Previous Page Next Page 
వసుంధర కధలు -2 పేజి 40


    ఆయన నా మరిదిని పరీక్షించి-అతడికి పిచ్చి ఉన్నదని తేల్చారు. ఆ విధంగా అతడు పిచ్చాసుపత్రికి తరలించబడ్డాడు. తనకు పిచ్చిలేదనీ, ఇది అన్నగారు పన్నిన కుట్ర అనీ అతడు అరుస్తూండేవాడు. వారు అన్ని బాధ్యతలూ సైకాలజిస్టు మిత్రుడికి అప్పజెప్పి-తానింక ఆ ఊళ్ళో ఉండలేనని ఇక్కడకు తరలివచ్చారు-"
    "చాలా తమాషాగా ఉంది-" అన్నాడు వెంకన్న-"ఇప్పుడతడి పిచ్చి తగ్గి బయటకు వచ్చాడంటారా? యింకా పిచ్చివాడుగానే ఉన్నాడంటారా? యింత తెలివిగా పథకంవేసి హత్యచేసినవాడు పిచ్చివాడంటే నాకు నమ్మకం కలగడం లేదు-"
    "అతడిది మామూలు పిచ్చికాదు. అదో రకంపిచ్చి. మనుషుల్ని బాధించడం, నేరాలు చేయడం అతడికి సరదా. ఏం చేసినా ఓ పధకం ప్రకారం చేసేవాడు. పథకాలు చాలా తెలివిగానే ఉంటాయి. కానీ అది తెలివికాదు. పిచ్చి. సైకాలజిస్టు చెప్పేవరకూ మాకావిషయం తెలియలేదు...." అంది సుందరమ్మ.
    "విశాఖపట్నంలోని ఆ సైకాలజిస్టు ఎవరో నేను తెలుసుకొనవచ్చా?" అనడిగాడు వెంకన్న.
    సుందరమమ తడబడింది. వెంకన్న నొక్కించడంతో ఆమె సైకాలజిస్టు పేరు, చిరునామా కూడా చెప్పింది.
    అప్పుడు వెంకన్న-"ఒక్కసారి మీ యిల్లు సోదాచేయాలి. హంతకుడి ఆచూకీ తెలుసుకునేందుకు ఈ సోదాచాలా అవసరం...." అన్నాడు.
    "అంటే శశికాంత్ హంతకుడని మీరు నమ్మడం లేదా?" అంది సుందరమ్మ.
    "శశికాంత్ హంతకుడని మీరు నమ్మాలనుకుంటున్నారా?" ఎదురు ప్రశ్న వేశాడు వెంకన్న. సుందరమ్మ ఏమీ మాట్లాడలేదు. గదుల సోదా పేరు చెప్పి వెంకన్న ఒకో గదీ చూసి-రాఘవరావు పడక గదిలోకి వెళ్ళాక సుందరమ్మను బైట నిలబడమని తను లోపల తలుపులు వేసుకున్నాడు. కూడా తెచ్చిన మైక్రోఫోను ఎవరూ అనుమానించనిచోట జాగ్రత్తగా ఉంచి గది తలుపులు తీసి-"మీ ఇంట్లోంచి నేనేమీ తీసుకుని పోవటం లేదు" అంటూ తన జేబులు బైటకు తీసి చూపించాడు.
    "అయ్యో! పేరుమోసిన డిటెక్టివ్ లు. మిమ్మల్ని నేనెందుకు అనుమానిస్తాను?" అంది సుందరమ్మ నొచ్చుకుంటూ.
    "అయితే నేనడిగే ఒక ప్రశ్నకు నొచ్చుకోకుండా జవాబివ్వాలి మీరు. నన్ను మీ సోదరుడిగా భావించి."
    "అడగండి...." అంది సుందరమ్మ.
    "మీ భర్త, మరిది-ఒకే యింట్లో ఉండేవారు. మీ మరిదికి పాడు బుద్ధులున్నాయి. అతడు మిమ్మల్ని కూడా వక్ర దృష్టితో చూసేవాడు. అటువంటప్పుడు అతడు మిమ్మల్ని మోసంచేసి వశపర్చుకునే అవకాశముంది. అందులోనూ అతడు తెలివిగా పథకాలు వేసేవాడంటున్నారు. అతడు తన అన్నగా నటించి....."
    "ఆగండి!" అంది సుందరమ్మ.
    "ఆగుతాను. కానీ నా ఉద్దేశ్యంలో తప్పేమీలేదు. అన్నదమ్ములిద్దరిదీ ఒక్కటే పోలిక. ఆ అవకాశాన్నతడు ఉపయోగించుకున్నాడా, లేదా...."
    "తమ్ముడి గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. అందుకని ఆయన నాకు కొండ గుర్తులు చెప్పారు. అవేమిటో నేను చెప్పను. అయితే నా మరిది అలాంటి కొన్ని ప్రయత్నాలు చేశాడనీ, వారు చెప్పిన కొండ గుర్తుల సాయంతో నా పవిత్రతను కాపాడుకోగలిగాననీ మాత్రం చెప్పగలను...." అంది సుందరమ్మ.
    "నన్ను మన్నించండి, నేర పరిశోధనలో ఒకోసారి కొందరి మనసు కష్టపెట్టవలసి వస్తుంది. అయితే ఒక నిర్దోషి ప్రాణాలు కాపాడబడుతున్నాయంటే-మీరు మనసు కష్టపెట్టుకుంటారనుకోను-" అని అక్కణ్ణించి కదిలాడు వెంకన్న.

                                    8

    "నమస్కారం వీరేశంగారూ- నా పేరు వెంకన్న!"    
    "ప్లీజ్-కూర్చోండి!" అన్నాడు వీరేశం.
    "కూర్చుంటాను. మీమీద ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాను. మీరు మనుషుల మనస్తత్వాల్ని అర్ధంచేసుకుని వారికి సాయపడటమే తప్ప- వారిలోని తప్పుల్ని దాచి వారిని నేరాలకు ప్రోత్సహించరన్న నమ్మకమే నన్ను మీ దగ్గరకు రప్పించింది. నేను డిటెక్టివ్ ను. ఓ హత్య కేసు విషయమై పరిశోధిస్తూ ఇక్కడకు వచ్చాను. ఆ కేసు స్వరూపం తేలిపోయే సమాచారం మీ వద్ద వున్నది-" అన్నాడు వెంకన్న కుర్చీలో కూర్చుంటూ.
    వీరేశం నిబ్బరంగా వెంకన్న వంక చూసి-"నా నుంచి మీరేమాశిస్తున్నారో తెలియదు. కానీ అడగండి. నాకు తెలిసింది మీకు చెబుతాను. హత్యకేసు అంటూంటే ఆశ్చర్యంగా ఉంది-" అన్నాడు.
    వెంకన్న క్లుప్తంగా రాఘవరావు హత్య గురించి చెప్పి-"శశికాంత్ అనే అమాయకుడీ కేసులో ఇరుక్కున్నాడు. అతడిని మీరే రక్షించాలి-" అన్నాడు.
    "ఎలా?" అన్నాడు వీరేశం.
    "రాఘవరావు తమ్ముడి గురించి చెప్పండి. అతడు పిచ్చాసుపత్రి నుంచి పారిపోయిన వైనం మీకు తెలిసే వుండాలి...."
    వీరేశం సాలోచనగా-"డాక్టరుగా కొన్ని వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచవలసిన బాధ్యత నా మీద ఉంది. ఈ కేసులో మీకు నేను సాయపడలేనేమో!" అన్నాడు.
    "మీరు సాయపడేది నాకు కాదు-ఓ నిర్దోషికి! మీరు సాయపడకపోతే నిష్కారణంగా అతడు ఉరికంబమెక్కుతాడు...."
    "నా కస్టమర్సు రహస్యాలు నేను దాచి ఉంచని పక్షంలో నా వృత్తి కూడా దెబ్బ తింటుంది-" అన్నాడు వీరేశం.
    "మీ వృత్తి కే విధమైన దెబ్బ తగలదు. అసలీ కేసులో మీ పేరు బయటకు రాకుండా చూసుకుంటాను...." అన్నాడు వెంకన్న.
    వీరేశం రాఘవరావు కధ నెమ్మదిగా చెప్పాడు.
    రాఘవరావు, మాధవరావు అన్నదమ్ములు. పెద్దవాడు రాఘవరావు. ఇద్దరికీ చిన్నతనంలోనే తల్లిపోయింది. పెద్ద వాడైన రాఘవరావు వివాహం జరిపించి తండ్రి చనిపోయాడు.
    మొదట్నుంచీ రాఘవరావుది వక్రబుద్ధి. ఎదుటివాళ్ళను ఏడిపించటంలో అతడు అందెవేసిన చేయి, అదే అతడి జీవిత లక్ష్యం కూడా. వ్యపార వ్యవహారాలన్నీ రాఘవరావు పేరుమీద మాధవరావే చూసేవాడు. మాధవరావు నెమ్మదస్థుడు. మర్యాదస్థుడు.  వీరేశానికి స్నేహితుడు. అతడు తన ఇబ్బందులన్నీ వీరేశంతో చెప్పుకునేవాడు.
    మాధవరావుకు వివాహమైతే కుటుంబంనుంచి విడిపోయి వేరు కాపురం పెడతాడని రాఘవరావు భయం. అందుకని అతడు తెలివిగా ఉపాయం పన్ని మాధవరావుకు వచ్చే సంబంధాలన్నీ చెడగొడుతూండేవాడు. రాఘవరావు చేసేచెడ్డపనులన్నీ మాధవరావే చేస్తున్నట్లు బయటివారికి భ్రమ కలిగించేవాడు. ఆ విధంగా రాఘవరావు కులాసాగా తిరిగేవాడు. అమర్యాదగా ప్రవర్తించేవాడు. చెడ్డ పేరు మాధవరావుకి వచ్చేది. మాధవరావు ఇది కూడా సహించాడు.
    రాఘవరావు భార్య సుందరమ్మ వయసులో చాలా అందంగా ఉండేది. రాఘవరావు ఆమె వద్ద చాలా ట్రిక్కులు వేసేవాడు. ఉదయం ఎనిమిదింటికి ఆమెతో కాసేపు సరసాలాడేవాడు. తర్వాత తొమ్మిదింటికి మళ్ళీ వెళ్ళి-"ఈ రోజు తొలిసారిగా నీ భుజం తాకుతూంటే నాకేదోలాగుంది-" అనేవాడు. ఆమె కంగారుపడి-"తొలిసారిగా అంటారేమిటి? ఓ గంట క్రితం వచ్చి వెళ్ళారుగా-" అనగానే-"అయితే ఆ మాధవరావుగాడు వచ్చి ఉంటాడు-" అనేవాడు.
    ఈ విధంగా రాఘవరావు కొంతకాలం భార్యకూ, తమ్ముడికీ మనఃస్థిమితం లేకుండా చేశాడు. అయితే అతడి నాటకాన్ని భార్య పసిగట్టేసింది. రాఘవరవుని పసిగట్టడానికి ఆమె కొన్ని కొండ గుర్తు లేర్పరుచుకుంది. అతడు మాధవరావులా నటించినా ఆమె క్షణాల మీద అతడి నాటకాన్ని బయటపెట్టేది. భార్యను మానసికంగా హింసించడం సాధ్యంకాదని తెలిసేక అతడామెను శారీరకంగా హింసించడం ఆరంభించాడు. ఆ బాధలనామె భరించలేక ఆఖరికి సిగ్గు విడిచి మరిదికి చెప్పుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS