Previous Page
ఒప్పందం పేజి 57

 

    వివాహం అయిన చాలా రోజులకి గుండె పగిలేలా ఏడవాలని పించింది. కానీ, కన్నీళ్లు రాలేదు. దుఃఖం గుండెల్లో ఘనీభవించి పెద్ద బరువు నా గుండెల మీద పెట్టినట్టు అనిపిస్తోంది. నిద్రపట్టలేదు. ఎవరితో నన్న మనసులో ఉన్నవన్నీ చెప్పుకోవాలని ఉంది. అమ్మ దగ్గరకు వెళ్లాలని పిస్తోంది. చెల్లాయిని, నాన్నగారిని చూడాలని ఉంది. అమ్మ చేతి కంది పచ్చడి ముద్దా తినాలని, చెల్లాయితో కలిసి కట్ మిర్చి తినాలని...ఏవేవో కోరికలు...కానీ కళ్ళముందు మాత్రం కాలిపోతున్న గుండెలు.... అవన్నీ అమ్మాయిల గుండెలే.... ప్రేమ అనే సౌందర్యం అంటని గుండెలు.... కాలి, కాలి నల్లగా బొగ్గుల్లా.
    తెల్లవారుతుండగా కొద్దిగా నిద్ర పట్టింది. కానీ, గంటకే బలవంతంగా లేవాల్సి వచ్చింది. తల పగిలి పోతోంది. ఒళ్ళంతా నొప్పులు.... కాలేజీకి వెళ్ళాలని పించలేదు.
    కాలేజీకి సెలవు పెట్టి నవ్య దగ్గరకు వెళ్ళాను. నన్ను చూడగానే నవ్యకి అర్ధమైంది. "కంగ్రాట్స్ అంది నన్ను కావలించుకుని."
    నీరసంగా నవ్వి సోఫాలో కూర్చున్నాను.
    "ఏంటే అంత నీరసంగా ఉన్నావు.... వాంతులా ?" అంది.
    "ఏమీ సయించడం లేదు. తింటే వాంతి అయిపోతోంది."
    "ఫ్రూట్స్ తినచ్చు కదా.... నారింజ, దానిమ్మ తిను"
    "మార్కెట్ కెళ్ళే ఓపిక ఉండడం లేదు. కాలేజీ నుంచి నేరుగా ఇంటికే."
    "విశాల్ ఏం చేస్తున్నాడు.... తేవచ్చు కదా.... ఈ సమయంలో నిన్ను అపురూపంగా చూసుకోవాలి."    
    ఆమాటకి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నవ్యకి కనిపించకుండా కంట్లో నలుసు పడినట్టుగా కళ్ళు నలుముకుంటూ 'అతనికి మాత్రం టైమేది?" అన్నాను.
    "ఏం టైం లేక ఏం చేస్తున్నాడు? నీకన్నా ఇంపార్టెంట్ పనులున్నాయా?"
    'అయినా నేను ఈ విషయం అతనికి చెప్పలేదు."
    "వ్వాట్?ఆశ్చర్యంగా చూసింది.... చెప్పలేదా? ఇంత ఆనందకరమైన వార్త చెప్పలేదా? ఎందుకని?"
    "తనకి పిల్లలంటే ఇష్టం లేదు."
    "ఏంటే పిచ్చా?" చిరాగ్గా చూసింది. "స్పెసి మన్ లా ఉన్నాడే.... పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళుంటారా? మీ ప్రేమ చిహ్నంగా పిల్లలు కావాలనుకోవాలి గాని..."
    నేనేం మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నాను. నవ్య లేచి ఫ్రిజ్ తెరిచి  నారింజ పండ్లు తీసి, రసం తీసిచ్చింది. "అన్నట్టు వారం క్రితం మా ఇంటికి వచ్చాడు విశాల్ " అంది జ్యూస్ అందిస్తూ.
    నేను షాకింగ్ గా చూశాను. అవునా?" దేనికి?"
    "నీకు చెప్పలేదా?' అనుమానంగా చూసింది.
    "లేదు మర్చిపోయాడేమో"
    నవ్య ఏం మాట్లాడలేదు.
    "ఏమన్నాడు?" అడిగాను. అదిరే గుండెలు చిక్కబెట్టుకుని... ఎందుకు వచ్చినట్టు నాకు చెప్పను కూడా లేదు.
    "ఏం లేదు....కాస్సేపు నా అందం పొగిడాడు. వంటరిగా ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగాడు. లివింగ్ టుగెదర్ మీద నా అభిప్రాయం అడిగాడు. కాఫీ ఇచ్చాను. తాగాడు.... వస్తాను బై అంటూ వెళ్ళిపోయాడు."
    'అలాగా; లోతు స్వరంతో అన్నాను. నారింజ రసం చేదుగా అనిపించింది. కొంచెం తాగి 'సయించడం లేదే' అంటూ టీపాయ్ మీద గ్లాసు పెట్టేసాను."
    'సయించక పోయినా కొన్ని సమయాల్లో కొన్ని పదార్ధాలు తినాలి. నచ్చక పోయినా కొన్ని  సందర్భాల్లో కొన్ని పనులు చేయాలి. ఇది చిన్న సూత్రం. జీవన సూత్రం.... తాగు' అంటూ ఆప్యాయంగా గ్లాసు నోటి కందించింది.
    చెమర్చిన నా కళ్ళ నుంచి ఒక కన్నీటి చుక్క గ్లాసులో పడింది.
    కాస్సేపు కూర్చుని లేచి ఇంటికి వచ్చేశాను. నా మనసు మనసులో లేదు. ఏవేవో ఆలోచనలతో తల పగులుతున్నట్టు గా ఉంది. తూలిపోతూ ఇంట్లో అడుగు పెట్టిన నేను అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంత పోయాను. గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకుంటున్న యువతిని చటుక్కున వదిలేశాడు నా రాకతో. నన్ను చూసి రివ్వున పారిపోయిందా యువతి. పక్కింట్లో ఇంటర్ చదువుతున్న పదహారేళ్ళ ప్రతిమ.
    శిలలా నిలబడిపోయిన నన్ను చూస్తూ...."ఎక్కడి కెళ్ళావు/ లేట్ అయిందెం.." అడిగాడు ఏమీ జరగనట్టు సాధారణంగా.
    నేను ఏం మాట్లాడలేదు. అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను.
    "ఏం కొంపలంటుకు పోలేదు. నీకోసం వచ్చిందా అమ్మాయి. ముద్దోచ్చింది పెట్టుకున్నాను. తప్పేంటి?" అన్నాడు.
    చాచి చెంప పగిలేలా కొట్టాలని పించింది. విసురుగా లోపలికి వెళ్ళి పోయాను.
    ఏమయింది? ఎలా జరిగిందిలా? ఇతను నేను ప్రేమించిన విశాలేనా? ఎంతో సంస్కారవంతుడిలా , సోకాల్డ్ గా కనిపించిన విశాలేనా? ఇంజనీరు విశాలేనా? ఇతనిలో ఇన్ని బలహీనతలు ఉన్నాయా? ఇవి బలహీనతలా? అతనిలో ఉన్న నీచ ప్రవృత్తి తాలుకూ పరంపరలా? ఎలా? ఎలా మోసపోయాను.
    సిగ్గు, ఎగ్గు తెలియని విశాల్ నా పక్కకి చేరాడు. "నువ్విలాంటివి చూసి బాధపడుతుంటే నీ జీవితం అంతా బాధపడడానికే సరిపోతుంది.... నాకున్న బలహీనత ఇదొక్కటే... ఆడవాళ్ళని చూస్తె ఆగలేను... నీకు పిల్లలంటే ఇష్టం కదా.... డాక్టర్ దగ్గరకు వెడదాం పద' అన్నాడు.
    నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తుంటే నేను ప్రెగ్నెంట్ అని అర్ధం కావడం లేదా? అది కూడా గమనించనంత గుడ్డిగా నన్ను ప్రతి రాత్రీ అనుభవిస్తున్నాడా? వాపు చూసి బలుపు అనుకున్నట్టు నా కడుపు చూసి నేను లావయ్యానని అనుకుంటున్నాడు.
    నెమ్మదిగా అన్నాను. "నీకు తెలియదా ? నేను ప్రెగ్నెంట్."
    "వ్వాట్ ' చటుక్కున నామీంచి లేచి లైటు వేశాడు. దగ్గరగా వచ్చి పొట్ట మీద తడుతూ "అవునా? ఏంటి లావయ్యావు అనుకున్నా.... మొత్తానికి నీకోరిక తీరుతోందన్న మాట.... ఒకే....నో ప్రాబ్లం... నీకు తొమ్మిదో నెల వచ్చి డెలివరీ అయిందాకా నిన్ను డిస్టర్బ్ చేయను....బట్ నాకో హెల్ప్ చేస్తావా?"
    నొసలు చిట్లించి చూశాను.
    "నీఫ్రెండ్ మీద చాలా మనసుగా ఉంది. నాకు నవ్య కావాలి. జస్ట్ కొంతకాలం.... స్టేప్నీ లాగా....నీ కడుపు బాలింతతనం అంతా అయిందాకా."
    స్థాణువై వింటోన్న నాకు అతడి చెంప పగలగొట్టడానికి నాచేతులు ఎందుకు మొరాయిస్తున్నాయో అర్ధం కాలేదు. శక్తి కూడదీసుకుని అరిచాను.... 'ఐసే షటప్....' అంత గట్టిగా ఎలా అరిచానో నాకే అర్ధం కాలేదు. 'నీకు సిగ్గు లేదూ గెట్ అవుట్ ఫ్రం హియర్.'
    "ఏయ్ హోల్డ్ యువర్ టంగ్ నీకు నా సంగతి తెలియదు. నేను ఏం చేసినా నోరు మూసుకుని ఉండు. అంత గొంతుతో ఈసారిఅరిస్తే గొంతు నోక్కేస్తా.... బిహేవ్ యువర్ సెల్ప్.... మంచం మీంచి లేచి సిగరెట్ తీసి విలాసంగా వెలిగించుకుంటూ బైటకి వెళ్ళిపోయాడు.
    నా కళ్ళముందు నేనుకట్టుకున్న అద్దాల మేడ ముక్కలుగా విరిగి నామీదే పడుతున్న భావన.
    గుండె నిండా గాయాలతో రక్తం ఓడుతున్న అనుభూతి.... మంట...గుండె, కడుపు, కళ్ళు మంట.... అణువణువు మంట... నిశ్చేతానై పడుకుండి పోయాను.
    రోజులు గడుస్తున్న కొద్ది నాకు పిచ్చేక్కిపోతున్నట్టు అనిపించసాగింది. విశాల్ లోని స్వార్ధం , పిసినారి తనం , పశువాంచ , స్త్రీల పట్ల అతని అభిప్రాయాలు.... ఇవన్నీ నాకు మరో విశాల్ ని చూపించాసాగాయి. ఆ విశాల్ నీచుడా... పరమ నీచుడు... ఇది నిజమేనా? నేనెలా మోసపోయాను. ఈ బంధం నిలుపుకోనా? తెంపుకోనా? తెంపుకుంటే ఎలా బతకాలి? నవ్య కున్న తెగింపు, ధైర్యం నాకు లేవు. నాకు నెలలు నిండుతున్నాయి. అదేం గమనించని పశువు ప్రతి రాత్రీ  నామీద పడుతూనే ఉన్నాడు. మా ఇద్దరిమధ్యా ఇప్పుడు అనురాగం, ప్రేమ లేవు. అతనిలో కామం...నాలో అసహ్యం.... కానీ, ఒక కప్పు కింద ఉంటున్నాం. ఒకేసారి తింటున్నాం. ఒకే మంచం మీద పడుకున్తున్నాం. నేనిప్పుడు ఓ యంత్రంలా  మారాను. భవిష్యత్తు గురించిన ఆలోచనలతో నాకు నిద్రపట్టడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో, ఎవరిని సలహా అడగాలో అర్ధం కాలేదు. నవ్యకి చెప్పాలంటే అవమానంగా అనిపిస్తోంది. సరితకి చెప్పాలంటే గిల్టీగా ఉంది. అమ్మకి చెప్పుకోవాలంటే అమ్మ నన్ను వదిలేసింది.... ఎవరికి చెప్పుకోను?"
    ఆరోజు నవ్య దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. "ధన్యా సాయంత్రం కాలేజీ నుంచి మా యింటికి రా ఓసారి.... చిన్న పనుంది" అంది.
    కొంచెం తనతో మాట్లాడితే మనసు కాస్త తెలికన్నా అవుతుందనిపించి సాయంత్రం ఐదింటికి నవ్య ఇంటి వైపు వెళ్ళాను. అటో దిగి ప్లాట్ వైపు నడిచాను. తలుపు వేసి ఉంది. సాధారణంగా నవ్య తలుపు వేసుకునే ఉంటుంది. ప్లాట్స్  కదా...కాలింగ్ బెల్ నొక్కాను. రెండు నిముషాల తర్వాత డోర్ తెరచుకుంది. చెదిరిన జుట్టు,..కందిన మొహం.... చున్నీ లేని చుడీదార్ తో నవ్య ఏదో తేడా.... ఎప్పటి నవ్య కాదు. పూసిన రోజాలా ఉండే నవ్య లో ఏదో లోటు.... అనుమానంగా లోపలికి అడుగు పెట్టాను. సిగరెట్ వాసన.... పరిచితమైన వాసన.
    వణుకుతున్న శరీరం.... కళ్ళల్లో నిప్పు కణికలు... సోఫాలో కాలు మీద కాలేసుకుని విలాసంగా సిగరెట్ కాలుస్తున్నాడు విశాల్.
    నేను నిశ్చేష్టురాలి నై నవ్య వైపు చూశాను. ఎంత ద్రోహం.... మిత్ర ద్రోహం.... "ఎప్పటి నుంచి సాగుతోందే ..." మండిపడుతూ అడిగాను.
    నవ్య చూపు నిప్పురవ్వలా తాకింది.
    "నీ మొగుడిని అడుగు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారుగా... చాలా మంచి వాడు. అని సర్టిఫికేట్ ఇచ్చావుగా అడగవే.... నేను వీడికి ఉంపుడుగత్తే గా ఉండాలిట.... నామీద మహా మోజుట... దాదాపు నెలరోజులుగా వేధిస్తున్నాడు. నా స్నేహితురాలి భర్త అని ఇంతకాలం ఓపిగ్గా చెప్పాను. ఇవాళ అతని విశ్వరూపం చూపించటానికే నిన్ను రమ్మన్నాను. చూశావుగా.... ఇంక నీ భవిష్యత్తెంటో నిర్ణయించుకో... వివాహబంధం సున్నితమైంది. జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఆ బాధ్యత కేవలం ఆడదానికే లేదు... ఆ బంధాన్ని గౌరవించాల్సిన బాధ్యత మగాడిది కూడా. భార్య, పిల్లలు, ముచ్చటైన సంసారం కన్నా తుచమైన శారీరక సుఖానికి విలువిచ్చే ఇలాంటి మగాడికి పెళ్ళి, పెళ్ళాము ఇల్లు ఎందుకే?" అచ్చోసిన ఆంబోతులా రోడ్డు మీద వదిలేస్తే ఏ పిశాచమో చంపేస్తుంది. దరిద్రం వదులుతుంది."
    అన్ని మాటలంటున్నా కించిత్తు కూడా చలనం లేకుండా నిర్లక్ష్యంగా నావేపు  చూసి, బైటకి వెళ్ళిపోతున్న ఆ మొగుడనే ఆంబోతుని భావ రహితంగా చూస్తూ స్థాణువులా నిలబడిపోయాను.
    తెరలు తెరలుగా గుండె చీల్చుకుని దుఃఖం రాసాగింది. చలనం కోల్పోయి బ్యాగు పక్కన పడేసి, మంచం మీద శిలలా కూర్చుండి పోయాను. ఏం జరుగుతోంది? నా సంసారం.... ఆదర్శంగా ఉండాలనుకున్న నా సంసారం ఏమవబోతుంది... ఎంతో అసాధారణంగా ఉండాలనుకున్న నా భర్త సాధారణ వ్యక్తా? కాదు, కాదు....సాధారణ కన్నా తక్కువ... అతని స్థాయి ఏవిధంగా నిర్ణయించగలను? ఇంత జరిగాక ఎలా కలిసి బతకను? విడిపోయి ఎందుకు విడిపోయావంటే సమాజానికి ఏం సమాధానం చెప్పను? ఇలాంటివాడని చెప్పనా? పుట్ట బోయే నా కొడుక్కి తన తండ్రి గురించి ఏం చెప్పను?
    "ధన్యా ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా ఇలాంటి నేలబారు మనిషితో బతకడం గురించే ఆలోచిస్తున్నావా?"
    ఉలిక్కిపడి చూశాను నవ్య వైపు . ఆరోజు నవ్య భర్త తో విడాకులు తీసుకుందని తెలిసిన రోజు కారణం అడిగితె సరిగ్గా ఇదే సమాధానం వచ్చింది. 'ఒట్టి నేలబారు మనిషి'... అవును నేలబారు మనిషి.... ఇప్పుడర్ధమైంది అంటే ఏంటో.

                                     ***    


 Previous Page

WRITERS
PUBLICATIONS