"నేనెవర్నీ వదిలిపెట్టను. విడిపించుకొవాలి" అన్నాడు పులిరాజు. అతడి మాట పూర్తయ్యేసరికి ప్రభాకర్ కుడి చేయి ముందుకు సాగింది.
పులిరాజు కడుపులో పిడిగుద్దు పడింది.
"అతడు చటుక్కున నేలమీద పడ్డాడు.
'పద్మా -- నువ్వు సుజాతను తీసుకొని వెళ్ళు" అన్నాడతను.
సుజాత చటుక్కున బయటకు వచ్చింది. పద్మ, ఆమె కలిసి అక్కణ్ణించి బయల్దేరారు.
"ఏం చేశాడు వాడు ?' అంది పద్మ.
"ఏమీ చేయలేదు...." అంది సుజాత.
ఇద్దరొకర్నొకరు గుద్దుకుంటున్న చప్పుళ్ళు వినబడుతున్నాయి వారికి.
"ఫరవాలేదు , నిజం చెప్పు . నేనెవరికి చెప్పనులే" అంది పద్మ.
'పద్మా -- నీకు చాలా చాలా థాంక్స్ - నేను తప్పించుకుని బైట పడతాననుకోలేదు. నా గుండె లింకా అదురుతున్నాను...." అందు సుజాత.
"అదిసరే -- ముందేం జరిగిందో చెప్పు" అంది పద్మ.
"వాడు నన్ను లోపలకు తీసుకుని వెళ్ళాడు. కుర్చీలో కూర్చోమన్నాడు. కూర్చున్నాను. నా అందాన్ని పొగిడాడు నా శరీరంలో ఎక్కడెక్కడ ఆకర్షణ ఉందో చెప్పాడు. వాడి మాటలు నాకు నచ్చలేదు...." అంది సుజాత.
"ఏం మాట్లాడాలో చెప్పు...."
"ఛీ -- అంతా సెక్సు ...." అంది సుజాత.
"ఉత్త మాటలేనా?" అంది పద్మ.
"అరగంటదాకా వంటి మీద చేయి వేయనని మాటిచ్చాడు...."
"గూండా గాళ్ళ క్కూడా నిదానముంటుందన్నమాట.... మీ అన్నయ్యకే ననుకున్నాను....' అంది పద్మ.
"మా అన్నయ్య కేమయింది?" అంది సుజాత.
జరిగింది చెప్పింది పద్మ.
సుజాత మౌనంగా వింది.
అప్పటి కిద్దరూ యిల్లు చేరుకున్నారు.
ఇంట్లో జానకి, విశ్వం వారిని చూసి ఏంతో సంతోషించారు. అఘయిత్యమేమీ జరగలేదని జానకి బాగా సంబరపడింది. ఆమె కూతుర్ని వేరే గదిలోకి తీసుకుని వెళ్ళింది. రహస్యంగా విశేషాలడిగి తెలుసుకుందామని.
"పద్మా! ఏం జరిగింది ?" అన్నాడు విశ్వం.
"నువ్వు చేతకానివాడివని తెలిసింది గదా! ప్రభాకర్ దగ్గిరికి వెళ్లాను ...." అంది పద్మ.
"ప్రభాకర్ అంటే? అనడిగాడు విశ్వం.
"నీకు తెలుసు.....' అంది పద్మ.
విశ్వానికి తెలుసు.
పద్మ రంగనాధం బంధువులమ్మాయి. బియ్యే చదువుతోంది. వాళ్ళది పల్లెటూరు కావడం వల్ల రంగానాధం ఇంట్లో ఉండి చదువుకుంటోంది. తలిదండ్రులు బాగా ఉన్నవాళ్ళు . ఆమెకు బాగా డబ్బుంది. నెలకు అయిదారు వందలైనా ఖర్చు పెడుతుంది.
పద్మనసలు హాస్టల్లో పెడదామనుకున్నారు తలిదండ్రులు. హాస్టల్లో భోజనం బాగుండదనీ -- అక్కడ చెడు సావాసాలు పట్టే అవకాశముందనీ వారు భయపడ్డారు. రంగనాధం వారికి దగ్గర బంధువే కాక అయన కూతురు సుజాత , పద్మ ఒకే క్లాసు చదువుతున్నారు.
అన్నిటికీ మంచి పద్మను విశ్వానికిచ్చి పెళ్ళి చేయాలని అటూ ఇటూ కూడా అనుకుంటున్నారు. కానీ ఇద్దరినీ భిన్న దృవాలు.
ఒకే యింట్లో ఉంటే ఇద్దరికీ మధ్య అవగాహన, ఆకర్షణ ఏర్పడవచ్చునని యిరు పక్షాలవారూ అనుకున్నారు. అది పద్మకూ, విశ్వానికి కూడా తెలుసు.
కానీ పద్మకు ప్రభాకర్ తో పరిచయ మైంది.
ప్రభాకర్ చురుకైన యువకుడు. ప్రైవేట్ కంపెనీలో నెలకు రెండు వేలు జీతం మీద పనిచేస్తున్నాడు. అతడికి అయిన వారెవ్వరూ లేరు. ఒకసారి సినిమాహాలు దగ్గిర పద్మనెవరో కుర్రాళ్ళేడిపిస్తుంటే ప్రభాకర్ కలగజేసుకున్నాడు. ఒకణ్ణి కొట్టాడు కూడా.
అప్పట్నించీ యిద్దరికీ పరిచయమయింది.
తరచుగా వారిరువురూ కలుసుకుంటూ ఉండేవారు.
ఇదీ ఇంట్లో తెలిసి జానకి పద్మను హెచ్చరించింది. పద్మ లెక్కచేయలేదు. దాంతో ఆమె తలిదంద్రులకీ విషయం తెలియబరచడం జరిగింది. వాళ్ళు పద్మను మందలించి వెళ్ళారు. తర్వాత నుంచి పద్మ ప్రభకర్నీ కలుసుకోనటం తగ్గించింది.
"ప్రభాకర్నేందుకు కలుసుకున్నావు?"
"నీ చెల్లెల్ని రక్షించడానికి ...."
"ఇది రక్షించడం అనిపించుకోదు. నా చెల్లెలు కాసేపు పులి రాజింట్లో ఉందన్న విషయం ప్రభాకర్ ద్వారా ఊరంతా ప్రచారమవుతుంది. దాని బ్రతుకు నాశనమవుతుంది ...." అన్నాడు విశ్వం.
"నీ చెల్లెలు పులిరాజు నుంచి రక్షించబడిందని నీకు సంతోషంగా లేదా ?' అంది పద్మ.
"ప్రపంచంలో తప్పులెందరో చేస్తారు. తప్పు చేయడం తప్పు కాదు. తప్పును రహస్యంగా ఉంచుకోవటం తప్పు" అన్నాడు విశ్వం.
'అయితే ఇప్పుడు నువ్వు ప్రభాకర్ వస్తే థాంక్స్ చెప్పవా?"
"థాంక్స్ కంటే ముందు -- రిక్వెస్టు చేస్తాను. మొత్తం విషయమంతా రహస్యంగా ఉంచమని !"
"నీకా శ్రమ లేదులే! నేను ముందే ప్రభాకర్ కి చెప్పాను ...."
పద్మ యింకా ఏదో అనబోతుండగా ఇంటి ముందు మోటారు సైకిలు ఆగిన చప్పుడయింది.
"ప్రభాకర్ వచ్చినట్లున్నాడు...." అంది పద్మ.
విశ్వం తడబడ్డాడు. ఇబ్బందిగా లేచాడు.
పద్మ, విశ్వం గుమ్మంలోకి వెళ్ళేసరికి ప్రభాకర్ మెట్లెక్కుతున్నాడు. పద్మను చూసి -- "ఏం జరిగిందో తెలుసా?" అన్నాడు.
"పులిరాజు కొత్త ప్రతిజ్ఞ లేమైనా చేశాడా ?" అంది పద్మ.
"నన్ను లోపలకు రానీయ్ ...." అన్నాడు ప్రభాకర్.
ముగ్గురూ లోపలకు వెళ్ళారు.
"ఏం జరిగింది ?" అంది పద్మ.
"విశ్వం గారూ -- మీ చేల్లెల్నోకసారి పిలవండి ...."
"ఎందుకు ?" అన్నాడు విశ్వం.
"నేనామెను రక్షించాను. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుడించి రక్షిస్తేనే అదో గొప్ప విశేషమయింది. నేను మీ చెల్లాయిని పులిరాజు నుంచి రక్షించాను. అది సామాన్య విశేషం కాదు..... "
'అయితే ?" అన్నాడు విశ్వం.
"ఆమె నాకు కనీసం థాంక్సయినా చెప్పుకోదా?"
అప్పుడే అక్కడకు వచ్చిన సుజాత ఆ మాటలు వింది. ఆమె చటుక్కున ప్రభాకర్నీ సమీపించి అతడి పాదాలకు నమస్కరించి -- "మీకు థాంక్స్ చెప్పుకోవడం కాదు, మీ పోటోను దేవుడికిలా పూజించుకుంటాను. మీరు నన్ను రాక్షసుడి బారి నుండి కాపాడారు" అంది.
"మీకోరిక తీరుతుంది. త్వరలోనే మీరు నా ఫొటోకు మాల వేయవచ్చు -" అన్నాడు ప్రభాకర్.
'అంటే?" అంది పద్మ.
"నేను పులిరాజును చంపేశాను....." అన్నాడు ప్రభాకర్.
ఒక్కసారి అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు.
"ఏమిటి?" అంది పద్మ తేరుకుని.
'అప్పుడంతకు మించి వేరే దారి లేకపోయింది. నేను పులిరాజును చంపకపోతే -- నా ప్రాణాలు పోయుండేవి. ఇద్దరిలో ఒకరు మాత్రమే మిగలాలన్నప్పుడు - నేనే మిగలడం నాకూ ప్రపంచానికీ కూడా మంచిది గదా --" అన్నాడు ప్రభాకర్.
'అయితే ఇప్పుడెం జరుగుతుంది?" అంది పద్మ.
"ఏం జరుగుతుందో నాకు తెలియదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే లోగా నేను స్వయంగా వెళ్ళి పోలీసులకు లోంగిపోవాలనుకుంటున్నాను...." అన్నాడు ప్రభాకర్.
విశ్వం కంగారుగా - "ఆ పని చేయకండి " అన్నాడు.
'భయపడకండి - నేను మీ చెల్లాయి గురించి పోలీసులకు చెప్పను " అన్నాడు ప్రభాకర్.
విశ్వం ఇబ్బందిగా నవ్వి - "అది కాదు , దీనికి వేరే ఉపాయమేమీ లేదా?" అన్నాడు.
"పులిరాజు లాంటి వాణ్ణి చంపి తప్పు చేసినవాడిలా దాక్కోలేను. నేనేం చేశానో పోలీసులకు చెప్పుకుంటాను. అది నేరమో, కాదో వాళ్ళు నిర్ణయిస్తారు....."
"హత్య చేస్తే నేరం కాదని వాళ్ళేలాగంటారు?" అన్నాడు విశ్వం.
"రాముడు రావణుడిని చంపాడు. శ్రీకృష్ణుడు కంసుడిని చంపాడు. అవి హత్యలా?" అన్నాడు ప్రభాకర్.
'అవి హత్యలో కాదో నాకు తెలియదు. కానీ రాముడు, కృష్ణుడు మనకు దేవుళ్ళు -" అంది సుజాత.
"ఆ మాట గుర్తుంచుకోండి -- సెలవు " అని వెళ్ళిపోయాడు ప్రభాకర్.
4
"ప్రభాకర్ అరెస్టయ్యాడు. మనమేదైనా చేయాలి!" అంది పద్మ కంగారుగా.
"మనమేం చేయగలం ?" అన్నాడు విశ్వం.
"లాయరు సీతారాంగార్ని కలుద్దాం."
"ఎందుకు ?"
"క్రిమినల్ లాయరు గా అయన కీ ఊళ్ళో ఎదురు లేదు...."
"కానీ మనకీ ప్రభాకర్ కీ ఏమిటి సంబంధమని ఆయనడిగితే ?"
పద్మ చిరాగ్గా అతడి వంక చూసి -- "నీకు కృతజ్ఞత లేదు" అంది.
