24
ఆఫీసు నుంచి ఫోన్ చేసింది సునీత. "సాయంత్రం ఆఫీసు కాగానే వస్తున్నాను. మీరు ప్రైవేట్ రూమ్ లో ఉండండి, డాక్టర్!"
వేణుకు చెప్పనైనాలేదు వెళ్ళేముందు.
ప్రైవేట్ రూమ్ లో అంతా నిశ్శబ్దం. సునీతే మొదట అన్నది: "నేనెవర్ని, డాక్టర్?"
"అదేం ప్రశ్న, పాపా?"
"మీరు నన్నెందుకు 'పాపా' అని పిలుస్తున్నారు?"
"ఒక కారణమంటూ చెప్పలేను."
"పోనివ్వండి. యాదగిరి గారెవరో మీకు తెలుసుకదూ? ఆయన మీకేమవుతారు?"
"దగ్గిర బంధువే. మామయ్య అవుతారు!"
"ఊఁ, మీరు ఎప్పుడైనా దేవకి పేరు విన్నారా, డాక్టర్?"
ఆర్తి హృదయ స్పందన క్షీణించినట్లయింది ఆ మాటకు. ఈ పేరు సునీత కెలా తెలిసింది? మామయ్య చెప్పాడా?
"తెలుసు, పాపా! కానీ .... అభాగ్యురాలు. ఇక్కడికి చాలాదూరంలో ఒక బంగళాలో, సమాధికింద, దీర నిద్రలో ఉందమ్మా." నిట్టూర్చింది.
"ఆమె ఎవరు, డాక్టర్? మీ దగ్గిర బంధువా?"
"ఎవరని చెప్పను? బంధువే. నాకు మేనత్త. పాపా, ఆమె నీకెలా తెలుసు?"
"మీ ఊహల్లో నేనెవరో.....నేను ఆమెనే, డాక్టర్."
"అంటే .... అంటే ..... నువ్వు .... నువ్వు ..."
"సర్టిఫికేట్లను చూసినరోజే తెలుసుకున్నారు. ఇంకా నమ్మకం లేదా? నమ్మటం లేదా, డాక్టర్?"
"ఓహ్ పాపా! ఇన్నాళ్ళకి ..... ఇన్నాళ్ళకి .... నువ్వెలా తెలుసుకున్నావు?"
"మా నాన్న చెప్పాడు, డాక్టర్!"
"మీ నాన్న? నాన్న? ఎవరు? ఎవరు, పాపా?"
"మీ యాదగిరి మామయ్య!"
"ఆఁ!" సర్రున నిల్చుంది ఆర్తి. "ఏమన్నావు, పాపా?"
"నిజం, డాక్టర్! మీరు నావెంట రాగలిగితే ఆయన నోటనే వినవచ్చు! రాగలరా?"
"ఊఁ, ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదు. ప్రార్ధన అయ్యాక. వద్దు, ఇప్పుడే వెళదాం."
యాదగిరి తిరిగి ఆ గాథ ఆర్తికి చెప్పాడు.
ఆర్తితో ఇంటిదాకా వచ్చింది సునీత. కారులో -
"ఈ కథనం వేణుగారికి ఏమాత్రం తెలియనివ్వవద్దు, డాక్టర్!"
"ఇంకా డాక్టర్, వేణూ యేనా, పాపా?" అంది ఆర్తి నవ్వుతూ.
సునీత నవ్వుతూ, "కొన్నాళ్ళదాకా అంతే! మీ నాన్నగారు వచ్చేదాకా దీనిని గోప్యంగా, ఉంచాలి."
"ఉంచితే?"
"ఆయన వచ్చాక వేణు, రాధలకు పెళ్ళిచేసి అంతా చెప్పవచ్చు. అప్పు డే బాధా ఉండదు. లేకపోతే వేణుగారు చెప్పిన మాట వినరు."
"అదా! సరేలే, పాపా! కానీ నువ్వెందుకింత త్యాగానికి ఒడిగట్టావు?"
"త్యాగమేముంది, డాక్టర్?"
"నాకు అన్నీ తెలుసు! నీ మెడలో ఉన్న లాకెట్ లో ఎవరి ఫోటోలు ఉన్నాయో, నీ హృదయ మందిరంలో ఎవరి విగ్రహం ప్రతిష్టించబడిందో...... అన్నీ తెలుసు. మరిచావా, పాపా? నువ్వే ఒకసారి నాతో చెప్పావు."
"పోనివ్వండి! అందమైనదీ, మంచిదీ - నిలవగల వస్తువును అందరూ కోరుకుంటారు. అది ఏ ఒక్కరికో మాత్రమే లభిస్తుంది. ఎవరో ఒకరు వదులుకోక తప్పదు. అమ్మ ఏం చేసింది, డాక్టర్? తను బతికి ఉంటే అన్నకూ చెడు పేరు, అటు నాన్న సంసారానికీ చేటు."
"ఓహ్! నువ్విక చెప్పకు, పాపా!"
"రాధ నాలాంటిది కాదు. వేణును వివాహం చేసుకుంటాననే కలలు కంటున్నది, వాటిని కల్లలు చెయ్యటం ఎందుకు?"
"సరే! అన్నీ శుభసూచకాలే కనబడుతున్నాయి. ఎటుబడి నువ్వు ఒక్కదానివి...."
"ఒక్కదాన్నేమిటి? మీరందరూ ఉన్నారు. ఇంతకన్నా కావలసిందేం ఉంటుంది?"
అబిడ్స్ లో సునీత దిగింది. ఆర్తి ముందుకు వెళ్ళింది.
మరుసటి రోజు విశ్వంతో చెప్పింది. అది విని అతను, "మొత్తంమీద మీరందరూ ఒకటేనని తేలిపోయింది. ఇక దీని పర్యవసానమేమిటో చూడాలి" అన్నాడు.
"విశ్వం, ఏదీ నీనుండి దాచుకోలేదు. అవసరమైతే మీరు దీనికి సాక్షులుగా నిలబడగలగాలి."
"అలాగే! నీలకంఠంగారికి చెప్పావా?"
"చెప్పలేదు. కరుణకు చెప్పాను."
హాస్పిటల్ ముందు డోమ్ లైట్ దేదీప్యమానంగా వెలుగుతున్నది. ఆ వెలుగుకన్నా సునీత కళ్ళలో కాంతి ఎక్కువ కనిపించింది విశ్వానికి. వేపచెట్టు కిందనుండి లేచారిద్దరూ!
* * *
గోవిందరావునుండి పెద్ద కవరు వచ్చింది. అందులో సారథి వ్రాసిన లేఖకూడా ఉన్నది. అతని ఉత్తరం మొదలవటమే గమ్మత్తుగా ఉంది.
"దేవేరులకు శుభాకాంక్షలు. ఉభయ క్షేమానంతర సమాచారములు.
ఆర్తీ, తిరిగి ఎన్నాళ్ళకో పరస్పర సందర్శనభాగ్యం కలుగబోతున్నది. మొదటిసారి మీ నాన్నగారు చెప్పినప్పుడు నాకేమీ అనిపించలేదు. నిన్ను చూశాను. ఎలా అంటే -
మీ నాన్నగారు ఒకరోజు హఠాత్తుగా మేమున్న కుటీరానికి వచ్చారు. నా కళ్ళను నేను నమ్మలేక పోయాను. ఆరోజు కాశీలో ఎలాగో తప్పించుకో గలిగాను. ఇవ్వాళ అది అసాధ్యమైంది. నన్ను మాట్లాడించి, బాబాజీగారిని పరిచయం చేసుకున్నారు.
ఆయన బాబాజీగారికి నమస్కరించి, తను ఇంటి దగ్గిర బయలుదేరిననాటినుండి అందులో తనకు గల ఉద్దేశ్యంతోసహా విన్నవించుకున్నారు. బాబాజీగారు అంతా విని, మీ నాన్నగారికేమీ చెప్పలేదు. మూడు రోజులు తమ ఆతిథ్యంతో ఉండమన్నారు. అంతే!
ఆమెను నేను ఆ రోజు చూసిన తరవాత (అవన్నీ ఇంటికి వచ్చాక చెబుతాను) పూరీ వచ్చాను. అక్కడే నాకు రామకృష్ణ పరమహంసకు శిష్యులైన నిరంజన బాబాజీతో పరిచయమైంది. గృహసంబంధమైన చిక్కులతో మనశ్శాంతిలేక తిరుగుతున్నానని వారి శిష్యగణంలో చేరాను. ఆయన నాకు శాంతి లభించిందనుకుని, ఇంటికి పోగలిగి సుఖపడగలిగాననుకున్న రోజు వెళ్ళవచ్చనీ, లేదా నా ఇష్టం వచ్చినంతకాలం ఉండవచ్చనీ చెప్పారు.

ఈ మధ్యకాలంలో హిమాలయ పాదాక్రాంతమైన సుందర ప్రకృతిని నాలుగుసార్లు చూశాము. ప్రతి పుణ్యక్షేత్రము, చారిత్రక స్థలాలు, ప్రకృతికి ఆట పట్టయిన ప్రదేశాలు ఎన్నో చూశాము. కాని హిమాలయాల్లో ఎంతకాలం గడిసినా, ఎన్నిసార్లు చూసినా తనివిదీరదు. నీలాకాశానికంటా చొచ్చుకుపోతున్న ధవళ హిమగిరి శృంగాలు, ఎండకు కరిగి నీరై జాలు వారుతున్న సెలయేళ్ళు, రా రమ్మని చేతులు చాచి ఆహ్వానిస్తున్న ప్రకృతిలో లీనమై పోవాలన్న ప్రగాఢ వాంఛ ఎవరికి కలగదు?
రెండుసార్లు కాబోలు నువ్వు నా అంతరంగంలో మెదిలావు. కాని తన్మయస్వరూపమైన ధవళగిరులు నన్ను మరిపింపచెయ్యగలిగాయంటే - నువ్వే ఊహించుకో!
బాబాజీ నన్నొకరోజు పిలిచారు, ఏకాంతంగా ఉన్నప్పుడు.
వెళ్ళాను.
'సర్వ సృష్టికే మాతలయిన స్త్రీలను బాధపెట్ట కూడదు. నీ స్మరణలో, నీ సన్నిధికి ఒక స్త్రీ ఆక్రోశిస్తున్నది, నాయనా!'
ఆ మాట నిన్ను, నీ రూపాన్ని కళ్ళకు కట్టింది. అయినా చలించలేదు. అందుకే నా మనస్సుకు ఇంకా శాంతి లభించలేదన్నాను.
ఆయన మందహాసంతో, 'అక్కడ దొరకని శాంతి ఇక్కడ దొరుకుతుందా?' అన్నారు.
'అందుకే గదా వచ్చింది.'
'పిచ్చివాడా! ఒకరిని శోకానికి గురిచేసి, నువ్వు పొందగలిగే శాంతి ఏపాటిది, నాయనా? గృహస్థజీవితం కూడా పవిత్రమైనదే! నాబోటి సన్యాసులకు, భిక్షుకులకు గృహస్థులుంటేనే కదా గడవటం? నేను ఆర్య ఋషులులా వాయుభక్షణమే చేసి తపస్సు చెయ్యలేదు. అది మనబోటివారికి దుస్సాధ్యం. నాకు తొంభై ఆరు ఏళ్ళు. ఇందులో నేను సగభాగంపైగా గృహస్థునే. భార్యావియోగానంతరం ఈ దీక్ష స్వీకరించాను. నీ భార్య నీకోసం తపిస్తున్నది. సన్యసించే వయస్సు కూడా నీకు లేదు. నువ్వు వెళ్ళక తప్పదు.'
నేను మూగవాడినయ్యాను.
'దైవ సాన్నిధ్యానికి సన్యాసమే ప్రధానం కాదు. అందరూ సన్యాసులే అయితే లోకసృష్టి ఎలా జరగ గలదు? మన వేదాలు, పురాణాలు ఏది చూసినా గృహస్థు కెంతో విలవ ఇచ్చాయి. రామాయణ కథా నాయకుడు రాముడు. కృష్ణ ప్రభువు, కైలాసపతి - వీరందరూ అర్ధనారీశ్వరులే కదా?'
'అవును!'
'దీనివల్ల నీకేం తెలుస్తున్నది? సర్వ సృష్టికీ మూలం దాంపత్యమనే కదా? పశుపక్ష్యాదులు, వృక్ష సంతతి ఏవీ ఈ ధర్మాన్ని వీడగా చూశావా? అన్ని భోగాలు అనుభవిస్తే కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకొనే ఆస్కారం ఉంటుంది. మధ్య లోనే త్యజించి మరొక మార్గం ఎన్నుకుంటే, నీవు రెంటికి చెడిన రేవడవు కావచ్చు. వయస్సు వచ్చి, నీ బిడ్డలు నీ భారం వహించాక నువ్వు ఏం చేసినా చింత లేదు. కాని నువ్వు ఏదో తప్పు చేశాననుకుని మరొక తప్పు చేసి, నీ ప్రాయశ్చిత్తంకోసమని మరొకరికి వ్యథ కలిగించావు...'
'తమరు గృహస్థ జీవితాన్ని సమర్ధిస్తారా?'
'సమర్ధించాలి, నాయనా! మనిషికి నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయని నీకూ తెలుసు! అవి మానవుల జీవనాన్ని క్రమబద్ధం చేస్తున్నాయి. ఒక దోవను చూపుతాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ఆశించిన గమ్యం చేరవచ్చు. ఒక్కసారే ఫై కెగరాలంటే ఎగరగలమా?'
నేను మాట్లాడలేదు.
'చూడు, నాయనా! తాము అమితంగా వలచిన పురుషుల వియోగాన్ని స్త్రీలు భరిస్తూ అందులో ఆనందం చూసుకోగలరు. వారికోసం మంటలలో దూకగలరు. ప్రాణత్యాగం చెయ్యగలరు. ఇది నేను స్వయంగా చూశాను, నాయనా!'
ఎక్కడని అడిగాను.
ఆయన రెండు మూడు సంఘటనలు చెప్పారు. తరవాత నన్ను కళ్ళు మూసుకోమన్నారు. మూసుకున్నాను. నా కళ్ళకు ఆయన హస్త స్పర్శ తగిలింది.
నువ్వు హాస్పిటల్ ప్రైవేట్ రూమ్ లో ఉన్నావు. నీ కెదురుగా నా ఫోటో ఉన్నది. నీ నయనాలు అవిరామంగా వరిస్తున్నాయి. 'ఎప్పుడు వస్తారు?' అని అడుగుతున్నావు. ఫోటోను కన్నీటితో అభిషేకిస్తున్నావు.
సరిగ్గా ఇదే దృశ్యం, ఆర్తీ, ఒకే ఒక నిమిషం చూశాను. అంతలో బాహ్యస్మృతి కలిగింది. ఇంకా నాకు కళ్ళలోనే ఉంది ఆ దృశ్యం.
ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగానో నాకే ఆశ్చర్యంగా ఉన్నది. ఎప్పుడు రెక్కలు గట్టుకు వాలుదామా అన్న తొందర. ఇవ్వాళ పౌర్ణమి. గంగోత్రిని ఈ నిండు వెన్నెల్లో దర్శించబోతున్నాను. పరమేశ్వరుని పాదఘట్టనంవల్ల పునీతమైన ఈ గిరిరాజు నాకే సందేశం ఇస్తాడో? అది అందుకుని నీ సన్నిధికి ....
నన్ను కట్టి నీ ముందుకు తెచ్చుకుంటున్నావు. డాక్టరుగారూ, నన్ను తిరిగి మీ సేవలకు వినియో గించుకుంటారా? ఆ భాగ్యం కలిగిస్తారా?
ఢిల్లీలో నా స్నేహితుడొకడు ఉన్నాడు. అతనిని కలుసుకుని చాలారోజులైంది. అందుకని ఢిల్లీ చేరుకుని, అక్కడనుంచి ప్లేన్ లో హైదరాబాద్ కు.
ఇవ్వాళ శనివారం. మళ్ళీ శనివారంకాక పై వచ్చే శనివారం నీ దర్శనం చేసుకుంటాను. తమరు నాకోసం ఆహ్వానించేందుకు వస్తున్నారా?
అడగటాలు, చెప్పటాలు వగైరాలు మీనాన్న గారి ఉత్తరంలో.
-సారథి."
ఆర్తి బాణంలా వేణు ఆఫీసుకు వచ్చింది. తమ్ముడి కది చూపించి సునీతకోసం పైకి వెళ్ళింది. ఆర్తి ఆఫీసుకు అలా ఒకసారెప్పుడో వచ్చింది. సునీత వింత పడింది.
"ఆయన .... ఆయన... వచ్చే శనివారంనాడు వస్తున్నారు, పాపా!"
"ఓ! కంగ్రాచ్యులేషన్స్, డాక్టర్!"
