"ఏమంటాడు క్షమించమని కోరి వుంటాడు -- అంతే కదమ్మా రమణ దుర్గను ప్రశ్నించాడు.
"అంతే అన్నయ్యా -- అంది."
"నువ్వేమో ఐసయిపోయి -- వూ-- అనుంటావని మాకందరి కి తెలుసు" సరళ యెగతాళి చేసింది.
మామగారు కుర్చీ మీద కూర్చున్నాడు -- చూడమ్మా -- వాడి మనసు పూర్తిగా మారినది -- లేనిదీ మనకు తెలియదు నువ్వు మాత్రం జాగ్రత్తగా వుండు తల్లీ...నిరంజన్ ఏమంటావు ?' ఆడవాళ్ళంతా వెనక్కు తప్పుకున్నా నిరంజన్ ముందు కొచ్చాడు . రమణ స్టూల్ లాక్కుని కూర్చున్నాడు.
"చూడమ్మా -- నువ్వు మాత్రం నీ దగ్గర ఇంకా డబ్బున్నాడని అభిప్రాయం ఇవ్వకు. అంతా రక్షణ నిధికి ఇచ్చేశావన్నట్లే వూరుకో. మీ మామయ్యగారు కూడా డబ్బు మాట ఎత్తరు . నువ్వు గొప్పింటి బిడ్డ వన్న మాట కొన్ని సంవత్సరాలు మర్చిపో. అత్యవసరమైతే మీ మామగార్కి రాయి. లేదా రమణ అన్నయ్య కు రాయి. మేము నీ డబ్బు తీసి పంపిస్తాము. ఒక లెక్చరర్ భార్యగా -- కొన్ని సరదాలను, సుఖాలను విసర్జించి సాధారణమైన జీవితం జీవించు. సుధాకర్ లో నిజమైన పరివర్తన కల్గినదని రూడీయైన పిమ్మట , నీ డబ్బు భద్రంగా వుందని చెప్పు. అప్పుడు లక్షాధికారిణి జీవితం గడుపు . ఐతే ...బాబూ దుర్గ డబ్బంతా రక్షణ నిధి కివ్వలేదూ?' అత్తగారు ఆశ్చర్యంతో అడిగింది.
"లేదమ్మా ఐదు వేలు మాత్రం ఇచ్చింది . మిగిలినదంతా బ్యాంక్ లో వుంది. పుస్తకం సరళ దగ్గరుంది.'
* * * *
"ఎమ్మా , దుర్గా-- బాధ ఎక్కువగా వుందా?' మగవాళ్ళు దూరంగా వెళ్ళారు. అత్తగారు ప్రక్కలో కూర్చుని చేతి మీద చేయి వేసి అడిగింది.
"ఒళ్ళంతా నొప్పులు...." అంది దుర్గ. ప్రేమ ముందు కెళ్ళింది. రేవతి అక్కయ్య కు వైర్ ఇచ్చాము. ఇవ్వాళో రేపో వస్తుంది..."
"మీరంతా ఎక్కడ దిగారు?"
హాస్టల్ కెళ్ళి సామాను దింపి వచ్చాము --"
"మరి కాఫీలు ?"
"మా బాధ నీకెందు కమ్మా-- ఆరోగ్యంగా వున్నాము. వెళ్లి ఏ హోటల్ లోనో కానిస్తాం లే" అన్నారు మామగారు. నర్స్ వచ్చి తన పనులు చేసుకు పోయింది. ముఖాలు కడుక్కుని టిఫిన్ తిని మళ్ళీ వస్తామని చెప్పి పోయారు. దుర్గ సుషుస్తావస్థ లోకి జారిపోయింది.
* * * *
దుర్గ "అమ్మా" అంటూ మూల్గింది.
చటుక్కున నిరంజన్ లేచి నుంచున్నాడు. సుధాకర్ దగ్గరకు వెళ్లి నుంచున్నాడు.
కళ్ళు తెరిచి భర్తను చూచింది. ఆ చూపుల్లోని భావాల్ని అనేక రీతుల గ్రహించ గల్గాడు. నన్ను అన్యాయం చేయకండి. వీరందరికీ మీ ఉన్నత హృదయాన్ని తేటతెల్లం చేయండి. నన్నవమాన పర్చకండి . ఆరిపోయిన జ్యోతిలో నూనె పోసి వెలిగించారు...మళ్ళీ నన్నంద కారంలో పడవేయ్యకండి. మీమీద ఆశలు నిల్పుకున్నాను. నన్ను నిరాశ పర్చ వద్దు. వీరందరికీ మీ సహృదయతను కనపర్చకండి........."సుధాకర్ ఆమె కళ్ళలోకి బాధగా చూచాడు. అందులో అట్లాగే అను ప్రతిజ్ఞ విశ్వాసం తొణికిస లాడాయి.
"దుర్గా -- నీ వింక ఏ సందేహం పెట్టుకోవద్దు. వీరందరికీ కూడా శ్రమ ఎందుకు , నేనున్నాను కదా -- అమ్మా మీరంతా వెళ్ళిపొండి నేను సెలవు పెట్టాను. దుర్గ దగ్గర వుంటాను-- కొద్దిగా స్వాస్థం చేకూరిన వెంటనే కాలేజీ కి వెళ్తాను....దుర్గాకి సీరియస్ గా లేదు కదా! నిశ్చింతగా వెళ్ళిపొండి .....నేనే స్వయంగా ఆమెకు సేవ చేసి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొంటాను.
"నిన్ను నమ్ముకుని వెళ్లి పొమ్మంటావా నాయనా?' సంశయంతో అంది తల్లి.
సుధాకర్ పెదిమల పై నిర్జీవమైన నవ్వు తొంగి చూచింది. జాలితో నిండిన దృక్కులను తల్లి వైపు ప్రసరింప జేసి మెల్లగా అన్నాడు. అవును నా మీద విశ్వాస ముంచండి . మిమ్మల్ని నిరాశ పర్చనని మాట ఇస్తున్నానుగా"
వారికి ఆరోజున అట్లా దుర్గ ను సుధాకర్ చేతిలో వదలి వెళ్ళిపోవటం సుతరామూ ఇష్టం లేదు. సుధాకర్ పై వారికి విశ్వాసం లేదు. కాని నిరంజన్ సమ్మతించలేదు. సుధాకర్ ను పరీక్ష కు వదిలారు. అవసరమైతే తెనాలి కి కబురంద జేయవలసినదిగా వార్డెన్ ను కోరాడు. అందుకని సరళ ను ప్రేమను కొన్నాళ్ళ వరకు తెనాలి లో ఆగమని పరోక్షంగా చెప్పాడు. ఏర్పాట్లన్నీ జరిగిన తరువాత వారు వెళ్ళిపోయారు.
వారం రోజులకు దుర్గకు కొద్దిగా స్వాస్థ్యం లభించింది. చేయి యింకా స్లింగ్ లో వుంది కాని గాయాలన్నీ మానుకున్నాయి. ఆరోజు ఆమెను డిశ్చార్జి చేసేరోజు.
దుర్గ హృదయం గుబులుతో నిండి వుంది. తన పతి సాన్నిధ్యం లో ఈ ఇరవై రోజులు గడిపి తిరిగి హాస్టల్ కు వెళ్ళబోతే ఆమె హృదయం తీరని వేదనతో అలమటించింది. తన భర్త తిరిగి తనకు దూర మౌతాడేమో నని క్రుంగి పోయింది.
బిల్లు కట్టటానికి దుర్గ డబ్బు ఇస్తుంటే అతడు నిరాకరించ లేదు.
మౌనంగా తీసుకుని జేబులో పెట్టుకున్నాడు.
దుర్గ హృదయం లో గాయమైనట్లింది టాక్సీ వచ్చి ఆగింది.
సుధాకర్ దుర్గను మెల్లగా నడిపించు కుంటూ టాక్సీ సమీపించాడు. దుర్గను ఎక్కించి తాను కూడా ఎక్కాడు. ఆమెను దగ్గరగా జరిగి పట్టుకుని కూర్చున్నాడు.
టాక్సీ గేటు దాటి ఎడమ వైపుకు తిరగవలసినది కుడి వైపు కు తిరుగుతుంటే దుర్గ ఎందుకో అనుకుంది.
వార్డెన్ ఖచ్చితంగా అంది రేపు హాస్టల్ కు వచ్చేయమని. ఆమె అభిప్రాయం ఏమిటి.
ఆమె ఆలోచనల కంతరాయం కలిగిస్తూ టాక్సీ విసురుగా మలుపు తిరిగింది -- ఆమె భర్తను అనుకుంది.
"ఇంత చుట్టూ తిరిగి తీసుకెళ్తున్నాడెం ? మీరు చెప్పలేదూ"
"మన ఇంటి కేళ్తున్నాం దుర్గా" ప్రేమ ఉట్టిపడేలా అన్నాడు. ఆమె భర్త కళ్ళలోకి చూచి తన్మయురాలైంది . తృప్తిగా కళ్ళు మూసుకుంది ఆ పల్కులు ఆమె హృదయం లో అమృతాన్ని చిలికించారు. కళ్ళు మూసుకునే భర్త భుజం మీద తల మోపి -- సమస్తమైన బాధల్ని భారాల్ని వదిలించుకుని తెలిక్ పడిన హృదయంతో వుండి పోయింది. టాక్సీ చిన్న ఇంటి ముందు ఆగింది. ఆమెను మెల్లగ దింపి లోపలికి తీసుకెళ్ళాడు. "దుర్గా-- మనది చిన్న యిల్లు -- ఇంతకన్నా పెద్ద యిల్లు భరించలేను..నీకూ-- నాకూ ...చాలు కదూ?" దుర్గ కలియ జూచింది . తన సామానంతా అక్కడే వుంది.
"నిన్న వెళ్లి మీ వార్డెన్ తో చెప్పి తెచ్చాను ....అలసిపొయావు ప్రక్క గదిలో పడక సిద్దంగా వుంది...విశ్రాంతి గా పడుకో కాఫీ కలుపుకుని వస్తాను."
సంభ్రమాస్చార్యాలతో మునిగిన దుర్గ మౌనంగా వెళ్లి పడుకుంది. ఇప్పుడే కాదు -- ఇప్పుడే కాదు -- ఈ ఆనందం పరిపూర్ణం చెందడానికి ఎన్ని సంవత్సరాలు కావాలో ? హే ప్రభూ -- ఏనాటి కైనా నా కోర్కెను సిద్ధింప చేయి -- అని మనసారా ప్రార్ధించింది దుర్గ.
41
దుర్గ ఆమె భర్త దగ్గరుండి కాలేజీ కి వెళ్తోందన్న కబురు వినీ గీత అమితంగా ఆనందించింది. ఒక్కసారి వచ్చి అందర్నీ చూచి వెళ్ళాలని ఆశ పడింది. కాని అది అసాధ్యమైన పని. వేసవి సెలవలకు మాత్రమే వారిద్దరూ వచ్చి కొన్నాళ్ళ పాటు వుండి వెళ్ళ గలరు.
గీత నించి వచ్చిన ఉత్తరాన్ని చదువుకుని ప్రేమ , నిరంజన్ లు ఎంతగానో ప్రమిదించారు.
అప్పుడే ఫోస్ట్ లో నెల్సన్ నుంచి ఉత్తరం వచ్చింది. శంభూ కు చేయి దాదాపు స్వాధీనం లోకి వచ్చిందని రాశాడు. కాలు స్వాధీనం లోకి రావటానికి ఇంకా రెండు మూడు సంవత్సరాలు పడ్తాయెమో!" "నరేన్ - శంభూ నించి ఉత్తర మొచ్చింది అని కేకేశాడు.'
ఆ ఉత్తరాన్ని తీసుకుని నిరంజన్ వెళ్తుంటే అతన్ని ప్రేమ అనుసరించింది. వారిద్దర్నీ చూచి నరేంద్ర -- లలితలు వెళ్ళారు. శంభూ ను గూర్చిన వివరాలు తెలుసుకుని మాట్లాడు కోవాలన్నప్పుడు అంతా కలిసి మాట్లాడటం వారి రివాజై పోయింది.
ఇల్లు నిశ్శబ్దంగావుంది.
తలుపు త్రోశారు. తెరుచుకుంది.
నిరంజన్ "అమ్మా" అన్నాడు. జవాబు లేదు.
వారికీ తెలుసు నిశ్శబ్దాన్ని భంగ పర్చ కూడదని.
ఒకరి వెనుక వొకరు అడుగులో అడుగేసుకుంటూ లోపలి కెళ్ళారు.
వెనక వైపు నాపరాళ్ళు పరచిన అరుగు మీద సూర్యాభిముఖంగా నిశ్చలంగా కూచుని వున్నారు.
వారు బాహ్య ప్రపంచ స్మృతి కటీతులై -- నిస్వార్ధ నిష్కశంక హృదయాల్ని భగవత్పన్నిధానం లో సమర్పిస్తూ అవసతనేత్రులై పుష్పాంజలి ఘటిస్తూ స్థిరంగా కూచుని వున్నారు.
ఐరావతమ్మ పెదిమలు స్పల్పంగా కదులుతున్నాయి.
వారి శిరస్సు లపై సూర్యకాంతి వింతగా ప్రకాశిస్తోంది.
ఆ ప్రశాంత మూర్తులను రెప్ప వాల్చ కుండా తదేకంగా చూస్తున్నారు.
అమృత హృదయులైన వీరి ఆశీర్వాదబలమే తమనింతటి వారిగా జేసింది. మహోత్కృష్ట కార్యాలను సాధించి ఉన్నత శిఖరాల నదిరోహించి హృదయ నైర్మన్యాన్ని సాధించటానికి అవసరమైన శక్తిని ప్రసాదించిన అమ్మా- నాన్న లను చూచి వందన మొనరించుతూ వారి ఏకాగ్రత కు భంగం కలుగ కుండా నిశ్శబ్దంగా నుంచున్నారు.
వృద్దాప్య చాయలు స్పష్టంగా కనబడుతున్నాయి.
వారిద్దరి ముందే అనుకున్నట్లు ఒక్కసారి కండ్లు తెరిచి చూశాడు.
శ్రీనివాసరావు ముఖంలో గంబీరం తొణికిసలాడింది.
ఐరావతమ్మ కళ్ళలో మాతృప్రేమ ప్రతి ఫలిస్తుంటే నెమ్మదిగా ;లేచి వచ్చి చిరు దరహాసంతో అంది "ఒక్కక్కోరు ఒక్కొక్క పుష్పాన్ని తీసుకోండి.

కోడళ్ళు భక్తీ వినయాలతో గ్రహించి కళ్ళ కద్దుకుని తలలో పెట్టుకున్నారు.
కొడుకులు ఆ పుష్ప సౌరభాన్ని అఘ్రాణిస్తూ -- ఎప్పుడో -- ఎక్కడో చదివిన మాటలను జ్ఞాపకానికి తెచ్చుకున్నారు.
"ఈవేళ వికలిత పుష్పం -- రేపు రాలిన రేకులు.
"దాని సౌరభం కలకాలం వుండాలని ఎలా ఆశించగలం?"
ఆ పూలను చెవుల వెనక పెట్టుకున్నారు.
తండ్రి సమీపించగనే నిరంజన్ ఉత్తరాన్ని అందించాడు.
"శంభూ కు ఆరోగ్యం బావుందట, చేయి ఇంకొద్దిగా స్వాధీనం లోకి వచ్చిందిట."
శ్రీనివాసరావు ఆత్రంగా తెరిచి చదువు కున్నాడు.
"శంభూ -- తనకై తాను గుడ్డలు వేసుకున్నట్లు -- బంతితో ఆడుకున్నట్లు మీ అమ్మకు కల వచ్చిందట........"
"ఔనా అమ్మా? ' కొడుకులు అది తప్పక జరుగుతుందన్నంత సంభ్రమంతో అడిగారు.
"ఔను -- ఈ కల నెరవేరటాని కెన్ని సంవత్సరాలైనా పట్టు గాక: ఆ నిరీక్షణ తోనే -- శంభూ క్షేమంగా మన మధ్యకు వస్తాడన్న ఆశతోనే జీవిత చరమాంకం వరకు ధైర్యంగా వుంటాము. "ఆమె కళ్ళలో అశ్రువులు వింతగా ప్రకాశించినాయ్. ఎచటి నిండో పావురాల గుంపు రెక్కలు రెపరెప లాడించు కుంటూ ఆ స్వచ్చమైన నీలాకాశం లో -- సూర్యరశ్మి లో సచ్చలధవళ కాంతుల్నీనుతూ సీమాంతాల వరకూ ఎగిరి పోయాయి.
(సమాప్తం)
