా తియ్యడానికయ్యే ఖర్చులో అయిందిట మూడువంతులు తారలే దిగమింగుతున్నారు. బెంగాల్ పరిశ్రమ అలాకాదు. ప్రతి చిత్రం లోనూ, బెంగాలీ దర్శకులు, నిర్మాతలు, కొత్తవారిని ప్రవేశ పెడుతున్నారు. దానివల్ల కొత్త, పాత తారలమధ్య పోటీ ఎక్కువయి పాతవారు కూడా మామూలు రేటుకే రావడమూ, ప్రేక్షకులకు కొత్తముఖాలు పరిచయం కావడమూ జరుగుతోంది.
"పడి పదిహేను సంవత్సరాలుగా వివిధ కేంద్రాలలో, రకరకాల నాటకాలు ప్రదర్శించి, విశేషమైన అనుభవం పొందిన నటీనటులనేక మంది ఉన్నారు. అటువంటివారిలో మణిపూస వంటిది "మంజరి" ఈమె నటనా వైదుష్యానికి ముగ్ధుడయ్యాడు. ఏ రాసాన్నయినా, కలారుచికంగా వొప్పించగల నేర్పు మంజరిలో ఉన్నది. ఆమె కంఠంలోని మాధుర్యం
అలాంటిది. వీటన్నింటికీ తోడుగా ఈమె శరీరసౌష్టవం మన పరిశ్రమ కొక ఎస్సెట్. అందాన్నంతా పునికిపుచ్చుకొన్న దేమో ననిపిస్తుంది మంజరి. విశాలమైన నేత్రాలతో, పోటో జెనిక్ ముఖంతో, సంభాషణలను భావగర్బుతంగా అనడంలో, సంవేదనలను అభివ్యక్తీకరించడంలో మంజరి అసమాన ప్రజ్ఞాదురీణ, మహత్తరమైన ఈ కానుకను, సినిమా పరిశ్రమను శ్రీ చలపతిగారు సమర్పిస్తున్నారు. లోగడ - మంజరిని సినిమాలలోకి ఆహ్వానించి విఫలులైన ప్రొడ్యూసర్లు కొందరు, ఇప్పుడామె చుట్టూ బుకింగ్స్ కోసం తిరుగుతున్నారు. ఒకరిద్దరు పెద్దనిర్మాతలు కధలు పుచ్చుకొని మంజరి ఇంటిచుట్టూ ప్రదక్షణం చేయడం ఈ రచయితలకు తెలుసు. ఇంతవరకూ నాటక రంగానికే పరిమితమయివున్న మంజరి కళాప్రతిభలు ఇప్పుడు సినిమా రంగానికికూడా విస్తరించడం మన అదృష్టం. కొద్దిరోజులలో ఈ విదుషీమణి నటనా వైదుష్యాన్ని ఆంధ్ర ప్రేక్షకులు చూడబోతున్నారు. పురుషులను కవ్వించి! వారిలోని శృంగారవాంఛలకు ఉద్దీవనం కలుగచేయగల ఈ అపురూప సౌందర్యరాశి, అపర దేవతా సుందరిని మీరందరూ త్వరలోనే చూడబోతున్నారు.
ఈ చిరంజీవి భవిష్యత్తు శోభాయమానం కావాలని "కొరడా పత్రిక మనసారా వాంచిస్తుంది."
అని ముగించాడు శర్మ.
చలపతి తన్మయుడయిపోయాడు. మంజరి మనస్సంతా మబ్బులమీద తేలిపోతున్నట్లుగా ఉంది.
"చాలా సంతోషం శర్మగారూ! మా గురించి ఎంతో శ్రమ తీసుకొన్నారు. ఈ రుణాన్ని తీర్చుకోడం ఒకంతడ సాధ్యంకాదు" అన్నాడు చలపతి.
ఈలోగా శర్మగారు రెండో జేబులోంచి మరికొన్ని కాగితాలు తీశాడు.
"ఈ వ్యాసం రెండవ భాగమండీ" అన్నది మంజరి.
శర్మ ఓ సారి మంజరికేసి, చలపతి కేసి పరిశీలనగా చూశాడు. అతని కళ్ళు పదే పదే చలిస్తున్నాయి.
"కాదనుకోండి. మీరు దాన్నికూడా వినడం మంచిది" అన్నాడు శర్మ.
"అవసరం లేదు శర్మాజీ! అన్నమంతా పట్టుకు చూడాలా? నా కింక చదివి వినిపించకండి! మీ కేది ఇష్టమని తోస్తే అది చెయ్యండి సరా?" అన్నాడు చలపతి. ఇంకో మాట ఇక వినిపించుకొనే వినిపించుకోనన్నట్లుగా.
"అలాకాదు - ముఖ్యంగా ఇది మీరు వినడం అవసరం. ఆనకు నన్ను నేపపెడితే లాభంలేదు" అని బలవంతం చేశాడు శర్మ.
"పోనీ విందామండీ! శర్మగారు అంతగా చెబుతుంటే వినక పోవడం ధర్మంకాదు!" అన్నది మంజరి.
శర్మ మరోసారి ఆ ఇద్దరికేసి చూసి చదవడం మొదలెట్టాడు.
"సినిమా పరిశ్రమ ఈనాడున్నంత విపత్కర పరిస్థితిలో, మొన్నెన్నడూ లేదనడం అతిశయోక్తి కానేరదు. ప్రభుత్వం ప్రభుత్వం ఈ పరిశ్రమ మీద మోయలేనన్ని పన్నులు విధించింది. ఇదిగాక, ముడిఫిలిం దిగుమతులను ఘోరంగా తగ్గించిపారవేసింది. దీనికి కారణాలు లేకపోలేదు. కేవలం ఫిలిం దిగుమతుల కోసమే మన విదేశీమారక ద్రవ్యమంతా ఖర్చు చేయమనడం న్యాయంకాదు. ప్రస్తుతం ఉన్న పరిమిత మైన కోటాలోనే మనం సరిపెట్టుకోవాలి. అలా జరగాలంటే - పాత నటీనటులనే ఈ పరిశ్రమ ఆశ్రయించక తప్పదు.
"విశేషానుభవం ఉన్న పాతతారలు దర్శకులు చెప్పిన భావాన్ని సులభంగా అర్ధం చేసుకొని అంతకన్నా సులభంగా నటిస్తారు. ఒకటి రెండు 'టేక్' ళ కన్నా ఎక్కువ అవసరం లేదు. కొత్తవారితో అలా కాదు. ముడిఫిలింను కొత్తవారు అప్పడాలు తిన్నట్టు తినేస్తారు. అదీగాక - కొత్త ముఖాలున్నప్పుడు డబ్బుపెట్టుబడి పెట్టడానికిక్కూడా డిస్ట్రిబ్యూటర్లు జంకుతారు. డిస్ట్రిబ్యూటరు సహకారం లేకుండా సినిమా తియ్యగల ప్రొడ్యూసర్లు మన కెందరున్నారు? కొత్తవారి మీద లక్షలకు లక్షలు డబ్బు పెట్టుబడి పెట్టగలిగిన వారెంత మంది? ప్రశ్నలకు మనం సమాధానం చెప్పుకోగలగాలి? ప్రోడ్యూసర్లను, డైరెక్టర్లను దుయ్యబట్టడమే కాదు. సాధన బాధకాలను కూడా మనం ఆలోచించాలి."
ఈ మధ్యనే "మంజరి" అన్న కొత్త ముఖం మద్రాసుకు వచ్చిందని విని ఆవిణ్ని "కొరడా" పాతకులకు పరిచయం చేయాలన్న ఉత్సాహంతో సంపాదకుడు నీరుగారిపోయాడు. చాలాకాలం నుండి పరిశ్రమనే అంటిపెట్టుకొన్న ఒక ప్రబుద్దుడు. ఆమెకు లేనిపోని ఆశలు కల్పించి తీసుకువచ్చినట్లుగా తెలిసింది. తాను దూరడానికి కంతలేదుగానీ, మెడకొక డోలన్నట్లుగా ఆ ప్రబుద్దుడు వ్యవహరిస్తున్నాడు. పైగా ఆ మనిషిని గురించి కాన్వాస్ చేస్తున్నట్లూ పది కంపెనీల చుట్టూ తిరుగుతున్నట్లూ బోగట్టా అందింది. మంజరికి నాటకానుభవం ఉన్నదని అతనంటున్నాడు. ఆ పేరుగల 'నటి' ఉన్న దాఖలాలేదు. మరో సంగతేమిటంటే, నాటకాల్లో చిల్లర మల్లర వేషాలు వేసిన ప్రతివారూ సినిమాల్లో రాణించగలమనుకోవడం భ్రమ. మంజరి రూపురేఖలు గానీ, శరీరసౌష్టవం గానీ సినిమాకు బొత్తిగా పనికిరావు. కనీసం డబ్బింగ్ చిత్రాలలో గొంతు ఆడరాక్షసి వేషాలకు తప్ప పనికిరాదు. ఈమెకు సినిమా పరిశ్రమ ఏ విధంగా ఆశ్రయమిస్తుందో చూద్దాం నాటకాల్లో వేషాలు వేయడానికి ముందుగా ఈవిడ గుంటూరులో ఉండేదిట. ఈ ఆడ (పిల్ల) రాక్షసి యొక్క సమగ్ర చరిత్ర కోసం, పాఠకులు వచ్చే సంచికలో చూడవచ్చు. "కొరడా" ప్రత్యేక విలేఖరి ఈ సమాచారం సేకరించడం కోసం అహోరాత్రులు శ్రమపడుతున్నాడు. ఇటువంటి విషయాలలో పాఠకులను ఏనాడూ నిరుత్సాహపరచని "కొరడా" ఈ సందర్భంలోనూ, తన సంప్రదాయాన్ని నిలబెట్టుకొంటుంది మేము హామీ ఇస్తున్నాం.
శర్మగారు - వ్యాసం చదవడం ఆపి జేబుగుడ్డతో ముఖం తుడుచుకున్నాడు.
చలపతి ముఖంలో గోటిగాటుకు నెత్తురుబొట్టు లేదు. మంజరి పాలిపోయింది. ఆవిడ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. పెదవులు వొణికిపోతున్నాయి. స్థిరంగా కూచోను కూడా లేకపోయింది.
"ఇలా మీరు గమ్మున కూచుంటే లాభంలేదు. ఏ సంగతీ వెంటనే చెప్పండి!" అన్నాడు శర్మ. లేచివేళ్ళే ప్రయత్నం చేస్తూ.
"మీ ఉద్దేశమేమిటో నాకు తెలియలేదు. నన్నేం చెయ్యమంటారో చెప్పండి!" అన్నాడు చలపతి వణికిపోతూ.
శర్మగారు ఓ క్షణం ఆలోచించి సన్నగా నవ్వాడు.
"రెండో వ్యాసం వెయ్యమంటే ఫ్రీగా వేస్తాను. మొదటిది పబ్లిష్ చెయ్యాలంటే ప్రెస్ బిల్ మీ రిచ్చుకోవాలి. ఏది వెయ్యమంటే అదే వేస్తాను" అన్నాడు శర్మ మంజరిని చూసి నవ్వుతూ.
మంజరికి డోకు వచ్చినంతపనైంది.
"పెద్దలు మీరెలా చెబితే అలానే చేస్తాను. ప్రెస్ బిల్ ఏ మాత్రం అవుతుందంటారు?" అన్నాడు చలపతి.
"ఎంతోనా! మహా అయితే అయిదొందలుంటుంది. రేపు సాయంత్రానికల్లా నాకది ఇప్పించండి. ఉదయమే వెళ్ళి నేను ప్రెస్ లో మేటరిచ్చేస్తాను. మరి నే వెళ్ళిరానా?" అంటూనే శర్మ వెళ్ళిపోయాడు.
ఛాలా సేపటిదాకా ఎవ్వరూ పలకలేదు. చలపతి రెండు చేతుల్లోనూ తలకాయ నిరికించుకొని కూచున్నాడు. మంజరి పమిటతో కన్నీరొత్తుకుంది.
"ఏమిటండి గొడవంతా?" అన్నది మంజరి మెల్లగా.
చలపతి మాట్లాడలేదు.
"రేపు సాయంత్రంలోగా మనం అయిదొందల రూపాయలూ, వాడి మొహాన కొట్టవలసిందేనా?" అన్నది మంజరి మళ్ళా.
"ఆ వాడో పరమ దౌర్బాగ్యుడు. ఇలా పీడించి డబ్బు గుండుతుంటాడు. వాడి వృత్తే అది! ఆ వెధవతో విరోధం పెట్టుకొంటే మనం నెగ్గలేం. మంచిగా ఉండటమే మంచిది." అని సలహా ఇచ్చాడు చలపతి.
"మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు ఉన్నదా మరి?"
చలపతి ఓసారి ముఖమంతా గట్టిగా రుద్దుకొన్నాడు. కళ్ళు మూసుకొని కుర్చీలో జారగిల్లబడ్డాడు.
"ఉన్నా లేకపోయినా, వీడిబాధ వొదిలించుకోక తప్పదు. జెర్రిపోతులాంటి వెధవతో యాగీపడటమంటే ఏమిటో నీకింకా తెలీదు" అన్నాడు చలపతి.
ఆ తరువాత హటాత్తుగా లేచి గుడ్డలు వేసుకొని ప్రయాణమయ్యాడు.
"మళ్ళీ ఎప్పటి కొస్తారండీ?" అన్నది మంజరి బిక్కు బిక్కుగా మరీపొద్దుపోతే తాయారు నన్నా ఉంచుకొందామని అడుగుతున్నాను.
"తాయారును పంపించేసెయ్యి. నేను సాధ్యమైనంత తొందర్లోనే వస్తాను. రావాడం ఆలస్యమయితే బెంబేలు పడకు. నాకోసం ఎవరన్నావస్తారేమో! వాళ్ళను మర్యాదచెయ్యి. ముంగుముళానంలాగా కూచోకు. మనింటి కొచ్చేవారు మనక్షేమం కోరేవారే గదా! వారితో కలుపుగోలుతనంగా ఉండడంలో తప్పేమీలేదు....మరి నేను వెళ్ళొస్తాను....తాయారును పంపేయడం మరచిపోకు" అన్నాడు చలపతి.
అతను వెళ్ళిపోయిన చాలా సేపటిగ్గానీ, అతనేమన్నదీ మంజరికి అర్ధం కాలేదు. తీరా అర్దమ్మయ్యాక శోష వచ్చినదానిలాగా మంచంమీద కూలబడిందావిడ.
"ఇదేదో పద్మవ్యూహంలాగా ఉంది. ఏదీ నాకు తెలియడం లేదు" అనుకొన్నది మంజరి.
