మచ్చలు -- మగువలు
వసుంధర
"నా చుట్టుపక్కల ఇళ్ళు ఎక్కడయినా అద్దెకు దొరుకుతాయండీ"
నేను కుతూహలంగా అతని వంక చూశాను మనిషి చాలా అందంగా ఉన్నాడు. ఎత్తైన విగ్రహం ఖరీదైన బట్టలు. సంస్కారం ఉట్టిపడే ముఖం. చూసిన వెంటనే మరోసారి చూడాలనిపించేలా ఉన్నాడు.
'ఇళ్ళు అంటే ఫ్యామిలీకా లేక...."
అతను నవ్వి , "అయాం సారీ! వాటై మీన్ ఈజ్ ఎ రూమ్" అన్నాడు.
ఆ నవ్వు నాకు చాలా నచ్చింది. ఎందుకో చెప్పలేను కాని అ క్షణం అతనితో స్నేహం కలపాలనిపించింది.
"ఇక్కడ గదులు అద్దెకు దొరకడం చాలా కష్టం మీకు అభ్యంతరం లేకపోతె మీరు నాతో పాటే ఉండవచ్చు. ఇద్దరుండడానికి ఈజీగా సరిపోతుంది " అన్నాను.
అతని కళ్ళలో ఆశ్చర్యము, అనుమానమూ కనబడ్డాయి. ఒక్క నిమిషం పాటు ఏమీ మాట్లాడలేక పోయాడు. తర్వాత నెమ్మదిగా "ఈ గదికి మీరు అద్దె ఎంత ఇస్తున్నారు?" అన్నాడు.
"యాభై రూపాయలు."
"ఒకే! వుయ్ విల్ షేరిట్" అన్నాడు.
నేను నవ్వాను. నెలకు పాతిక రూపాయలు కలసి రావటం అదృష్టమే అనుకున్నాను.
అతను చక్కగా లోపల ప్రవేశించి కుర్చీలో చతికిలబడ్డాడు.
"మీ సామాను ఎప్పుడు తెచ్చుకుంటారు?" అన్నాను.
"నో సామాన్ మేన్!" అన్నాడతను నవ్వుతూ.
ఆ నవ్వు చాలా బాగుంది కానీ తొందరగా అపెస్తున్నాడు.
అతను జేబులోంచి ఓ కళ్ళజోడు తీశాడు. "నాకున్న సామానల్లా ఈ కళ్ళజోడూ రిస్టు వాచీ , తొడుక్కున్న బట్టలూ , కాలికున్న జోళ్ళూ అవే నా ఆస్థి కూడా అంతే!"
"ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా?"
"ఏమీ లేదు. ఒకప్పుడు ఉద్యోగం కోసమని చాలా ప్రయత్నాలు చేశాను. అవి ఫలించలేదు. అయితే ఇంతలోనే నన్ను అదృష్టదేవత వరించింది. తేలికగా డబ్బు సంపాదించే మార్గం కనుగొన్నాను." అన్నాడతను. అతని పెదవుల మీద చిరుదరహాసం వెలిసింది.
"ఏమిటా మార్గం" అన్నాను కుతూహలంగా. రోజల్లా క్లాసులో కుర్రాళ్ళ ముందు వాగి , వాళ్ళ వెక్కిరింతలు భరిస్తూ నెలకు నాలుగొందలు సంపాదించే నాకు, తేలిక మార్గంలో డబ్బు దొరుకుతుందంటే కుతూహలం కలగడం లో ఆశ్చర్యమేముంది!
అతను అదోరకంగా నా వంక చూసి , "మీరేం చేస్తున్నారు?" అన్నాడు.
చెప్పాను.
'చూడండి మాస్టారూ! మీ వృత్తి పట్ల నాకు అపారమైన గౌరవముంది. నేను డబ్బు సంపాదించేది మీకు చెప్పడం నాకిష్టం లేదు. ఎందుకంటె ఆ పద్దతిని మీరామోదించలేరు" అన్నాడతను.
నేను మరి మాట్లాడలేదు. మరో గంటలో నేను రూమ్ వదిలి వెళ్ళిపోయాను. వెళ్ళేముందు అతనికి నేను డూప్లికేట్ తాళం చేవిస్తూ నేను మళ్ళీ సాయంత్రం అయిదు గంటలకు వస్తాను. ఈలోగా పని తగిలితే మీరు బయటకు వెళ్ళేముందు గదికి తాళం వేసి వెళ్ళవచ్చు." అన్నాను. అని కాలేజీకి వెళ్ళిపోయాక నన్ను రకరకాల అనుమానాలు పీడించసాగాయి.
ముక్కూ ముఖం తెలియనీ అపరిచుతుడిని నమ్మి గది అప్పగించి వచ్చాను. పైగా అతగాడి వృత్తి అనుమానాస్పదమైనది కూడాను. నా రూమ్ లో చెప్పుకోదగ్గ ఆస్తి లేకపోయినా, అలారం టైంపీసు, టేరిలిన్ బట్టలూ పొతే చాలు నా ప్రాణానికి.
సాయంత్రం నేను గదికి వెళ్ళేసరికి అతను గదిలోనే ఉన్నాడు. నా మనసులోని అసంతృప్తి చాలా వరకూ మాయమైపోయింది. అంతే కాదు, అతని మీద నాకు గౌరవం కూయా కలిగింది. మాములుగా నేరం చేయని వాడి మీద కంటే, అవకాశం దొరికి కూడా నేరం చేయని వాళ్ళ మీద గౌరవం కలగడానికి అవకాశమెక్కువ కదా?
నేను రూమ్ లో అడుగు పెట్టగానే "భలే వారండీ మీరు! మనకింత వరకూ ఒకరి పెర్లోకరిక్కూడా తెలియవు. ఆఫ్ కోర్స్ మీ పుస్తకాల మీద ఉన్న పేరును బట్టి రాజారామ్ పేరని ఊహించాను. అయితే నాపేరు మీకెలా తెలుస్తుంది? అందులోనూ ముక్కూ, ముఖం తెలియని నన్ను మీ రూమ్ మేటుగా చేర్చుకున్నారు. కనీసం పేర్లైనా అడగోద్డా?" అన్నాడతను.
నేను నవ్వాను - "పేరులో ఏముందండీ? అయినా ముక్కూ,ముఖం తెలియని మీ పేరు చెప్పినా, అది నిజమిని గ్యారంటీ ఏముంది? ఏదైనా నమ్మకంలో వుంటుంది. కానీ వ్యవహారాలకు పేరు చాలా అవసరం కాబట్టి, పేరు చెప్పండి" అన్నాను.
"నా పేరు రంగారావు. ' అతను ఇంకా ఏదో చెప్పబోతూ. గుమ్మం వైపు చూసి ఆగిపోయి "రా రంగమ్మ" అన్నాడు. నేను ఆశ్చర్యంగా అటు వైపు చూశాను.
ఆమె రంగమ్మ. ఆ వీధిలో చాలామంది ఇళ్ళల్లో పని చేస్తూ వుంటుంది. పని బాగానే చేస్తుంది, కానీ ఆమెకు పనికి మించిన నోరు కూడా వుంది. తరచుగా ఆమె వాగ్ధాటిని నేను వినడం సంభవించింది . ఆ రంగమ్మతో ఇతగాడి కేలా పరిచయం....?
రంగమ్మ బెదురూ బెదురుగా నావంక చూస్తూ ముందడుగు వేసింది. కొద్దిగా గుప్పిట ముందుకు చాచింది. ఆమె గుప్పిట మూసి ఉంది. గుప్పిట్లో చాలా ముఖ్యమైన వస్తువువేదో ఉన్నదన్నట్లుగా ఆమె చేతులు వణుకుతున్నాయి.
"వివరాలు సంపాదించేవా రంగమ్మా!" అన్నాడు రంగారావు.
రంగమ్మ గుప్పిట తెరచుకుంది. అందులో ఉండలా చుట్టుకుని ఉన్న కాగితం ఒకటి ఉంది. రంగారావు స్వయంగా లేచి ఆ కాగితాన్నందుకుని "మరి నువ్వు వెళ్ళవచ్చు" అన్నాడు. అలా అంటూనే ఆమెకు ఒక పదిరూపాయల నోటు కూడా అందించాడు. ఆమె ఆ కాగితాన్నందుకుని "వస్తాను బాబూ" అని వెళ్ళిపోయింది.
నాకు పరిస్థితంతా అయోమయంగా ఉంది రంగమ్మ ప్రవర్తన చూస్తె ఏదో తప్పు చేసిన దానిలా ఉంది. ఆ చేసిన తప్పు ఆమె ఇచ్చిన కాగితంలో ఉందా?" ఆ కాగితం విలువ పది రూపాయలా?" అందులోని విశేషాలేమిటి?
అతను కాగితం విప్పి, ఏదో చదువుకుని సంతృప్తిగా నవ్వాడు. ఆ నవ్వు సమ్మోహనస్త్రంలా లేదు. అదో రకంగా ఉంది. ఆతని చేతిలో కాగితం నలిగి డస్ట్ బిన్ లో పడింది. అతని దృష్టి అప్పటికి నామీద మళ్ళింది. "రాజారావు గారూ!" నేను చేయబోతున్న అక్రమసంపాదన మీ గదిలో. మీవంటి అమాయకుల సాహచర్యంలో ప్రారంభిస్తున్నందుకు మీరు నన్నెంతైనా క్షమించాల్సి ఉంటుంది. నా వ్యవహారం మీ మెదడు కు బాగా పదును పెడుతున్నదనుకుంటాను. కానీ నా గురించి మీరాట్టే ఆలోచించకండి. అప్పుడే మనిద్దరం కలసి కొంతకాలం పాటు ఉండడం సాధ్యాపడుతుంది." అన్నాడతను.
నేనేమీ మాట్లాడలేదు. నిజంగానే అతని గురించి ఆలోచనలతో నా మెదడు వేడెక్కిపోతుంది. నేనలాలోచిస్తుండగానే అతను బాత్ రూమ్ కి వెళ్ళాడు.
అతనలా బాత్ రూమ్ కి వెళ్ళగానే నేను డస్ట్ బిన్ వైపు నడిచాను. అందులోంచి అతగాడు పడవేసిన కాగితపుటుండ తీసి విప్పాను . ఏదో తప్పు చేస్తున్నట్లు- నా కాళ్ళూ, చేతులు వణుకుతుండగా అందులోని వివరాలు చదివాను. అందులో రెండే రెండు వాక్యాలు పొడిగా ఉన్నాయి. "శారదకు గుండెల మీద ఒక పెద్ద పుట్టుమచ్చ. బొడ్డుకు క్రింద కుడిపక్కగా కొట్టోచ్చినట్లు కనపడే కురుపు మచ్చ , సరళకు కుడి తోడకూ మోకాలికి మధ్యలో చిటికెడు వ్రేలి పొడగున ఎర్రటి మచ్చ.."
ఈ మచ్చల వివరాలేమిటో నాకు అర్ధం కాలేదు.
ముందు ఆ కాగితాన్ని మళ్ళీ ఉండగా చుట్టి డస్ట్ బిన్ లో పడవేశాను. తర్వాత మంచం మీద వాలి అలోచించసాగాను. ఎవరీ శారద, సరళ ? వీళ్ళకున్న మచ్చల వివరాల నెవరు సంపాదించారు? వాటి వలన ప్రయోజనామేమిటి? ఆ కాగితం మీద దస్తూరీ ఎవరిది? దస్తూరీ అంత అందంగా లేకపోయినా - రంగమ్మ వంటి మనిషి రాసినట్టుగా లేదు. ఈ చీటిని రంగమ్మ ద్వారా ఎవరో పంపి ఉండాలి. ఆ పంపినదేవరై ఉంటారు?
నా బుర్ర అంతకంతకూ మరీమరీ వేడెక్కిపోసాగింది. ఏమైనాసరే రంగారావు నడిగి వివరాలు తెలుసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. లేకుంటే మరే ఇతర విషయాల మీదకూ నా దృష్టి మళ్లేలా లేదు.
రంగారావు స్నానమయింది. అతను లోపలకు వచ్చి - "మీ అనుమతి లేకుండానే మీ సబ్బు , తువ్వాలు వాడుతున్నాను." అన్నాడు. "దాందేముంది . ఇద్దరము రూమ్ మెట్లమైనాక మీ మా భేద ఎక్కడుంది-" అన్నాను నేను నవ్వుతూ.
అతను బట్టలు త్వరగా వేసుకుని, నాకేసి చూసి - "వస్తాను మేస్టారూ! జేబులో బొత్తిగా పది రూపాయలు ఉన్నాయి. కాస్త సంపాదన చేయాలి" అన్నాడు.
నేను లేచి నిలబడ్డాను. "నాకు మీతో పాటు రావాలనుంది.
అతను ఒక్క నిముషం అలోచించినట్లు కనబడ్డాడు. ఆతర్వాత చిన్నగా నవ్వి, "సరే, మీ ఇష్టం, కానీ తర్వాత మీరు విచారించకూడదు. మీరు పెద్ద మనుషులు నేను వ్యవహరించ బోయేది ఆడవాళ్ళతో మాట్లాడబోయేది . అంత సంస్కారవంతమైన భాష కాదు. ముందుగానే చెప్పేస్తున్నాను ...." అన్నాడు.
ఇతనలా అంటూన్న కొద్దీ నాలో కుతూహలం పెరిగింది. "పరవాలేదు. ఈ ఒక్కసారికి వచ్చి నచ్చకపోతే మరి రానులెండి " అన్నాను.
'అయితే ఒక్క మనవి. మీరు చెవిటి వాడిలా నటించాలి. లేకపోతే నా పని జరుగదు."
