ఆ పని చెయ్యొచ్చుగానీ, అప్పటికే మంగమ్మ వేషం విప్పేసే ప్రయత్నంలో ఉంది. ముఖంనిండా కొబ్బరినూనె పాముకొంది, రంగులన్నీ కలగలసిపోయి, ముఖం చిన్నసైజు పిశాచి ముఖంలాగా ఉంది.
నేనే స్టేజీమీది కెళ్ళి, అసలు విషయాన్ని తెలియచేశాను. మరో వారం రోజుల్లో రామవరంలో ఇదే నాటకం ఆడబోతున్నామనీ, ఇప్పటిలాగా, అప్పుడూ మీరందరూ మమ్మల్ని ఆదరించాలనీ, ఓ చిన్న తరహా ఉపన్యాసంకూడా ఇచ్చాను. అందరూ వెళ్ళిన తరవాత కోటేశ్వరరావు నాదగ్గర కొచ్చి, అమాంతం కావలించుకొన్నాడు.
"నేనేమోనను కొన్నాను గానీ., నాటకం బ్రహ్మాండంగా ఉన్నదోయ్. ఇంతటితో నీకూ నాకూ దోస్త్" అన్నాడువాడు భుజం మీద తడుతూ. రామచంద్రం ఏమీ మాట్లాడలేదుగానీ కోటికేసి కోరచూపులు చూశాడు.
తొలి ప్రయత్నం విజయవంతం కావడానికి బేరీజు వేస్తున్నప్పుడు, రామచంద్రం ఎక్కువ మార్కుల్ని మంగమ్మకిచ్చాడు. ఆవిడ లేకపోతే మన నాటకం మట్టిలో కలిసిపోయేదన్నాడు. నేనూ, కోటి వాడి వాదనను వొప్పుకోలేదు.
"మంగమ్మకాదు సరికదా, ఆవిడ్ని పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా నాటకాన్ని రక్తి కట్టించలేదు" అన్నాడు కోటేశ్వర్రావు.
"ఇదంతా నీ నాటకంలోని ప్రతిభేనంటావా?" అన్నాడు రామచంద్రం నావేపుచూసి నవ్వుతూ.
"నా నాటకమనేకాదు, జీవితానికి దగ్గరగా వచ్చిన ఏ నాటకమన్నా, మంచి నాటకుల చేతిలో పడితే రక్తి కడుతుంది. దానికొక్కటే ఉదాహరణ, కన్యాశుల్కం ఉన్నదనుకో, ఆ నాటకాన్ని, ఎంత చాతగానివాళ్ళు వేసినా రక్తికడుతుంది. మనం ధ్వంసం చెయ్యాలన్నా చెయ్యలేము, గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు, వెంకటేశం, అగ్నిహోత్రావధాన్లు, బుచ్చమ్మ వీళ్ళందరూ మనలోంచి పాత్రలుగా వచ్చినవాళ్ళే! అందుకే మనం ఉన్నంతకాలం అదీ ఉంటుంది". అన్నాను.
"అయితే మనం కన్యాసుల్కమే వేద్దాం!" అన్నాడు రామచంద్రం.
"ముందు ఈ నాటకం సంగతేదో చూద్దాం, రామవరంలో వెయ్యాలనుకొంటున్నాం గదా! అప్పుడు మరికొన్ని తప్పుల్ని మనం దిద్దుకోవాలి" అన్నాను.
"ఛస్తే మార్చకూడదు..నాటకం రక్తికట్టదు" అన్నాడు రామచంద్రం, నేను తప్పులేమిటో చెప్పకముందే!
"అదిగాదురా నీయమ్మ కడుపు కాలిపోను. మామూలువాళ్ళు కనుక్కోలేని తప్పులు, మోన్న మనం ఎన్నోచేశాం. వాటిని దిద్దుకోకపోతే ఎలా? స్టేజీమీద, హీరోయిన్లు కులాసాగా మాట్లాడుకో టచూ ఉంటే మన బలరామయ్య ఆ మాటలు వినపడకుండా హిర్మోనియం తో ముంచెత్తాడు.హీరో తన తండ్రికి ఎదురు తిరిగి ప్రజల పక్షాన నిలబడే ఘట్టమిది. నాటకానికి ఆయువు పట్టులాంటి ఆ సంభాషణలు, జనానికి వినపడకపోతే ఎలా? తండ్రి కొడుకూ ఘర్షణ పడుతున్నప్పుడు, మనవాడు 'మాండ్' రాగం వాయించాడు. అప్పుడు ఏ శ్రీరాగం' అన్నా వాయిస్తే బావుంటుంది స్టేజీమీదకు ఈగ ముసిరినట్లు జనమొస్తే చూసేవారికి బాధ, ఏపరిస్థితులోనూ, ముగ్గురు నలుగురుకన్నా మించి రాకూడదు. ఒకేసారి ఒకరి కన్నా మించి మాట్లాడటం సాధ్యం కాదు. అలాంటప్పుడు మిగతా వారు దిమ్మల్లాగా నుంచోకుండా, సంభాషణలకు అనుగుణంగా భావప్రకటన చెయ్యాలి. మొన్న అలాజరగలేదు. ఇవన్నీ తప్పులా? కాదా? అని నిగ్గతీసి అడిగాను రామచంద్రాన్ని.
"మరి జనంబాగానే వుందన్నారు గదరా!" అన్నాడు వాడు తల గోక్కుంటూ. "ఇంతకన్నా ముదనష్టపు నాటకాలాడినప్పుడు కూడా జనం చూశారు. అందుకని అవే మనం ఆడటంలేదుగా? ఈలోపాలు కూడా లేనప్పుడు ఇంతకన్నా మనం నాటకాలను జనం మెచ్చుకోవచ్చు ఏమంటావ్?" అన్నాను.
రెండో ప్రదర్శనం రామవరంలో జరిగింది. అనుకోనంతగా జనం వచ్చారు. గల్లాపెట్టె ఈ సారి బాగా బరువెక్కింది.
ఇదే నాటకాన్ని ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లోనయితే నేం దూర గ్రామాల్లో నయితేనేం, యాభయ్యారు సార్లు వేశాం, అన్ని గల్లా పెట్టెలు నింపకపోయినా, ఏ ప్రదర్శనమూ ఫెయిల్ కాలేదు.
కోటేశ్వరరావు ఇంకో సూచన చేశాడు. అది నాకెంతో నచ్చింది. వాడన్నట్టుగా లింగో లింగో మంటూ వొక్క నాటకాన్ని పట్టుకుని పాకులాడటంకన్నా రెండుమూడు నాటకాలు నేర్చుకొని ఉంటే, మంచిదిగదా? ఎవరికి ఏది కావాలంటే, దాన్నే వేసిరావచ్చు, ఈమాట నేనన్నప్పుడు రామచంద్రంకూడా అక్కడే ఉన్నాడు.
"అంటే మనం కిరాయి నాటకాలాడటమనేగా అర్ధం?" అన్నాడు వాడు.
"నాకర్ధం కాలేదు" అన్నాడు కోటి.
"మనం డబ్బుకోసం నాటకాలాడ బోతున్నామని దానికర్ధం" అన్నాడు రామచంద్రం, కొంతసేపటికి చురచురగా చూస్తూ.
"అది తప్పని నాకు తెలీదే!" అని వ్యంగ్యం ఏడిచాడు కోటి.
రామచంద్రానికి మండిపోయింది.
"నీకు తెలుస్తుందని, నేనూ అనుకోలేదు గానీ, ఆదశకు మనం రావడమంటే అసలీ సమాజాన్ని మనం ప్రారంభించిననాటి ఉద్దేసాలే మార్చుకోన్నామన్నమాట. అవున్రా?" అన్నాడు వాడు నావేపు చూస్తూ.
"ఇందులో ఉద్దేశాలు మార్చుకోవడమన్న ప్రసక్తేలేదు. నువ్వన్నట్టుగా మనం మంచి నాటకాలనే రాయించుకొందాం, వాటినే ఆడదాం. అందువల్లనే తగినంత రాబడి ఉన్నప్పుడు, మనకభ్యంతరం ఉండనవసరం లేదు. ఏమంటావ్?" అన్నాను.
"ఏదో యాడవండిరా!" అన్నాడు రామచంద్రం.
కవిని పిలిపించి, మరో మూడు నాటకాలు రాయమని చెప్పం. లోగడ నాటకానికి, అతనికి రావలసిన డబ్బేదో ముట్టచెప్పాం, నాటకం ఎలావుండవలసిందీ, ఎన్ని పాత్రలుండవలసిందీ, ఎన్ని సీనులుండవలసిందీ, కూడా చెప్పాం. లోగడ అనుభవం ఉన్నది గనుక, ఈ సారి నాటక రచన అంతకష్టం కాదని కూడా చెప్పా.
* * * *
కొత్త నాటకం "మళ్ళీ మళ్ళీ" తయారవుతున్న రోజుల్లోనే చిన్న కలవరం తలెత్తింది. ఇది మంగమ్మను గురించిన కలవరం. ఆపిల్ల దాదాపుగా మా సమాజంతోనే ఉండిపోయింది. ఎప్పుడో గానీ గుంటూరు వెళ్ళేది కాదు. అదీ నాగమణి ప్రాణాలు తోదేస్తూ ఉంటే పోయేది.
మంగమ్మ పేరు, ఇతర నాటక సమాజాలక్కూడా తెలిసింది. కొంతమంది ఎక్కువ డబ్బిస్తామని నాగమణితో బేరాలు సాగించారు.
"మాదేముంది నాయనా! మాకు వారు చుట్టాలుకాదు. మీరు పరాయివారూ కాదు. అలాగే పంపుతాను" అనేదిట.
కాని మంగమ్మ నడిగితే, ఈ పిల్ల వొప్పుకొనేదికాదు ఎంత హీనంగా చూచుకొన్నా సంవత్సరంపాటు మాతో కలిసి మెలిసి ఉన్న మనిషాయే, మా లోటుపాట్లు, బలహీనతలు, మంచితనాలు మంగమ్మకు తెలిసినవే, ఆవిడను గురించి మాకూ తెలుసు, ఈ పరస్పర అవగాహనవల్లనే మా సమాజం ఓ కుటుంబంలాగా పొరపొచ్చెంలేకుండా ఉండగలుగుతోంది.
"ఈ ముండకు డబ్బుయావ తప్ప మరో స్మరణలేదు. ఎవడు డబ్బిస్తే వాడేదానికి దేవుడు" అని తిట్టిపోసేది మంగమ్మ.
ప్రస్తుతం దేశంలో మా సమాజానికున్న పేరు ప్రతిష్టల దృష్ట్యా మరో అమ్మాయిని మా సమాజంలోకి తీసుకురావడం ఏమీ కష్టం కాదు. కానీ ఆ మహాతల్లి వెంట ఎన్ని సమస్యలుంటాయో మాకు తెలియగాయె! వాటిని దిద్దుకోలేక సతమతం కావడంకన్నా ఈవిడతోనే సర్దుబాట్లు చేసుకుంటే పోతుందని నా ఏడుపు.
మంగమ్మ పేరు వాడ వాడలా పాకడంకూడా, ఆవిడ కంఠం మీదికే తెచ్చింది. కీర్తి పెరగడంతోబాటుగా ఆవిడను ప్రేమించే వారు కూడా పెరిగిపోయారు. ఈ సజ్జంతా నాగమణి చుట్టూచేరి పొగవేస్తుండేవారు. నాగమణికి
శివమెత్తడమన్నది క్షణాలమీద పని. ఏదో వంకతో మంగమ్మను గుంటూరు పట్టుకెళ్ళి, రెండ్రోజుల తర్వాత తిరిగి పంపుతుండేది నాగమణి, ఈ రెండురోజులకే పది రోజులు లఖణం చేసినదానిలా జోదులు కొడుతూ వచ్చేది మంగమ్మ, ఏంజరిగిందో మాకు తెలుసు గనుక, ఎవ్వరమూ, మంగమ్మను కారణం అడిగేవాళ్ళంకాదు. అప్పుడప్పుడూ రామచంద్రం గాడే ఎగతాళి చేస్తూ ఉండేవాడు.
"మహాతల్లి మంగమ్మగారు జాగారం చేసినట్లుందోయ్!" అనేవాడు రామచంద్రం.
మంగమ్మ చాలా తాపీగా నవ్వేది.
ఒకసారి కొత్తనాటకం తాలూక రిహార్సల్స్ వేస్తున్నాం. నాగమణి అట్టహాసంగా వచ్చింది. మంగమ్మను పంపించమని అడిగింది. రామచంద్రం వీలుకాదన్నాడు. నాగమణి అంతంత మాత్రం మాటలకు వినేరకం కాదాయె, గొంతు పెంచి అరవసాగింది.
"నీకు పది నిముషాల టైమిస్తున్నాను. ఈలోగా నువ్వీ వూరు దాటిపోవాలి. లేకపోతే-"
"తలగొట్టి మెలేస్తావా ఏందయ్యా అన్నది నాగమణి"
"ఇంకా మెలెయ్యడం దేనికి? నీలాంటి పాపిష్టిముండలు మళ్ళీ పుట్టుకురావడానికా? నిన్ను తలగొట్టి పాతేస్తావు. నీ బాబుగా డెవడడ్డమొస్తాడో చూస్తాను. నీ పిచ్చి వేషాలు నా దగ్గర పని చెయ్యవు" అన్నాడు రామచంద్రం ఇంతెత్తున మండిపడుతూ.
నాగమణి సీదాగా చప్పబడిపోయింది.
"సంపాయించుకొనే వయస్సిదేనయ్యా బాబూ! మరో పదేళ్ళుపోతే, ఎవరూ వాసనన్నా చూడరు. మీరు ఇవ్వనూ ఇవ్వక, ఇచ్చే మారాజును ఇవ్వకుండానూ చేస్తే అనక దాని గతేంగానూ?" అన్నది నాగమణి.
"మంగమ్మకు జరుగుబాటు కేంకొదవలేదే?" అన్నాడు రామచంద్రం.
పదిమంది ముందూ సిగ్గూ సారమూ లేకుండా జరిగిపోతున్న ఈ సంభాషణ వింటుంటే,. నాకే వాంతివచ్చినట్లయింది. నాగమణిని చాటుకు పిలిచి, అంతవరకూ, మంగమ్మకు రావలసిన డబ్బేదో లెక్క చూసి ఇచ్చాను.
"మొగాడివంటే నువ్వేనయ్యా మొగాడివి. ఏం మందువేశావో గాని మా మంగమ్మను గుప్పిట్లో
ఇరికించుకున్నావయ్యా! ఆ భడవాకూడా నువ్వంటే పడిచస్తుందనుకో ఆమందేదో, నాకూ చెబుదూ పాత పార్టీలకన్నా తెచ్చుకొంటాను" అన్నది నాగమణి, నా రెండు బుగ్గలనూ అరచేతుల్తో అదుముతూ.
డబ్బిచ్చి వచ్చాక మంగమ్మ నన్ను చాటుకు పిలిచి, బావురుమని ఏడిచింది. సంగతేమిటని అడిగాను.
"అనవసరంగా మీరు లొంగిపోయారు. నాకోసం ఇలా ఎన్ని సార్లని ఇస్తారు? నేను చచ్చిందాకా
అదివదలను. నన్ను పంపెయ్యకూడదా?" అన్నది మంగమ్మ.
"పంపితే?" అన్నాను.
"దానిదాహం తీరేదాకా డబ్బు సంపాదించి ఆ తరువాత రోగాలతో పుచ్చి చచ్చి పోతాను. దమయంతి అలాగే చచ్చి పోయింది అరుంధతి చావడానికి సిద్దంగా ఉంది. ఎంతమందిని ఈ గానుగలో వేసి పిండిందో తెలీదు. కిందటిసారి వెళ్ళినప్పుడు, మరో కొత్తపిల్ల కనిపించింది" అన్నది మంగమ్మ.
"వీళ్ళందరూ ఎలా దొరుకుతారు" అనడిగాను.
"కూటికి గతిలేక కొంతమంది గీని కొంపకొస్తారు. ఇంకొంతమంది ఉంటారు., వారు ఎక్కడో పుడతారు. ఈ వాతావరణంలో పెరిగి, ఇందులోనే ఉండిపోతారు. దిక్కూ మొక్కూ లేక, పిల్లల్ని పోషించలేని వారూ, పాతిక్కో పరక్కో పిల్లల్ని అమ్ముకొంటారు. వాళ్ళను కొని, ఈ రకంగా డబ్బు సంపాదిస్తుంది."
"నాటకాల్లో వేశానంటుందేం మరి? అదంతా నిజమేనా?" అన్నాను నేను.
"ఇదివరకు సంగతి నాకు తెలీదు. తెలిసాక నాటకాలాడ్డం నేనెరుగను. ఇంతకన్నా బ్రహ్మాండమైన
నాటకాలింకేమీ ఆడాలి మేష్టారూ?" అన్నది మంగమ్మ.
ఆ మాటలంటున్నప్పటి మంగమ్మరూపం, నన్ను ముగ్దుణ్ణి చేసింది. తొలిసారిగా మంగమ్మ చేతిని పట్టుకొని ఆవిడకు హామీనిచ్చాను.
"ఆరు నూరైనా హరిబ్రహ్మాదులడ్డంవచ్చినా, నిన్నా నాగమణికి అప్పగించడం అబద్దం. నీకు మంచి భవిష్యత్తున్నది. దానికి ఇప్పుడే పునాదులు పడుతున్నాయి. నువ్వు ప్రతి వెధవ కామాన్ని తీర్చే బొమ్మపు కావడం నాకిష్టం లేదు" అన్నాను.
మంగమ్మ కళ్ళు కృతజ్ఞతతో నిండిపోయాయి. వంగి నమస్కరించబోయింది. నేనే పక్కకు తప్పుకున్నాను.
"మళ్ళీ పెళ్ళి" నాటకం, ఆరోజుల్లో గొప్పతుఫానును లేవగొట్టిందనడంలో సందేహంలేదు. వీరేశలింగంగారు అంతకు ముందెప్పుడో విధవా వివాహాలు ప్రారంభించినప్పటికీ, ఆ ఉద్యమం, మేధావులను దాటి ముందుకు సాగలేదు. మా సమాజం వీరేశలింగంగారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళకలిగింది. అందులోనే కన్యాశుల్క నిరసనా, అంతర్వర్ణ వివాహాలు, సంహాపంక్తి భోజనాలు, వగైరా హంశాలన్నీ చేర్చాము. ఈ నాటకానికి కావలసిన కధావస్తువును, వీరేశలింగం గారి ప్రవాసనాలనుండీ, గురజాడవారి కన్యాశుల్కంనుండి, చలం గారి కధలనుండి స్వీకరించాం. వీరందరి ఆశయాలకూ, మానాటకం గమ్యస్ఛలంవంటిది. మూడుగంటల నాటకాన్ని మూడంటే మూడే మూడు రంగాలలోకి కుదించి పారేశాం. డైలాగ్స్ చాలా పవర్ ఫుల్ గా కన్విన్సింగ్ గా ఉన్నాయి. రిహార్సల్స్ చూసినవారు 'అద్భుతం' అన్నారు.
ఒకసారి మావూరు అయ్యేదవర కాళేశ్వరరావుగారూ, దరిశి చెంచయ్యగారూ వచ్చారు. సంఘసంస్కర్తలైన వీరిద్దరినీ రిహార్సల్ చూడవలసిందిగా ఆహ్వానించాను. వితంతువుగా మంగమ్మ నటన, ఆనాడు పరాకోటి నందుకొంది. కాళేశ్వరరావుగారు నన్నాలింగనం చేసుకొన్నారు.
"నేను ఇటువంటి పరిణామమునే చాలా కాలంనుండిన్నీ ఆశిస్తూయుంటిని. మీవంటి నవయువకులు ఆనాటి కళలను నిజాము చేయుచున్నారు" అన్నారు చెంచయ్యగారు.
"మళ్ళీ పెళ్ళి" ప్రదర్శనం మొదటిసారిగా మా గ్రామంలోనే ఏర్పాటుచేశాం. ప్రజలమీద ఈ నాటక ప్రభావమేమిటో చూడందే పొరుగూళ్ళు వెళ్ళడం నాకిష్టంలేదు. ఈ నాటకం ప్రతిపాదించే సిద్దాంతాలు, న్యాయమైనప్పటికి, ప్రజలకు కొత్త, కులమతాల ప్రభావం అతి దారుణంగా ఉన్నరోజులవి., విధవా వివాహాలకు సిద్దాంతరీత్యానే తప్ప అంతగా ఆచరణలో లేని రోజులవి, వాటిని వ్యతిరేకించడమంటే - దాదాపుగా మొత్తం సమాజాన్ని వ్యతిరేకించడమన్నమాటే. సంఘానికి ఇష్టంలేని పనులు చేస్తూ, ఆ సంఘం చేతనే మెప్పు పొందాలనుకోవడం అజ్ఞానమోకాదో నేను చెప్పలేను గానీ సాహసం మాత్రం అవుతుంది! ఈ నాటకాన్ని గురించి అనుకూల ప్రచారంకన్నా వ్యతిరేక ప్రచారమే ఎక్కువగా జరిగింది. కొంతమంది, పనిమాలా నాటకాన్ని అల్లరి చెయ్యడానికే వస్తున్నారని మాకు తెలిసింది. మేమూ అందుకు తగిన బందోబస్తు చేశాం. ఏకొంటె వెధవన్నా, నోరెత్తితే, వెంటనే వాడిపీక నులిమెయ్యమని, రామచంద్రం హుకుం జారీ చేశాడు నాటకంలో మేము మంచివనుకున్న సీన్లొచ్చినప్పుడు, చప్పట్లు కొట్టమన్నాం. కొన్ని కొన్ని పాటలకు వన్సుమోర్ లు కొట్టడానికి ప్రత్యేకంగా కొందరిని ఏర్పాటు చేశాడు కోటేశ్వరరావు.
స్థూలంగా పని పంపిణి జరిగిపోయింది. ఎలాంటి అల్లరీ జరక్కుండా చూడటం, చప్పట్లను, వన్స్ మోర్లను సరఫరాచేయడం కోటిగాడి వంతు. నాటకం అమోఘంగా వేయడం మావంతు.
తొమ్మిదింటికి ప్రారంభం కావలసిన నాటకానికి, ఏడున్నరకే జనం పిక్కటబిర్రుగా వచ్చారు. ఎనిమిదయ్యేసరికల్లా రామచంద్రం హారతి కర్పూరం వెలిగించాడు. బలరామయ్య ఓసారి హార్మోనియానికి దణ్ణంపెట్టి 'పరబ్రహ్మ' వాయించాడు. క్రిష్ణమూర్తి తెరలాగాడు.
అరవయ్యేళ్ళ ముసలి వాడుగా నాగభూషణం, నాలుగో పెళ్ళికోసం పురుషోత్తం గారింటికొచ్చాడు. ఆయనగారు నాలుగు వేల శుల్కం పుచ్చుకొని పధ్నాలుగేళ్ళ మంగమ్మను, నాలుగో పెళ్ళాంగా అమ్మడానికి సిద్దపడతాడు. బేరసారాలన్నీ అయిపోయాక, రంగం మీద మంగమ్మ ఒక్కతే వుంది. పావుగంటసేపు ఏకధాటిగా ఉపన్యాసం ఇచ్చేది, కరుణ రసప్లావితమైన ఉపన్యాసం. అప్పటి మంగమ్మ నటన, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసివేచాము. మా నాటకంలోని తొలిగండం ఇదే! దీన్ని దాటితే, మిగతావాటిని దాటినట్లే లెక్క. ఏదో కొంత మునుగుతుందనుకొన్నాం గానీ ఏమీ జరగలేదు. అల్లరి చెయ్యడానికొచ్చినవారు కూడా కిక్కురుమనలేదు. మంత్రించినట్లు కూర్చుండి పొయ్యారు. ఆ మంత్రశక్తి సడలిపోకముందే రామచంద్రం రెండవరంగాన్ని ప్రారంభించాడు. వాడువిధవరాలైన మంగమ్మను ప్రేమించాడు. కానీ వారిద్దరి కులాలు వొకటికాదు. మంగమ్మ ఈడుగలవారందరూ, పిల్లలతో కళకళలాడుతూ ఉంటే, మంగమ్మ రాసివోసిన దుఃఖంళా జీవిస్తోంది. రామచంద్రం, కృత్రిమమైన మత వ్యవస్థలను దుయ్యపడతాడు. స్త్రీ పునర్వివాహాలు శాస్త్ర సమ్మతమే నంటాడు.
వేదాంత దృష్టితో చూసినా స్త్రీ పునర్వివాహాలు భారతీయ సంప్రదాయాలకు అనుగుణమైనవే నంటాడు. గుణం ప్రధానంగానీ, కులం ప్రధానంకాదు. తక్కువ కులంలో పుట్టిన ఎందరో మహానుభావులు, తమ ప్రవర్తనచేతా గుణ గణ సంపధచేతా మహర్షులైనా రంటాడు. మంగమ్మ తండ్రి, అతని వాదనలు అంగీకరిస్తాడు. కానీ పెళ్ళి తను చెయ్యననీ, ఇద్దరూ ఏదన్నా దూరదేశం వెళ్ళి అక్కడ పెళ్ళి చేసుకొండనీ సలహాయిస్తాడు.
"మీరూ ఆడపిల్లల తండ్రులయితే తప్ప నా బాధ మీ కర్ధం కాదు. మీ కూతురే ఇలా బాల్య వితంతువైతే, మీరేం చేస్తారో నేను అదేచేశాను" అంటాడు ఆఖర్న.
ఈ సీను రక్తికట్టిందంటే, రక్తి కట్టడంకాదు. అంతకన్నా ఏమనవలసిందీ నాకు తోచలేదు. అల్లరి చేయ్యాలనుకోన్నవారూ, వన్స్ మోర్లు కొట్టాలనుకున్నవారు కూడా ఆ రెండుపన్లు చెయ్యడమూ మరచిపోయారు. అంతకన్నా మా విజయానికి మరో ఉదాహరణ అవసరం!
పేరు ప్రతిష్టలతో బాటుగా, ఆర్ధిక స్థితిగతులుకూడా మా సమాజానికి సమృద్దిగా ఉన్నాయి. స్వంతంగా మేమే తెరలూ, రంగులూ కొనుక్కొన్నాం. భావనారాయణకు మేకప్ నేర్పించాం. కోటేశ్వరరావు పబ్లిసిటీ కాంట్రాక్టులు, హాలు, ఇతర ఏర్పాట్లు చూస్తున్నాడు రామచంద్రం హీరోగా మాంచిపేరు తెచ్చుకున్నాడు. హీరోయినంటే మంగమ్మ పేరు చెప్పాకనే ఇంకోరి పేరు చెప్పాలన్న స్థితివొచ్చింది.
చెబితే మీరు అబద్దమనుకొంటారు గానీ, ఆరోజుల్లో మా సమాజం, ఆంధ్ర దేశంలోని అన్ని ముఖ్య కేంద్రాలలోనూ, నాటకాలాడింది. పెద్ద పెద్ద నటీనటులందరూ మా నాటకాలు చూసి ఆనందించారు. కొంతమంది మా సమాజంలోకి వచ్చిచేరారు.
నాటక కలయోక్క శక్తీ సామర్ద్యాలేమిటో 'మళ్ళీ పెళ్ళి' ప్రదర్శనంతరువాత మాకర్దమయింది. ఈ రంగంద్వారా సంఘ సంస్కరణ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళవచ్చు ననిపించింది. మరి కొన్ని కొత్త నాటకాలు రాయించి ఆడాలని కూడా మేమనుకున్నాం.
