నలుగురిలో ఒకడు
వసుంధర
ఇనస్పెక్టరు గవర్రాజుకు ఆ వ్యక్తీ అనుమానాస్పదంగా కనిపించాడు. బయటకు వెళ్ళేటప్పుడతను తన్నెవరైనా పరిశీలిస్తున్నారా, తనవెంట ఎవరైనా పడుతున్నారా అన్నట్లు అటూ ఇటూ చూసుకుంటూ అందర్నీ వేయి కళ్ళ కనిపెడుతూ మరీ వెళ్ళాడు.
అది హోటల్ చంద్రవంక. ఆ ఊళ్ళో కాస్త చెప్పుకోదగ్గదే. ఆ హోటల్లో అనుమానించదగ్గ వ్యక్తులెవరో బస చేశారని ఇన్ స్పెక్టర్ గవర్రాజుకు సమాచార మండింది. అతనిప్పుడు మఫ్టీలో హోటల్ కు వచ్చాడు. గంటనించి ఫలహారం చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.
అప్పుడే వెళ్ళిన వ్యక్తీ గురించి కౌంటర్లో అడిగాడు గవర్రాజు. అతనీ హోటల్లోనే బస చేశాడని పేరు విశ్వనాధం అనీ వృత్తి డిటెక్టివ్ అనీ గవర్రాజుకు సమాధానం వచ్చింది.
డిటెక్టివ్ విశ్వనాధం గురించి గవర్రాజు అంతో ఇంతో విని ఉన్నాడు. అతను చాలా వ్యవహరాలాను రహస్యంగా పరిశోదిస్తున్నాడనీ - వృత్తిలో అఖండుడనీ గవర్రాజు విన్నదాని కిప్పటికీ విశేషం వ్యతిరేకంగా కనబడింది. బహిరంగంగా తనపేరు వ్రాయడమే కాక- ప్రతివాడినీ ఆకర్షించే విధంగా కూడా ప్రవర్తిస్తాడు. ఇందులో ఏదైనా మర్మముందా? లేక ఈ డిటెక్టివ్ విశ్వనాధం వేరా?" లేక ఎవరైనా ఇలా మారు పేరు వ్రాసుకుని ఇక్కడ ప్రవేశించారా?
ఎంత పరిశీలించినా గవర్రాజు కక్కడ విశేషమేమీ అద్ర్యోతకం కాలేదు. అతను నెమ్మదిగా అక్కణ్ణించి బయట పడి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. స్టేషన్లో అతని కోసం ఒక వ్యక్తీ ఎదురు చూస్తున్నాడు. అతను చంద్రవంక హోటల్లోంచి నలుగురూ అనుమానించే విధంగా బయటకు వెళ్ళిన వ్యక్తి.
"నన్ను నేను పరిచయం చేసుకోవాల్సుంది. నాపేరు విశ్వనాధం . కుతూహలం కొద్దీ డిటెక్షన్ చేస్తున్న కారణంగా డిటెక్టివ్ విశ్వనాధాన్నయ్యాను. చంద్రవంక హోటల్లో అనుమానించదగ్గ వ్యక్తులున్నారని నేనే మీకు ఫోన్ చేశాను" అన్నాడు విశ్వనాధం.
ఇన్ స్పెక్టర్ గవర్రాజు చేయజాపాడు. ఇద్దరూ హాండ్స్ షేక్ చేసుకున్నారు.
'ఇప్పుడు నేనెందుకు వచ్చానంటే - చంద్రవంక హోటల్లో దిగిన నలుగురు విదేశీ గూడచారులు ఆచూకీ నాకు తెలిసింది. వాళ్ళు సామాన్యులుకారు. గూడచారి వృత్తిలో ఆరితేరినవారు. అటువంటివారిని రహస్యంగా మాబోటి వ్యక్తీ వెన్నడితే అంత రహస్యంగానూ అంతమయే ప్రమాదముందనిపించింది. వారి రహస్యాన్ని బయలు చేయడం కూడా కష్టం. అందుకే వాళ్ళకు తెలిసే నేనెక్కడ ప్రవేశించాను. వాళ్ళు నావెంట పడడం ద్వారా బయట పడగలరని నాకు నమ్మకముంది. కానీ వాళ్ళు అంచనాకు విరుద్దంగా ఇంతవరకూ మసిలారు. ఇప్పుడే ముగ్గురు మాయమైపోయారు. నాలుగోవాడింకా ఉన్నాడు. అతనిది రూం నెంబర్ నలభై ఆరు" అన్నాడు విశ్వనాధం.
"అయితే నేనేం చేయాలి?" అన్నాడు గవరాజు.
"నేనొక చేతకాని డిటెక్టివ్ నని వాళ్ళను బాగా విశ్వాసం కలిగింది. వాళ్ళు నన్ను పట్టించుకోవడం మానేశారు. ముగ్గురు దాటిపోయినా నాలుగో వాడింకా ఉన్నాడు. మీరిప్పుడు హటాత్తుగా రూమ్ నెంబర్ 46 పైన దాడిచేస్తే - వాడు పట్టుబడవచ్చుననీ కనీసం కొన్ని ఋజువులు దొరకవచ్చు ననీ నా ఆశ...."
"ఏమీ దొరక్కపోతే ...."
"పోలీసు దిపార్టు మెంటు కదో పెద్ద తప్పు కాదు. క్షమార్పణ చెప్పుకోవచ్చు . కానీ రుజువు తప్పక దొరుకుతుందని నా అనుమానం...."
గవర్రాజు క్షణం అలోచించి - "మనమిప్పుడు హడావుడిగా అక్కడికి బయల్దేరితే వాడు పాదిపోతాడేమో...అన్నాడు.
'అందుకొక ఉపాయం ఆలోచించే ఉంచాను...." అన్నాడు విశ్వనాధం నవ్వుతూ -- "రూం నెంబర్ 49 లో స్నేహితుడోకతను దిగాడు. అతనందులో దిగి అడ్వాన్సు పే చేసి గదికి వేరే తన తాళం వేసుకుని - ఏ పరిస్థితుల్లో నూ తన తళాన్నేవరూ తెరవడానికి ప్రయత్నించరాదనీ హోటల్ వారిని హెచ్చరించి బయటకు వెళ్ళాడు. అతడు వెళ్ళి వారం రోజులయింది. అంతవారకూ పత్తా లేడు. తాళం తీయడమూ, మానడమూ అని తొమ్మిది వరకూ చూసి మేనేజర్ సతమతమవుతుంటే - పోలీసులకు ఫోన్ చేసి- వాళ్ళ సమక్షంలో గది తాళం తీయించమనీ -- అలా చేస్తే తర్వాత ఏ గొడవలూ ఉండదనీ నేనో ఉచిత సలహా పారేశాను. ఈ రోజు అక్కడికి పోలీసులు వస్తారని చాలామందికి తెలుసు రూం నెంబరు 46 మనిషికీ తెలుసు. అందువల్ల ఎవ్వరూ పోలీసులను చూసి చలించరు."
ఇన్ స్పెక్టర్ గవర్రాజు అభినందనపూర్వకంగా విశ్వనాధం వంక చూసి -- "మీరిన్ని ఏర్పాట్లు చేసేక అడ్డే ముంది ?' అంటుండగా టెలిఫోన్ మ్రోగింది. "హలో!" అన్నాడు గవర్రాజు.
"దిసీజ్ మేనేజర్ చంద్రవంక స్పీకింగ్ ...." అంది అవతలి కంఠం.
2
పోలీసుల హడావుడికి కాబోలు -- రూం నెంబర్ 46 తలుపులు తెరచుకున్నాయి. ఒక వ్యక్తీ బయటకు తొంగి చూశాడు.
ఇన్ స్పెక్టర్ గవర్రాజు రూం నెంబర్ 46 వద్ద ఆగి - చటుక్కున ఆ గదిలో ప్రవేశించాడు.
"సర్, ఇది 46. మనం వెళ్ళవలసింది 49 - " అన్నాడు మేనేజర్ కంగారుగా.
"తెలుసు, కానీ 46 లో అనుమానాస్పదమైన వ్యక్తులున్నారని మాకు సమాచారం వచ్చింది. పనిలో పనిగా అది కూడా పూర్తీ చేసుకు వెడతాము...." అన్నాడు గవర్రాజు.
గదిలోని వ్యక్తీ కోపంగా చూసి "ఏమిటీ మీరనేది అన్నాడు.
"ఏమీ లేదు. ఈ గది సోదా చేస్తాం . మావల్ల తప్పంటే మీ క్షమాభిక్ష అర్దిస్తాం. మీవల్ల తప్పుంటే బహుశా అని ఆపి "ఊ....క్విక్ ...." అన్నాడు గవర్రాజు.
ఆ గదిలో అనుమానించవలసిన వస్తువులేమీ లేవు. అన్నీ అవసరానికి వాడుకునే వస్తువులే ఉన్నాయి. గదిలో ఉన్న సూట్ కేసు లో బట్టలు తప్ప ఏమీ లే వు. గవర్రాజు నిరుత్సాహ పడ్డాడు. ఆఖరి ప్రయత్నంగా అతనా వ్యక్తిని సోదా చేశాడు. పరిశీలనలో రెండు వింత విషయాలు బయట పడ్డాయి. అతని జేబులో రెండు ఉత్తరాలున్నాయి. ఉత్తరంలో రెండే రెండు వాక్యాలున్నాయి.
"మన మనిషిని ఆ లాబొరేటరీ లో త్వరగా ప్రవేశపెట్టి, వీలైనంత త్వరగా పరిశోధన వివరాలు కూపీ లాగాలి."
ఉత్తరం ఎవరు ఎవరికి వ్రాశారో తెలియదు. రెండు ఉత్తరం పోస్టు చేయబడిన ఏదో ఉత్తరానికి నకలు కాపీ. భువనేశ్వర్లో ఉన్న లాబరేటరీలో ఉద్యోగంకు వచ్చిన ఒకతన్ని అర్జంటుగా ఉద్యోగంలో ప్రవేశించమని ఆదేశిస్తూ వ్రాసిన ఉత్తరమది. ఇది కూడా ఎవరు ఎవరికి వ్రాశారో తెలియదు కానీ -- ఉత్తరం రెండ్రోజుల క్రితం పోస్టయింది.
ఆ వ్యక్తీ మీద అనుమానం బలపడగానే గవర్రాజు పరిశీలనా దృష్టి మరింత సునిశితమైంది. ఆ విధంగా అతనికి ఆ వ్యక్తీ చేతికి ఉన్న వాచీ ఒక చిన్న సైజు వైర్ లెస్ ట్రాన్సిస్టర్ అన్న విషయాన్ని గుర్తించాడు. గుర్తించిన రెండు నిమిషాల్లో ఆ వ్యక్తీ కెవ్వున అరిచి నేల మీద పడిపోయాడు. క్షణాల మీద అతని ప్రాణాలు పోయాయి.
"ఒక గూడచారి అంతమై పోయాడు...." అనుకున్నాడు గవర్రాజు. ఆతగాడు ప్రాణాలతో పట్టుబడి ఉంటె చాలా ప్రయోజనకారిగా ఉండేది తమకు. అతనెలా మరణించినదీ తర్వాత తెలుస్తుంది. కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు.
చంద్రవంక హోటల్ మేనేజర్ ఆశ్చర్యంగా అన్నీ చూస్తున్నాడు. "పదండి -- 49 కి వెడదాం" అన్నాడు గవర్రాజు.
నిజానికి 49 గది తెరవడానికి పోలీసుల సమక్షం అవసరం లేదు. కానీ అది కావాలని జరిగినట్లు హోటల్ మేనేజర్ కు తెలియకూడదనే ఉద్దేశ్యంతో అతను అక్కడికి వెళ్ళాడు. 49 వ గది తాళం అతని సమక్షంలో బద్దలు కొట్టబడింది. అందులో ఎవ్వరూ లేరు. ఏమీ లేవు. అద్దెకివ్వబడని గదులేలా ఉంటాయో అదలాగుంది.
పోలీస్ స్టేషన్లో గవర్రాజును విశ్వనాధం కలుసుకొన్నాడు.
3
"నా పేరు విశ్వనాధం. ప్రయివేటు డిటెక్టివ్ ...." అన్నాడు విశ్వనాధం.
డాక్టర్ ముఖర్జీ --"లాబొరేటరీ డైరెక్టర్ గారు ప్రస్తుతం ఊళ్ళో లేరు. వారం రోజుల దాకా రారు. ప్రస్తుతం నేను ఇన్ చార్జిగా ఉంటున్నాను. చేయగలిగింది చేస్తాను. చెప్పదల్చుకున్నది చెప్పండి...." అన్నాడు.
"ఇటీవల మీ లాబొరేటరీకి కొత్త రిక్రూట్ మెంట్లేమైనా జరిగాయా?"
"చాలా జరిగాయి -- ఏం?"
"సైంటిఫిక్ అసిస్టెంట్లు పోస్టు లేమైనా ఫిలప్ చేశారా...."
