"అన్నాను కానీ అయనకా అదృష్టం లేదు" అన్నాడు ఉంగరాల జుట్టు.
అతను వెళ్ళిపోయాక వీరభద్రం తల్లి- 'అతన్ని మనం అపగలిగితే బాగుండేది! అసలెందుకు వచ్చినట్లు? ఎందుకు వెళ్లి పోయినట్లు ?" అంటూ నిట్టూర్చింది.
తల్లి నిట్టుర్పులో ఉంగరాల జుట్టు పై ఒక ప్రత్యెక మైన ఆసక్తిని వీరభద్రం గుర్తించాడు. ఆ విషయమై అడిగి ప్రయోజనం లేదనిపించి ఊరుకున్నాడు.
6
తలుపు తీయగానే ఎదురుగా నిలబడ్డ పోలీస్ కానిస్టేబుల్ని చూసి వీరభద్రం గతుక్కుమని-- "ఇది సాంబశివరావు గారిల్లు-" అన్నాడు.
"తెలుసు -" అన్నాడు కానిస్టేబులు.
'అయన యింట్లో లేరు -" అన్నాడు వీరభద్రం.
"ఉండరని తెలుసండి -' అన్నాడు కానిస్టేబులు.
వీరభద్రం ఆశ్చర్యంగా 'అయితే ఎందుకొచ్చినట్లు ? ఎవరితో పని?" అన్నాడు.
"మీరెవరో తెలుసుకోవోచ్చా ?" అన్నాడు కానిస్టేబులు.
"నేను సాంబశివరావు గారి అబ్బాయిని -"
వెంటనే కానిస్టేబులు ముఖం దీనంగా మారిపోయింది - "మీకీ వార్త ఎలా అందజేయాలో తెలియడం లేదు -'అన్నాడు.
"ఏ వార్త?"
"మీ నాన్నగారు హత్య చెయ్యబడ్డారన్న వార్తా!"
"ఏమన్నావ్ ?" అన్నాడు వీరభద్రం ఉలిక్కిపడి.
"మీ నాన్నగారు హత్య చేయబడ్డారు - " అన్నాడు కానిస్టేబులు.
'అమ్మా!" అంటూ గావుకేక పెట్టాడు వీరభద్రం . ఆ కేకకు యింట్లోంచి వీరభద్రం తల్లి, చెల్లెలు కూడా పరుగెత్తుకు వచ్చారు.
"ఏం జరిగిందిరా?" అంది వీరభద్రం తల్లి.
"నువ్వు చెప్పు -" అన్నాడు వీరభద్రం కానిస్టేబులు తో.
"మీ కీ వార్తా యెలా అందజేయాలో తెలియడం లేదు--...." అన్నాడు కానిస్టేబులు మళ్ళీ మొదటికి వస్తూ.
వీరభద్రం విసుగ్గా - " ఇతను చాదస్తుడు. నాన్నగారు హత్య చేయబడ్డారుట-" అన్నాడు. అతను మాట పూర్తీ చేయగానే వీరభద్రం తల్లి పెద్ద కేకపెట్టి క్రింద కూర్చుండి పోయింది. ఆవిడ పక్కనే కూతురు కూర్చుండి పోయింది.
"ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారండీ ?" అన్నాడు కానిస్టేబులు.
వీరభద్రం ఈ లోకంలోకి వచ్చి - "ఇంకెవరూ లేరు కానీ ఏం జరిగిందో వివరంగా చెప్పు ?" అన్నాడు అతని గొంతు రుద్దమై పోతోంది.
"చంద్రావతి యింట్లో హత్య జరిగిందండి. ఎవరో గుండెల్లో బలంగా పొడిచి చంపారు. చంద్రావతి స్పృహ లేకుండా పడి వుంది...."
"చంద్రావతి యింట్లోనా?" అంది వీరభద్రం తల్లి. మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోటికోడలు నవ్వినందుకు అన్నట్లు భర్త హత్య చంద్రావతి యింట్లో జరగడం ఆవిడకు చాలా బాధ అనిపించింది.
సాంబశివరావు లక్షాధికారి కావచ్చు కానీ అయన భార్యను అట్టే సుఖ పెట్టడం లేదు. భర్త సంసార పక్షంగా ఉండాలన్న ఆమె కనీసపు కోర్కె తీరడం లేదు.
ఆయనకు తాగుడు, వ్యభిచారం రెండూ బాగా యెక్కువగా ఉన్నాయి. తన అలవాట్లను అయన ఏదో ఒక స్థలానికి పరిమితం చేసుకోకుండా - యింట్లో పిల్లల యెదుట కూడా మానుకునేవాడు కాదు. తాగి యింటికి వచ్చిన తండ్రిని చూసి యెదిగిన పిల్లలు ఏమనుకుంటారో నని ఆవిడ భయం. తాగుడు మైకంలో అయన యెన్నో పర్యాయాలు పిల్లలు వింటున్నారన్న ధ్యాసయినా లేకుండా తనకూ చంద్రావటికీ మధ్య జరిగిన శృంగార సన్నివేశాలు కొన్ని వర్ణించి చెబుతాడు.
ఈ విధంగా జరగడం యిష్టం లేక లక్షమ్మ పిల్లల్ని చాలా అదుపులో వుంచింది. పిల్లలకు తండ్రి దగ్గర చేరిక తక్కువ వుండేలా చేసింది. తండ్రికి వాళ్ళు దరిదాపుల్లో వుండకుండా జగ్రత్తపడేది. అందువల్ల పిల్లలకు తండ్రి అంటే భయమూ, జుగుప్సా భావమూ రెండూ వున్నాయి. కాలక్రమేణా వారికి తండ్రి అంటే అసహ్యమూ తల్లి అంటే భక్తీ, ప్రేమ - పెరిగాయి. లక్ష్మమ్మ కృషి ఫలించి పిల్లల ప్రవర్తన, అభిరుచులు పై సాంబశివరావు ప్రభావం పడలేదు.
సాంబశివరావు బలహీనత లైతే వుండవచ్చు గానీ అందువల్ల భార్య బిడ్డలకు ఆర్ధిక పరమైన అన్యాయం జరగడం లేదు. సంసారం చూడ్డానికి పచ్చగానే వుంది. ఆయనకున్న డబ్బు కారణంగానూ, అయన సంసారం పచ్చగానే కొనసాగుతున్నట్లు కనిపించడం వల్లనూ లక్ష్మమ్మ నలుగురిలోనూ బాగానే తలెత్తుకు తిరగ్గలుగుతోంది. చంద్రావతితో ఆయనకున్న పరిచయం లో మెరిగిన రహస్యమే. అయినా ఆవిడ ఎదురుగా ఎవ్వరూ ఆ ప్రసక్తి తీసుకుకువచ్చే వారు కాదు. కాబట్టి అది రహస్యమే అని ఆవిడ తృప్తి పడుతూ వచ్చింది.
భర్త చనిపోయాడనగానే ఆవిడకు భరించలేని దుఃఖం కలిగింది. అయితే భర్త చంద్రావతి ఇంట్లో పోయాడనగానే ఆ దుఃఖం తీరుతెన్నెలు మారాయి.
7
"మా నాన్నగారికి శత్రువులుండే అవకాశం లేకపోలేదు. అయన వ్యాపారం జోరుగా సాగుతోంది. డబ్బు పుష్కలంగా వుంది. ఆయనకు దురలవాట్లున్నాయి. తాగుడు, వ్యభిచారం ఈ రెంటికీ అయన బానిస. అటువంటి వారికి శత్రువులుండి వుండవచ్చు. కానీ నా ఎరికలో మాత్రం ఎవ్వరూ లేరు" అన్నాడు వీరభద్రం.
ఇన్ స్పెక్టర్ రాజ్ కుమార్ అతడు చెప్పింది శ్రద్దగా విని "మీరు చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు. నాకు నచ్చారు. బాగా అలోచించి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా వచ్చి అనుమానాస్పదంగా ప్రవర్తించడం జరిగిందా? ఎవరి గురించైనా మీ నాన్నగారు ఆందోళన వ్యక్తపరచడం జరిగిందా? సరదాకైనా ఎవరైనా బెదిరించారా?" అనడిగాడు.
వీరభద్రం కాసేపు ఆలోచించాడు "ఏమీ గుర్తుకు రావడం లేదండి" అన్నాడు.
"ఒకో పర్యాయం మనం బాగా చిన్నదిగా భావించే విషయం కూడా ఎంతో ముఖ్యమైనదై జటిల సమస్యలను పరిష్కరించడానికి పనికి వస్తుంది. అందుకే బాగా ఆలోచించమంతున్నాను. మీరు గానీ , మీ చెల్లెలు గానీ బాగా అలోచించి నాకు చిన్న క్లూ ఇస్తే గానీ యీ కేసు ముందుకు నడవదు" అన్నాడు రాజకుమార్.
ఆ మాట నిజమే! ఈ హత్య కేసును పరిష్కరించడానికి ఇన్ స్పెక్టర్ పూర్తిగా సాంబశివరావు కుటుంబం మీద ఆధారపడ్డాడు.
ఎప్పటిలాగే సాంబశివరావు చంద్రావతి యింటికి వెళ్ళాడు. అయన వెళ్ళినప్పుడు చంద్రావతి ఇంట్లో ఆమె ఒక్కతే వుంది. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చంద్రావతి కి అపుకోలేనంత నిద్ర వచ్చేసింది. ఆ నిద్ర ఇరవై నాలుగు గంటల సేపు వుంది. చంద్రావతి ఇంటికి వచ్చిన పనిమనిషి తలుపులు బాది బాది ఇరుగు పోరుగులను పిలిచి అల్లరి చేసి బలవంతంగా తలుపులు తెరిపించి లోపలకు వెళ్ళడంతో హత్య విషయం బయటపడింది. పోలీసులు రంగంలోకి వచ్చారు.
హత్యకు ఉపయోగించినది ఒకే ఒక కత్తి. బలంగా గుండెల్లో పొడవడం వల్ల సాంబశివరావు ప్రాణం పోయింది. హత్య రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతాల జరిగింది. హతుడి జేబులో పాకెట్ రేడియో వుంది. దాని మీద హతుదికే కాక ఇంకేవరివో వ్రేలి ముద్రలున్నాయి. అవి సాంబశివరావు కు తెలిసిన వారివి కానీ, అయన కుటుంబ సభ్యులవి కానీ కావు. హత్యాయుధం పై ఏవిధమైన ఆధారాలూ దొరకలేదు.
విచిత్రమేమంటే చంద్రావతి పై ప్రయోగించపడ్డ మత్తు పదార్ధం సాంబశివరావు పై ప్రయోగించబడలేదు. పోలీసుల అనుమానం చంద్రావతి పై వుంది. కానీ చంద్రావతి సాంబశివరావు ను ఎందుకు చంపుతుంది?
వృత్తిని బట్టి చంద్రావతి శరీరాన్ని బాగా నాజూకుగా వుంచుకుంటుంది. అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. ఆ కారణంగా ఆమె చాలా బలహీనంగా వుంటుంది. చేతిలో ఆయుధం వున్నప్పటికీ సాంబశివరావు లాంటి భారీ మనిషిని ఎంతో కొంత పెనుగులాట లేకుండా చంపడం సాధ్యం కాదు. సాంబశివరావు గుండెల్లో కత్తి దిగబడ్డ పద్దతి ని బట్టి అది చంద్రావతి పని అయుండదని పోలీసులు నిర్ణయించారు.
