ఉషశ్రీ భాగవతం
పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండట నే
పలికిన భవహర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా II
* * * * *
జగద్రక్షకుడు, జగన్నాధుడు, జగదారాధ్యుడు, శిష్టరక్షణ దీక్షితుడు, దుష్టశిక్షణ కేళీ పరాయణుడు అయిన శ్రీమన్నారాయణుని దివ్య చరిత్రలు వినాలనే కుతూహలంతో వున్న శౌనకాది మహామునులను సర్వ పురాణ కథా విషయ కోవిదుడైన సూత మహర్షి చిరునవ్వుతో తిలకిస్తూ -
మునీంద్రులారా! ముందుగా నరనారాయణులకు నమస్కరించి, వాగ్దేవతకు అంజలించి, శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాస, ఆగమాలను ఆపోశనం పట్టిన వ్యాస మునీంద్రులను మనసా ఆరాధించి, ఆయన అనుగ్రహ విశేషంతో అందుకున్న శ్రీమధ్బాగవతం వినిపిస్తున్నాను. సావధాన చిత్తులై ఆకర్ణించండి.
* * * * *
కలియుగ మానవులు ఆహార, విహారాలను యధేచ్చగా సాగించడం వల్ల దుర్బల శరీరులవుతారు. అది కారణంగా వారికి ఆయుర్దాయమూ, బుద్దిశక్తి, ధైర్యమూ క్షీణిస్తాయి. ఆ దశలో తపోదీక్షకు తగిన దారుఢ్యం వుండదు. యజ్ఞ, యాగాదులు నిర్వహించడానికి వారి మనస్సు సుముఖంగా వుండదు. విలాస జీవితం గడుపుతూ పరమార్దాన్ని సాధించే మార్గం కోసం అన్వేషించే రోజులు కొద్దిగా వుంటాయి. ఆ రోజులలో వారిని తరింపజేయాలంటే హరి నామస్మరణం, నారాయణ కథా శ్రవణం - రెండే మార్గాలు అని గ్రహించిన పరాశరనందనులు వ్యాస మహర్షి మహావిష్ణువు లీలలను కథలుగా చెపుతూ భాగవతంగా - అదే భక్తజన కల్పతరువుగా - శుక యోగీంద్రులవారికి బోధించారు.
శకయోగీంద్రులు వారం రోజులలో దీనిని పరీక్షిత్తుకు వినిపించారు. అందులో నాకు అందిన దానిని, అర్దమైన దానిని భక్తితో వినిపిస్తాను. ఈ గాధను దీక్షగా విని పరీక్షిన్మహారాజు పరమ పవిత్రమైన వైకుంఠంలో నారాయణ సన్నిధానంలో శాశ్వత స్థానం పొందాడు. అదే భాగవత శక్తి.
పరీక్షిత్తు
లలిత స్కంధము, కృష్ణ మూలము శుకాలాపాభిరామంబు మం
జులతో శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరో
జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాల వాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్శ్రేయమై.
పాండురాజు కుమారుడు అర్జునుడు. వీరి కుమారుడు అభిమన్యుడు. ఈయనకు ఉత్తర యందు ప్రభవించిన పరీక్షిత్తు సింహాసనారూఢుడై ప్రజలను కన్నబిడ్డల వల కాపాడుతూ, బంధుప్రీతితో ఆశ్రిత పక్షపాతానికి తన రాజ్యంలో అవకాశం రాకుండా ధర్మదీక్షతో పాలిస్తున్నాడు.
ఆ మహారాజు ఒకనాడు వేటకు వెళ్లి సింహాలనూ, పెద్దపులులనూ వేటాడి అలసి, దాహ బాధతో శమీకమునీంద్రుని ఆశ్రమం సమీపించి మంచి నీరు మ అడిగాడు. కనులు మూసి, పరతత్వం మీద మనసు ఏకాగ్రంచేసి వున్న మునికి ఆ రాజు రాకడగానీ, దాహబాధగానీ కనిపించలేదు, వినిపించలేదు. మాట్లాడకుండా వున్న ముని మీద ఆగ్రహించి పరీక్షిత్తు అక్కడ పడివున్న పాము కళేబరం ఆయన మెడలో వేసి వెళ్లిపోయాడు. ఎంత ధర్మనిరతుడైనా దాహబాధ వల్ల కలిగిన కోపం కారణంగా ఏం చేస్తున్నాడో తెలుసుకోలేకపోయాడు రాజు. కొంతసేపటికి ఆశ్రమం చేరిన ముని కుమారుడు తన తండ్రి మెడలోని పామును చూస్తూనే ఆవేశంతో -
"నా తండ్రిని అవమానించిన వాడు తక్షక సర్పం కాటు తిని నేటికి వారం రోజులలో ప్రాణాలు వదులుతాడు." అని శపించాడు.
ముని కనులు తెరిచి విషయం గ్రహించి -
"నాయనా! ఎంత పొరపాటు చేశావు? వాసుదేవుని అనుగ్రహం వల్ల పునర్జన్మ పొందిన, ధర్మమూర్తియైన రాజును శపించావు. రాజు లేకపోతే బలహీనులను బలవంతులు హింసించి వారి సంసారాలు నాశనం చేసి, సంపదలు దోచుకుంటారు. ప్రజలలో విభేదాలు పెరిగి సంహారకాండ రేగుతుంది. ధర్మమోక్షాల దృష్టి విడిచి అర్దదాసులూ, కామలాలసులూ అయిపోతారు. వేదం ప్రబోధించిన సత్యవాక్పాలన పరాయణులు సన్నగిల్లుతారు. ఇన్ని అనర్దాలు నీ శాపం వల్ల ఏర్పడుతాయి. ఇప్పటికయినా మించిపోలేదు. నా శిష్యుని వెంటబెట్టుకు వెళ్లి మహారాజుకు శాప విషయం చెప్పు. ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు." అని పంపించాడు.
* * * *
