"ఇక్కడ శాంతిగా ఉందా?" అడిగాడతను.
"లోని కంగారుని అణచివేస్తోంది యీ యుద్ధ సంక్షోభం. అందరి వెనుకాలా అన్ని చోట్లా మృత్యువు పొంచి ఉన్నట్టనిపిస్తుంది. ఈ సోల్జర్ల మధ్య అప్పుడు నా బాధ ఒక్కటీ విడిగా కనపడదు"
"నిజమే"
"ఒక్కొక్కసారి ఈ సోల్జర్లలో ఎక్కడో మా ఆయన ఉన్నాడేమో అనిపిస్తుంది."
బ్లాకౌట్ చేయబడిన వెలుతురులో ఆమె కళ్ళ చివర కన్నీటి బిందువుని చూశానా అని అనిపించింది అతనికి. ఏమనాలో తోచలేదు."చీకటి బావుంటుంది" అన్నాడు. జేబులో చెయ్యి పెట్టి తీసివేశాడు.
రోడ్డు క్రమంగా ఒక మైదానంలో కలిసిపోయినచోట అస్పష్టంగా విశాలంగా అయిపోయింది. మైదానంలో డేరాలూ, డేరాలలోంచి చిన్న చిన్న లైట్లూ కనబడుతున్నాయి. మైదానానికి ఇంకా దూరంగా నడుస్తూన్న అతనికీ ఆమెకీ సన్నని గొంతుక పాడుతూన్నట్టు వినిపిస్తుంది. పాట కొత్తగా విజాతీయంగా వుంది. ఎవరో తనలో తాను ఏడుస్తూ కిందపడి దొర్లుతున్నట్టుగా వుంది.
"ఏమిటదీ" అంది ఆమె.
"బర్మా శరణార్ధుల క్యాంపు"
"వెళదామా"
"ఊఁ"
ఇద్దరూ ఆ డేరాలవైపు నడవసాగారు. అంత రాత్రివేళ కూడా కొందరు నిద్రలేకుండా డేరాలకి దూరంగా కూర్చుని ఉన్నారు. కొన్నిచోట్ల ఒక స్త్రీ, పురుషుడూన్నూ. మెల్లగా భయంగా వీచే గాలిలోంచి వాళ్ళ గుసగుసలు వినబడుతున్నాయి. డేరా సందుల్లోంచి వెలుగు సన్నగా పాకి యిసుకమీదపడి మెరుస్తూంది.
"ఈ జంటలు భార్యా భర్తలా" అడిగిందామె.
"అవొచ్చును ఏం చెప్పగలం" అన్నాడతను.
"ఇంతమంది ఇళ్ళూ వాకిళ్ళూ వదిలి వచ్చేశారు. పాపం వాళ్ళకి ఎలా ఉంటుందో!"
"యుధ్ధం-" పళ్ళు నొక్కిపెట్టి అన్నాడతను.
డేరాలు సమీపించిన కొలదీ ఆ ప్రదేశమంతా కంగాళీగా వుంది. డేరాలకి కొద్దిదూరంలో షెల్టర్లూ గోతులూ ఉన్నాయి. డేరాలలో పెట్టెలూ సామాన్లూ ముసలివాళ్ళూ పేర్చబడి ఉన్నారు. చాపలమీద స్త్రీలూ, శిశువులూ పరున్నారు.
"ఎంతమందో" అందామె.
అతను మాట్లాడలేదు. జేబులో చెయ్యిపెట్టి తీసేశాడు.
ఒక చంటిపిల్ల 'కార్' మంది -ఏడుస్తూ పక్కకి మరొకడి పక్కలోకి దొర్లింది. వాడు లేచి విసుక్కుంటూ పెద్ద కేకలు వేస్తున్నాడు. ఒక వృద్దుడు లేచి పిల్లనెత్తుకుని లాలిస్తూ ఈవలికి వచ్చాడు!
"తల్లి కివ్వరాదూ పిల్లనీ" -అందామె ఇంగ్లీషులో.
వృద్ధుడు ఆమెకేసి కొంతసేపు శూన్యంగా చూశాడు. అతికష్టంమీద మాటలను పోగుచేసుకుంటూ ఇలా అన్నాడు. ఆ పిల్ల తన మనుమరాలనీ, తన కూతురు అస్సాము సరిహద్దు దగ్గర ప్రసవించి చనిపోయిందనీ - తిరిగీ ఇలా అన్నాడు "దీనికి పాలులేవు. ఇది కూడా చచ్చిపోతే బాగుండును"
ఆమె జాలిగా చూసింది. ఇద్దరూ అక్కడ నుండి కదిలారు.
"పాపం" అందామె
"ఏం?"
"జాలేసింది. కాని ఆ పిల్ల నాడులూ అవీ పైకొచ్చి అసహ్యంగా ఉంది."
అతను యిసుకలో మౌనంగా నడుస్తున్నాడు. భారంగా అడుగులు వేస్తూ కొంచెం వంగి నడుస్తున్నాడు. ఆమెకి ఏమయ్యాడో తెలియని తన భర్త అరేబియా యెడారిలో యిలాగే నడుస్తున్నాడా అనిపించింది. కంగారుగా పైట చేత్తో సవరించుకుంది.
