"చాలా థాంక్స్ మిష్టర్ ఇన స్పెక్టర్!" అన్నాడు వెంకన్న.
అయితే వారి ప్రయత్నం ఫలించలేదు. హంతకుడి నుంచి ఫోనుకాల్ రానేవచ్చింది మేనేజరుకు.
"హలో! రూం నెంబరు పదకొండులో నాకింక పనిలేదు. మీరది ఇంకెవరికైనా ఇచ్చుకోవచ్చు-"
చాలా క్లుప్తంగా చేయబడ్డ ఆ కాల్ ఆ మనిషిని పట్టుకునేందుకు సహకరించలేదు, అతడిని మరి కాసేపు మాట్లాడేలా చేయాలనుకున్న మేనేజరు ప్రయత్నమూ ఫలించలేదు.
5
"కేసంతా మొదటికి వచ్చింది-" అన్నాడు వెంకన్న.
"బాస్ - మీరేమీ అనుకోనంటే నాదో చిన్న పాయింటు-" అంది సీతమ్మ భయం భయంగా.
"అనుకోవడమెందుకు? ధైర్యంగా చెప్పు....."
"గాడాంధకారంలో ఏమీ కనిపించనప్పుడు ఓ అగ్గిపుల్ల వేస్తాం. అది కాసేపు వెలిగి ఆరిపోతుంది. అది ఆరేలోగా మనక్కావలసింది దొరికిందా-సరేసరి! లేని పక్షంలో ఆ అగ్గిపుల్ల ఇంక పనిచేయదు. రెండో అగ్గిపుల్ల వెలిగించక తప్పదు...." అంది సీతమ్మ.
"సరే-వెలిగించు...." అన్నాడు వెంకన్న.
"మనం హంతకుడి నాటకం తెలుసుకున్నాం. కానీ అతడి ఉద్దేశ్య మేమిటో తెలుసుకోలేదు-" అంది సీతమ్మ.
వెంకన్నకు అర్ధమయింది. హత్యకు మోటివ్ ఏమిటో తెలుసుకుంటే హంతకుడి ఆకారంలోని అస్పష్టత మాసిపోవచ్చు.
శశికాంత్ కు మోటివ్ ఉంది. కానీ అతడు నిర్దోషి. అని తను నమ్ముతున్నాడు. రాఘవరావును హత్యచేయడానికి అవసరమైన మరో కారణమేమిటో తను తెలుసుకోవాలి.
వెంకన్న ఆ రోజంతా రాఘవరావు గురించి విచారించాడు.
రాఘవరావు చిన్న చిన్న వ్యాపారాలు చేసి డబ్బు బాగా కూడబెడుతున్నాడు. కానీ అతడికి ఎవరితోటీ గొడవలు లెఉ. తెలిసిన వాళ్ళందరూ అతఃడు చాలా మంచివాడనే చెబుతున్నారు. శశికాంత్ కూడా రాఘవరావు గురించి అదే మాటలు చెప్పాడు. ఆయన్ను హత్య చేయడానికి ఎవరికీ చేతులు రావని అన్నాడతను.
అప్పుడే వెంకన్న శశికాంత్ ని మరో పాయింటు అడిగాడు. మూడు గంటలకు చచ్చిపోయిన రాఘవరవుని ఆరుగంటలకు చూడటం సాధ్యపడదు కాబట్టి శశికాంత్ చూసింది రాఘవరావు వేషంలోని హంతకుడయుంటాడు.
"కాదు మామయ్యా నాకు బాగా తెలుసు. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు. ఆ కళ్ళు, ఆ మీసాలు, ఆ నడక-అన్నీ నాకు బాగా పరిచితం. నేను పొరబడను......హత్యా సమయం నిర్ణయించటంలో పోలీసు డాక్టరు ఏదో పొరపాటు చేసివుంటాడని నా అనుమానం...."
"అయితే నువ్వు గదిలోకి వెళ్ళగానే తలుపు లెవ్వరు వేసివుంటారంటావ్?"
శశికాంత్ తలపట్టుకుని-"నాకంతా అయోమయంగా ఉంది!" అన్నాడు.
"హంతకుడు నీ మేనమామకు బాగా పరిచయస్థుడు. ఆయన వేషం, నడవడికలు చక్కగా అనుకరించగల శక్తిగలవాడు-....బాగా ఆలోచించిచూడు. ఆ రోజు సాయంత్రం నువ్వు చూసిన వ్యక్తిని మరీ మరీ గుర్తుతెచ్చుకో. మీ బంధువర్గంలో కానీ, పరిచయస్థుల్లో గానీ అతడెవరైయుండే అవకాశముందో చెప్పు. నువ్వు హంతకుడివి కావని నాకు తెలిసింది. కానీ హంతకుడెవరో తేలేదాకా నిన్ను రక్షించటం నా వల్ల కాదు. నువ్వు చెప్పే సమాధానం నాకెంతో సహకరిస్తుంది...." అన్నాడు వెంకన్న.
శశికాంత్ చాలాసేపు ఆలోచించి-"ఆయన నా మేనమామ రాఘవరావు తప్ప వేరెవ్వరూ కావడానికి వీల్లేదు. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను సార్! ఏం చేయను?" అన్నాడు దిగులుగా.
వెంకన్న అతడి భుజం తట్టి-"నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలుగానే కనబడుతునంయి. కానీ అవే నిజాలని నాకు అనిపిస్తోంది. ఓ నిజం ఋజువయింది. రెండో నిజం ఋజువు చేయటం చాలా కష్టం-నా ప్రయత్నం నేను చేస్తాను. ఆపైన భగవంతుడున్నాడు-" అన్నాడు.
తర్వాత వెంకన్న రాఘవరావు కుటుంబం గురించి పూర్తి ఆరాలు తీశాడు, రాఘవరావు ఆ ఊరొచ్చి అయిదు సంవత్సరాలయింది. అంతకు పూర్వం ఆ కుటుంబం విశాఖపట్నంలో ఉండేదని తెలిసింది.
ఆ రోజే వెంకన్న విశాఖపట్నం బయల్దేరి వెళ్ళాడు.
6
రాఘవరావు హత్య కావించబడిన వారంరోజులకు అతడి కుటుంబం తిరిగివచ్చింది. వాళ్ళెక్కడికి వెళ్ళారో ఏ ఊళ్ళో వున్నారో తెలియక ఇన్ స్పెక్టర్ అన్ని రోజులూ శవాన్ని అయిసులో భద్రపరచి వుంచాడు.
వార్త విని రాఘవరావు భార్య సుందరమ్మ స్పృహ తప్పి పడిపోయింది. కూతురు అలివేలు ఘొల్లుమంది. కొడుకు చంద్ర బిక్క మొహం వేసుక్కూర్చున్నాడు.
శవం వాళ్ళకు అప్పజెప్పబడింది. దానికి దహన సంస్కారాలు జరిగాయి. అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాక ఇన్స్ పెక్టర్ తన ప్రశ్నలు మొదలు పెట్టాడు. రాఘవరావు కుటుంబం ప్రశ్నలకు ఏడుస్తూనే జవాబులిచ్చారు.
పెళ్ళికని వెళ్లారు. అక్కణ్ణించి కొందరు తిరుపతి వెడుతూంటే తామూ వెళ్ళి వచ్చారు.
ఇంటిల్లపాదీ శశికాంత్ ని తిట్టిపోశారు. డబ్బుకోసం అతడింత ఘోరానికి తలపడతాడని తామనుకోలేదన్నారు. వారిద్వారా ఇన్స్ పెక్టర్ కు రాఘవరావు వీలునామా చేతికందింది. అందులో లక్షరూపాయలు శశికాంత్ పేరున వ్రాయబడ్డాయి.
రాఘవరావు కుటుంబం పరిస్థితి బాగానే ఉంది. సుమారు పదిలక్షల ఆస్థి వారిది. రాఘవరావు కూతురు అలివేలు శశికాంత్ వర్ణించినంత అందవికారంగానూ లేదు. ఆస్థికోసం కాకపోయినా మామూలుగా కూడా ఆమెను వివాహం చేసుకొనవచ్చు.
"శశికాంత్ కాక వేరే ఎవరిమీదనైనా మీకు అనుమానముందా?" అనడిగాడు ఇన్స్ పెక్టర్.
"అసలు శశికాంత్ మీదనే మాకు అనుమానంలేదు. అయన దేవుడు. చూస్తూ చూస్తూ ఆయన్ను చంపదానికా దుర్మార్గుడికి చేతులెలా గొచ్చాయో!" అంది సుందరమ్మ.
"అలాకాదు. బాగా ఆలోచించి చెప్పండి. శశికాంత్ నిర్దోషి అనడానికి కూడా కొన్ని సాక్ష్యాధారాలు లభించాయి. హంతకుడు వేరే ఎవరైనా అయితే ఈ హత్యకు మూలకారణం పగ అయుండాలి. హంతకుడికి ఒక్క రాఘవరావు గారిమీదనే పగ వున్నదో లేక మొత్తం కుటుంబంమీద పగ వున్నదో మనకు తెలియదు. అందువల్ల మీ అందరికీ కూడా ప్రమాదముండవచ్చు. బాగా ఆలోచించి చెప్పండి......మీ కుటుంబం పైనగానీ రాఘవరావు పైనగానీ - వ్యక్తిగతంగానో, వ్యాపారరీత్యానో పగ ఉన్న వ్యక్తులెవరైనా ఉన్నారా?"
సుందరమ్మ తల అడ్డంగా ఊపింది.
ఇన్స్ పెక్టర్ అక్కన్నించి బయటపడ్డాక దారిలో అతడికి వెంకన్న ఎదురయ్యాడు. జీపు, కారు ఒకదాని కొకటి ఎదురుగా ఆగాయి.
"మీరక్కన్నింఛే వస్తున్నారా? అయితే నేను మీతోనే వస్తాను. ఇంక వాళ్ళనడిగి తెలుసుకునేవేముంటాయి?" అన్నాడు వెంకన్న.
ఇద్దరూ పోలీసు స్టేషనుకు వెళ్లారు. ఇన్స్ పెక్టర్ వెంకన్నకు రాఘవరావు కుటుంబంతో తన సంభాషణ ఫలితం వివరించాడు.
వెంకన్న నిట్టూర్చి-"హంతకుడు చాలా అదృష్టవంతుడు. అతడి గురించి ఎవ్వరూ సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. మనకు చాలాసార్లు దొరికినట్లే దొరికి పారిపోతున్నారు. నాకు విశాఖపట్నంలో కొంత సమాచారం తెలిసింది. రాఘవరావుమీద పగ వున్న వ్యక్తి ఒకడు అయిదు సంవత్సరాలుగా పిచ్చాసుపత్రిలో ఉంటున్నాడు. కొద్ది నెలల క్రితం అతడు హాస్పిటల్నించి పారిపోయాడు. అతడే హంతకుడని నా అనుమానం. అతడు చాలా తెలివిగా రాఘవరావుని మట్టుబెట్టాడు. ఆ కుటుంబంలో మిగతావారిని కూడా వదలడేమోనని నా అనుమానం. బహుశా ఏ పనివాడి వేషంలోనే ఆ యింట ప్రవేశిస్తాడేమోనని నా అనుమానం. ముందుగా ఆ కుటుంబాన్ని హెచ్చరించాల్సిన అవసరముంది-" అన్నాడు.
