Previous Page Next Page 
విశాలి పేజి 7

 

    ఆ రోజు రామం భార్యని తీసుకుని సెకండ్ షోకి వెళ్ళాడు. అదేదో మంచి సినిమాలు. ఆ రోజే ఆఖరి ఆట. అందుకే ఫస్టు షోకి వెళ్ళడానికి కుదరక పోయినా సెకండ్ షోకి పరుగెత్తారు. వాళ్ళు వెళ్ళాక వీధి తలుపు గడియవేసి, పెరటితలుపు గడియకూడా ఒకసారి చూసివచ్చి, చెంబుతో మంచినీళ్ళు పట్టుకెళ్ళి అన్నయ్య గదిలో పెట్టి తన గదివేపు నడిచింది విశాలి.   
    ఇంతలో వెనక అడుగుల చప్పుడై తిరిగి చూసింది.
    పళ్ళి కిలిస్తున్న సాంబయ్య స్వరూపం.
    అదిరిపడిం దొక్క క్షణం.
    ఎప్పుడో గంట క్రిందటే మంచమెక్కి నిద్ర పోయిన ఈ మనిషి....అయితే నిజంగా అది నిద్ర కాదన్నమాట. అదంతా నటనేనా? భయంతో అడుగు కదపలేకపోయింది విశాలి.
    కనిపించని దేవుడికి మనసులోనే మొక్కింది. ఎలా గైతేనేం, లేని ధైర్యం తెచ్చుకుని అంది:
    "ఏం కావాలి మీకు?"
    "ఏం కావాలో నీకు తెలియదా, విశాలీ!"
    నవ్వుతున్నాడు సాంబయ్య.
    అది నవ్వుతూ లేదు. క్రూరమృగం గర్జించినట్టుగా ఉంది.
    అతనో సాంబయ్య ముందుకి వేస్తున్న ఒక్కొక్క అడుగూ విశాలి హృదయంమీద వెయ్యి శూలాలై దిగుతూంది.
    భయంతో విశాలి వెనక్కి వేస్తున్న ఒక్కొక్క అడుగుతా, సాంబయ్య హృదయంలో వెయ్యి కోరికలు రేకెత్తిస్తూంది.    
    హఠాత్తుగా భూకంపం వచ్చి తాము ఉన్న ఆ ఇల్లు కూలిపోతే బాగుండుననిపించింది విశాలికి.
    హఠాత్తుగా విశాలి మనసు మారి, అట్టే బెట్టు చేయకుండా తన కౌగిట్లో ఇమిడిపోతే బాగుండుననిపించింది సాంబయ్యకి.
    ఒక్కొక్క అడుగే ముందుకి వేస్తున్న సాంబయ్యని చూసి వణికిపోతూంది విశాలి.
    "ఎందు కంత భయపడతావ్, విశాలీ? నే నేం పెద్దపులిని కాను. నేనూ మనిషినే! ఇదుగో చూడు, నువ్వు 'సరే' నంటే నా ఇనప్పెట్టి తాళాలు నీవి. నువ్వు కాదంటే నీ కీ జన్మలో పెళ్ళేకాదు. కట్నం గుమ్మరించి నీ పెళ్ళి మీ అన్నయ్య చేస్తాడనుకుంటున్నావా? అసలే మీ అన్నయ్య  నువ్వంటే ఎప్పుడూ చిర్రు బుర్రు లాడుతూ ఉంటాడు. ఇంక తన మాట కాదంటే వేరే చెప్పాలా? ఎందు కనవసరంగా లేనిపోని గొడవ తెచ్చి పెట్టుకుంటావ్! కట్నం లేకుండా, వీధిన పడి ఉద్యోగం చేసుకుంటున్న కన్యకారత్వాన్ని పెళ్ళాడేందుకు ఏ యువకుడు ముందుకొస్తాడీ రోజుల్లో? నీ నుంచి కోసమే చెపుతున్నా! నా మాట వినిపించుకో." సాంబయ్య చేతులు రెండూ విశాలి భుజాల్ని చుట్టాయి. నాగుపాములు రెండు తనని చుట్టు కొన్నట్టు అనిపించింది విశాలికి.
    ఆ చేతుల్నేకాక, మనిషినంతటినీ విదిలించి కొట్టింది గట్టిగా.
    విసురుగా వెళ్ళి మూలనున్న బల్లకి గట్టిగా కొట్టు కుని కింద పడిపోయాడు సాంబయ్య. "అబ్బా!" అన్న మాట ఆయన నోటినుంచి విని జాలిగా చూసింది విశాలి. లేవలేక ఆయన పడుతున్న, బాధ చూసి మరింత కరిగిపోయింది. "అబ్బా! అమ్మా!" అంటూ ఆయన కుడిచేత్తో గుండె రాసుకుంటున్నాడు. ఇదివరలో రెండు మూడు సార్లు ఆయనకి గుండెనొప్పి విపరీతంగా రావడం ఆయన యమయాతన అనుభవించడం చూసిన విశాలి, ఇప్పుడు మళ్ళీ అదె పరిస్థితి ఆయనకి కలిగి నట్టుగా గ్రహించింది.
    చెట్టంత మనిషి అలా మూలుగుతూ, నేలమీదికి ఒరిగిపోతుంటే చూస్తూ ఊరుకోలేక పోయింది. గబగబా వంటింట్లోకి పరుగెత్తి ముందు మంచినీళ్ళు పట్టుకొచ్చి, ఆయన మెడకింద చేయి వేసి తాగించ డానికి ప్రయత్నించింది. ఒక్క గుక్కడంటే గుక్కెడు తాగి ఇక వద్దన్నట్టు సైగ చేశా డాయన.
    మెల్లిగా సాయం పట్టి, లేవదీసుకెళ్ళి ఆయన గదిలో మంచంమీద పడుకోబెట్టింది. అలమారులోంచి గుండెనొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు ఆయన వేసుకునే మాత్ర తీసి మంచినీళ్ళతో ఆ మాత్ర మింగించింది ఆయనచేత.
    "విసరమంటారా?" అంది అక్కడే ఉన్న విసన కర్ర అంది పుచ్చుకుంటూ. ఆయన బాధ ఎక్కువై మూలుగుతున్నాడే తప్ప జవాబిచ్చే స్థితిలో లేదు.
    మెల్లమెల్లగా విసురుతూ అక్కడే నిలుచుంది విశాలి.
    ఆవేశపడటంగానీ, ఉద్రేకపడటంగానీ తగదనీ, అటువంటి సమయాలలో ఆయనకి తప్పకుండా గుండె నెప్పి తిరగబెడుతుందనీ డాక్టరు చెప్పనే చెప్పాడు.
    "అమ్మా!" బాధగా అరుస్తూ గుండెలమీద చేత్తో రాయమన్నట్టుగా సంజ్ఞ చేశాడాయన.
    మంచం పక్కనే కింద మోకాళ్ళమీద కూర్చుని ఆయన గుండెలమీద రాయడం మొదలుపెట్టింది విశాలి.
    ఆయన పడుతున్న బాధ చూస్తున్న విశాలి కన్నులు చెమర్చాయి.
    కొద్ది సేపటి క్రితం ఆ మనిషే, ప్రాణంకన్నా ముఖ్యమైన తన శీలాన్ని నాశనం చెయ్యబోయాడన్న కఠోర సత్యాన్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ, మనిషిగా ఆ సమయంలో చూపించవలసిన సానుభూతిని మనసునిండా నింపుకుంది.
    అన్నా, వదినలు తిరిగి వచ్చేవరకూ కూడా ఆయన గుండెలమీద రాస్తూ, విసనకర్ర్రతో విసురుతూ అలాగే కూర్చుంది విశాలి నిద్ర ఆపుకుంది.
    వచ్చీరాగానే, విశాలి ద్వారా తండ్రి గుండెనెప్పి సంగతి విని ఏడుపు లంకించుకుంది మహాలక్ష్మి. "ఛీ! ఏమిటి అర్ధరాత్రి శోకాలు? ఆయన కిప్పుడేమై పోయిందని? ఇదివరకెన్నిసార్లు రాలేదు గుండెనెప్పి?" అంటూ రామం కసురుకునేసరికి గొంతులో దుఃఖం గొంతులోనే అణుచుకుని తండ్రి పక్కన కూర్చుంది మహాలక్ష్మి.
    "అసలెలా వచ్చింది? ఎంతసేపైందీ నెప్పి మొదలై?" అన్నాడు రామం విసుగ్గా విశాలి ముఖం లోకి చూస్తూ.
    ముఖంలో ఏ భావమూ కనుపించనీయకుండా మెల్లిగా అంది విశాలి: "ఇదివరకు రాలేదూ? అలాగే వచ్చింది. మీ రెళ్ళిన కొంచెం సేపటికే మొదలైంది. అప్పటినించీ నే నాయన పక్కనే ఉన్నాను."
    ఆ జవాబు విని మరేమీ ప్రశ్నించలేదు రామం. మహాలక్ష్మి కన్నీటితో పైటంతా తడుపుతుంది.
    ఏం జరుగుతుందో నన్న భయంతో తల్లడిల్లి పోయింది విశాలి మనసు.
    నేప్పితో బాధపడీ పడీ తెలతెలవారుతుండగా శాశ్వతంగా కన్ను మూశాడు సాంబయ్య.
    ఆ చావుకి తనే కారణమేమోనన్న అనుమానం విశాలి మనసుని పీకింది.    
    చాటుగా రెండు కన్నీటి చుక్కలు విడిచింది. రామం ప్రవర్తనలో మాత్రం ఏ మార్పూ లేదు. మహాలక్ష్మి దుఃఖం వర్ణనాతీతం.
    "నాన్నా! నాన్నా!" అంటూ ఆయనమీద పడి, మనసులో బాధ కన్నీటిరూపంలో చిందిస్తున్న వదినని చూస్తుంటే, ఎప్పుడో తన చిన్నతనాన పోయిన తండ్రి గుర్తుకొచ్చాడు విశాలికి. పదేపదే కన్నుల ముందు అస్పష్టంగా కనుపిస్తున్న తండ్రి స్వరూపాన్ని తలుచుకుని కంటనీరు పెట్టింది.
    ఒక నిమిషం పోయాక తన కర్తవ్యం గుర్తుకొచ్చి కన్నులద్దుకుని వదిన దగ్గిరికి వెళ్ళింది.
    మనఃస్పూర్తిగా ఎన్నో ఓదార్పు మాటలు చెప్పి మహాలక్ష్మి నక్కడినించి లేవదీసింది.
    తరవాతి కార్యక్రమం అంతా రామం చూసుకున్నాడు.
    మహాలక్ష్మి తల్లి చిన్నతనంలోనే కూతుర్ని తల్లిలేని దానిగా చేసిపోయింది.
    ఇప్పుడు తండ్రికూడా  తప్పుకున్నాడు తన బాధ్యత తీరిందని.
    భర్త చేతుల్లో వాలి బాధ దిగమింగుకుంది మహాలక్ష్మి.
    
                             *    *    *

    మామగారు పోవడంతో షాపుమీద పూర్తి అధికారం రామం చేతిలోకి వచ్చింది.    
    స్వేచ్చగా గాలి పీల్చుకున్నాడు.
    ఎందుకో తనకే తెలియదు.
    
                             *    *    *

                                

    రోజులు గడిచిపోతున్నాయి. కాలం రోజుల్ని మింగి కసిగా మనుషుల వయసులు పెంచి, కరువుతీరా జరిగే వన్నీ చూస్తూ కదిలిపోతూంది.
    ఆ రోజు శుక్రవారం.
    రామం భోజనం చేసి బయటికి వెళ్ళిపోయాడు. వదినతోపాటు తనుకూడా భోజనం అయిందనిపించి వంటిల్లు కడిగి ఇవతలి కొచ్చింది విశాలి.
    ఎర్రని జరీఅంచున్న తెల్లగద్వాల చీర, అదే రకమైన జాకెట్టు ధరించి, తలంటు పోసుకున్న కురులు వదులు వదులుగా సగం వరకూ అల్లి వదిలి వేసిన జడ, దానిలో అందంగా ఒక పక్క అమర్చిన ఎర్రగులాబీ, తీర్చి దిద్దిన కాటుక, నుదుట ఎర్రని కుంకుమబొట్టు-అచ్చు లక్ష్మీదేవీలా ఆ శుక్రవారం గుమ్మంలో అడుగు పెట్టింది సువర్ణ.
    స్నేహితురాలి ముఖం కనుపించగానే విశాలి అధరాలపై చిరునవ్వు లాస్యం చేసింది.
    వేకే సువర్ణా!" అంటూ ఆనందంగా ఆహ్వానించి తన గదిలోకి తీసుకువెళ్ళింది.    
    "ఏదో నోము నోచుకుందిట. పేరంటం పిలవడానికి వచ్చింది సువర్ణ" అంది విశాలి వదిన్ని కేకేసి.
    "ఏదో ఒకటి లెద్దూ! ఆ నోము పేరేమిటో ఇప్పుడు నువ్వు చెప్పినా గుర్తుండదు లెద్దూ నాకు! ఆ నోములూ, వ్రతాలూ నాకు తెలియవు" అంది విశాలి. "ఏదో నోము అంటావేమిటి" అంటూ మోచేత్తో పొడుస్తున్న సువర్ణతో.    
    మహాలక్ష్మి బొట్టు పెట్టించుకుని లోపలికి వెళ్ళి పోయింది.    
    వెళతానని లేచింది సువర్ణ.
    "అదేమిటీ! అప్పుడే వెళ్ళిపోతావా! ఓ గంటైనా కూర్చోకపోతే వదులుతాననుకోకు."
    'బాగానే ఉంది. నా కేం? ఒక గంట కాదు, ఎన్ని గంటలైనా కూర్చుంటాను. నీకె ఆలస్యమవుతుంది ఆఫీసుకి."
    "ఆహాహా! ఏం సెలవిచ్చారండీ! ఆఫీసుకే వెళ్ళవలసిన అవసరం ఉంటే తమర్ని ఓ గంట కూచోమని ఎందుకంటామా? అయినా ఇంతాలస్యమా? వెళ్ళవలసి ఉంటే ఇందాకే వెళ్ళిపోయి ఉండేదాన్ని." నవ్వింది విశాలి.
    "ఏం? ఈ వేళ వెళ్ళవా?"
    "లేదు, సువర్ణా! పొద్దున్నించీ విపరీతమైన తల నెప్పి. ఆఫీసుకెళ్ళినా పని చెయ్యలేను. అదీకాక సెలవలు కావలసినన్ని పడున్నాయి. అందుకని సెలవ పెట్టేశానీవేళ."
    "మరి చెప్పవేం! తలనెప్పిగా ఉంటే పడుకుని రెస్ట్ తీసుకోక నన్ను బోర్ కొట్టమంటావెందుకూ?"
    "ఛ! అలా అనకు. నా తలనెప్పికి నీ కబుర్లకంటే మంచి మందు ఎక్కడా లేదు. కావలిస్తే చూడు. నువ్వు కబుర్లు చెప్పి ఇంటికి వెళ్ళబోయేసరికి నా తలనెప్పి తోక ముడుస్తుంది."
    "అలాగా!" కిలకిలా నవ్వింది సువర్ణ. కిటికీ పక్క ముద్దమందార ముచ్చటగా ఉయ్యాల లూగింది.
    గదిలో బల్లమీది రాధాకృష్ణుల విగ్రహం చిరునవ్వులు చిందిస్తూంది.
    "అది సరేగానీ, నీ పెళ్ళి పిలుపు ఎప్పుడు?"
    "నాకా! పెళ్ళా! హాస్యమాడుతున్నావా?" విరక్తిగా నవ్వింది విశాలి.
    "ఇందులో హాస్యానికేముంది? అంత బాధపడతావెందుకూ?"
    "నేనా ప్రసక్తే ఎప్పుడూ తలచను. ఎందుకంటావా? అన్నయ్య ఆ విషయం ఎప్పుడూ ఆలోచించడు ఇంట్లో మగవాడు ఉండి ఆ బాధ్యత తీసుకోనప్పుడు నేనే తెగించవలసి వస్తుంది. అంత ధైర్యం, చొరవా నాకు లేవు. అదీకాక అటువంటి ధైర్యం నా కిష్టం లేదుకూడాను. ఏం జరిగినా ఇంటి కంతకీ చెడ్డ పేరొస్తుంది. బీదదాన్ని, ఊరుమీద పడి ఉద్యోగం చేసుకుంటున్నదాన్ని, ముద్దు ముద్దగా పెళ్ళి చేసుకోవలసిన వయసు దాటినదాన్ని. నన్నెవరు చేసుకోవడానికి ముందుకొస్తారు, చెప్పు?" ఆ మాటలకి చలించిన మనసుతో విశాలి కళ్ళలోకి చూసింది సువర్ణ. అని కళ్ళు కాదు, కన్నీటి కడవలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS