అప్పుడే ఏడుస్తావేమిటి?" అన్నాడు రిక్షావాడు.
సుమిత్ర మాట్లాడలేదు.
"ఆ పెట్టి తెరు" అన్నాడు రిక్షావాడు.
సుమిత్ర హడిలిపోయింది. అందులో అయిదువందల రూపాయల క్యాషు వున్నది. ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెడుతున్నదనీ-ధైర్యానికి కొంత డబ్బు దగ్గరుండాలనీ ఆమె తండ్రి అప్పుచేసి ఆ డబ్బామెకు తెచ్చి ఇచ్చాడు. వీలైనంత డబ్బు మిగిల్చింది. ఇప్పుడా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరై పోతోంది.
"ఇంకా నన్నింతటితో వదిలిపెట్టు" అన్నదామె.
"పెట్టె తెరు" అన్నాడు రిక్షావాడు కఠినంగా.
"అరుస్తాను, ప్రతిఘటిస్తాను. ఇంక నన్ను వదిలిపెట్టు" అన్నదామె.
"అలా చేస్తే నిన్ను పాడుచేసి మరీ వెడతాను. నీ వంటిమీద బట్టలుకూడా ఎత్తుకుని వెడతాను" అన్నాడు రిక్షావాడు.
సుమిత్రకు ఏం చేయాలో తెలియలేదు.
పాపం-ఆడపిల్ల!
ఆమెకు వేరేదారి ఏమీ లేదు. రిక్షావాడు ఆడపిల్లల్ని ఎలా బెదిరించాలో అలా బెదిరించాడు.
బ్రీఫ్ కేసు తెరుచుకుంది. అందులోని డబ్బు మాత్రమే కాక-ఖరీదైన బట్టలుకూడా వాడు తీసుకున్నాడు.
"ఇంకో అర్ధరూపాయి ఎక్కువిచ్చి ఆ రాఘవగాడి రిక్షాలో ఎక్కివుంటే నీకీ కష్టాలుండేవి కాదు. వాడు మహారూలు మనిషి. అయినా మా కదే ఉపయోగపడుతోంది. మీలాంటి కక్కుర్తి వాళ్ళుండబట్టే మాలాంటి వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి" అన్నాడు రిక్షావాడు.
సుమిత్ర బొమ్మలా వుండిపోయింది. అన్నీ పోగొట్టుకున్నట్లే వున్నదామెకు.
"రిక్షా దిగు" అన్నాడు రిక్షావాడు.
"ఇక్కడా?" అన్నది సుమిత్ర.
"బాగుంది-నిన్నక్కడ దింపకుండా - ఇంటిదాకా దిగబెట్టడానికి నేనేమైనా వెర్రాడిని అనుకున్నావా?" అన్నాడు రిక్షావాడు.
రిక్షావాడు సుమిత్రకు దారి చూపిస్తూ-"ఇలా తిన్నగా వెళ్ళిపో-దారిలో నీకే భయమూ వుండదులే" అన్నాడు.
తేలికైన బ్రీఫ్ కేసుతో సుమిత్ర రోడ్డుమీద నిలబడింది.
"నీ బెంగ నాకు తెలుసులే-నా ఫ్రెండు నీ ఫ్రెండుని వదిలిపెట్టడులే-ఆమెకూ వున్నదంతా పోతుంది" అంటూ వాడు సుమిత్రకు హామీ ఇచ్చాడు.
సుమిత్రకా రిక్షావాడిని వదిలి వెళ్ళాలనిపించలేదు. ఏ దైవమైనా కరుణించి ఎవరైనా వస్తే బాగుండును. తన సర్వస్వమూ వాడి దగ్గరే వుండిపోయినట్లుంది. ఇప్పుడెలాగో అలాగ....
అయినా తనకంత అదృష్టమా!
ఆమె చూస్తూండగా రిక్షా వెనక్కు తిరిగింది. ఆమె చూస్తూండగానే రిక్షా కనుమరుగయిపోయింది.
సుమిత్ర ఉస్సురని నిట్టూర్చి తన ఇంటివైపు దారితీసింది. కన్నీళ్ళు ఆ దారిని తడుపుతూనే వున్నాయి - ఆమె ఇల్లుచేరేవరకూ!
"చైను ఊడిందమ్మా!" అన్నాడు రిక్షావాడు.
"ఊఁ సరే- తొందరగా కానీ" అన్నది వనజ.
కొద్దిసేపట్లో రిక్షా మళ్ళీ బయల్దేరింది. ఓ పావుగంటలో మళ్ళీ ఆగిపోయింది.
"మళ్ళీ చైను ఊడిందా?"
"లేదమ్మా-చైను నాకు కావాలి!" అన్నాడు రిక్షావాడు.
"ఏం చైను?" అన్నది వనజ.
"నీ మెడలోది."
"రాస్కెల్!" అంటూ రిక్షా దిగింది వనజ.
రిక్షావాడు ముందు కాస్త తడబడినా "ఏంటమ్మా- మాటలు జాగ్రత్తగా రానీ" అన్నాడు.
"నీ నోటిని బట్టే నా నోరూ వుంటుంది" అంది వనజ.
"చూడమ్మా - ఇక్కడ చుట్టూ ఎవ్వరూ లేరు. రమ్మన్నా ఎవరూ రారు. నేను నిన్నేం చేసినా దిక్కులేదు. మర్యాదగా నీ మెడలోని గొలుసూ, చేతి వాచీ, పెట్టెలోని డబ్బు, బట్టలు-తీసి ఇచ్చేయి. లేదా-నేను నీవంటిమీద చెయ్యాల్సొస్తుంది" అన్నాడు రిక్షావాడు.
వనజ చుట్టూ చూసింది. వాడు చెప్పిందాంట్లో అబద్దం లేదు. ఆమె బుర్ర చురుగ్గా పనిచేసింది.
"సరే-నువ్వు చెప్పినట్లే చేస్తాను" అంటూ రిక్షాలోని బ్రీఫ్ కేసు తీసి తెరుస్తున్నట్టుగా నటిస్తూ-మెరుపువేగంతో రిక్షావాణ్ణి ఒక్క తోపుతోసింది. వాడు పడగానే తను శక్తినంతనీ పుంజుకుని పరుగు ప్రారంభించింది.
రిక్షావాడు క్షణాలమీద లేచాడు. రిక్షా ఎక్కాడు. వాడి అదృష్టమేమో-ముందున్నదంతా డౌను.
వనజ పరుగెడుతోంది. అలాంటి పరుగు ఆమెకు అలవాటు లేదు. పైగా ఓ చేతిలో బ్రీఫ్ కేస్ బరువు. కేవలం భయం ఆమెను పరుగెట్టిస్తోంది.
రిక్షావాడు ఆమెను దాటించి, దారికి అడ్డంగా రిక్షా ఆపి-ఒక్క ఉరుకు ఉరికి - "నన్ను తప్పించుకు పోదామనుకున్నావా?" అన్నాడు.
వాడి చేతిలో కత్తి వుంది.
"నీకు ప్రాణాలే ముఖ్యమో, డబ్బే ముఖ్యమో-త్వరగా తేల్చుకో" అన్నాడు వాడు.
వనజ కథ ఇంతదూరం వెడుతుందని ఊహించలేదు.
ఇప్పుడు తనేం చేయాలి?
మెడలో గొలుసు పోతే మళ్ళీ చేయించుకోవచ్చు. చేతికున్న వాచీ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు. పెట్టెలో నాలుగు చీరలు, రెండు వందల రూపాయల నగదు వున్నాయి. ఆ నష్టం పూడ్చుకోవడం పెద్ద కష్టం కాదు.
రిక్షావాడితో పెనుగులాడ్డం వల్ల తన ప్రాణం పోకపోయినా ప్రమాదకరమైన గాయాలు తగలవచ్చు. అవి తనకు అపకారం ఏర్పర్చవచ్చు. తను శాశ్వతంగా ఏ గుడ్డిదో, కుంటిదో అయిపోతే?
"తొందరగా ఇవ్వు...."
వనజ వాడికి తన మెడలోని గొలుసు ఇచ్చింది. చేతి వాచీ ఇచ్చింది. పెట్టె తెరచి చీరలు, డబ్బు ఇచ్చింది.
రిక్షావాడు నవ్వాడు.
"ఇంకా కావాలి నాకు."
"ఇంకేం లేవు! అంది వనజ భయంగా.
"పెట్టెలో బట్టలకంటే నువ్వు కట్టుకున్న బట్టలు బాగున్నాయి" అన్నాడు రిక్షావాడు.
"అయితే...."
"అయితే లేదు-గియితే లేదు-అవికూడా ఇచ్చేసేయ్...."
వనజకు మతిపోయినట్లయింది.
రిక్షావాడు నవ్వుతున్నాడు-"నేనూ థర్డుఫారందాకా చదువుకున్నాను. ఓ చిన్న ఉద్యోగం దొరికినా, బుల్లి వ్యాపారం పెట్టుకున్నా ఏ సినిమా హీరోలాగో వుండేవాణ్ణి. ఇలాగున్నానని కంగారుపడకు. నీ బట్టలు అడగను-అలా పక్కకు పోదాంరా."
వనజ మాట్లాడలేదు.
"బట్టలిస్తావా? పక్కకు వస్తావా?"
రెండూ అవమానకరమైనవే!
సుమిత్ర మాట విని స్టేషన్లో వుండిపోతే ఏ ఇబ్బందీ వుండేది కాదు. ఇప్పుడు తనేం చేయాలి? రిక్షావాడు చాలా దుర్మార్గుడిలా వున్నాడు.
వనజ వాడిని అంతటితో వదిలిపెట్టమని బ్రతిమాలింది.
"చేతిలో కత్తి వుంది. కత్తంటే నీకు భయముంది. మంచి ఒంటరి ప్రదేశం-నీలాంటి ఆడది నాకు డబ్బిచ్చినా దొరకదు. ఇలాంటి అవకాశాన్ని నేను పోగొట్టుకోలేను" రిక్షావాడు ఆవేశంతో వున్నాడు.
"ప్రాణాలు పోయినా నేనిందుకు అంగీకరించను" అంది వనజ.
ఆమె రోడ్డువైపే ఆశగా చూస్తున్నది. ఎక్కడా నరసంచారం లేదు.
రిక్షావాడామెమీద పడ్డాడు. ఆమె వాడిని వెనక్కుతోసింది. ఇద్దరిమధ్యా పెనుగులాట ప్రారంభమైంది. రిక్షావాడు ఆవేశంతో పరిసరాలు మరిచిపోయాడు. వనజ జీవితంలో ఇదే అంతిమ పోరాటమన్నట్లు ప్రతిఘటిస్తున్నది.
