Previous Page
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 45


    సమయం గడుస్తోంది.
    మంచి ముహూర్తానికి పెళ్ళికూతుర్ని తీసుకుని వచ్చి కుర్చీలో కూర్చోపెట్టాడు.
    అనాసక్తంగానే రాంకుమార్ ఆమెవైపు చూశాడు.
    పెళ్ళికూతురు తల వంచుకుని ఉంది. ముఖం కనిపించటం లేదు.
    ఆమె కట్టిన గార్డెన్ సిల్కుచీర మృదువుగా ఉంది. లేత తామరతూడుల్లాంటి ఆమె చేతులు బంగారు రంగుతో మెరిసిపోతున్నాయి.
    "మెరిసేదంతా బంగారం కాదు" అనుకున్నాడు రాంకుమార్.
    సీతాపతి ముఖం అదొకలాగుంటుంది. అతడి భార్య లావుగా, బొద్దుగా, అనాకర్షణీయమైన రూపంలో వుంది.
    ఆ  యిద్దరి దాంపత్య ఫలం-తన ఎదుట కూర్చుని వుంది పెళ్ళికూతురిగా!
    ఆమె ఎలా వుంటుందో చూచాయగా ఊహించుకున్నాడు రాంకుమార్.
    యాభై వేలు కట్నం, ఘనంగా లాంఛనాలు, వైభవంగా పెళ్ళి ఇవన్నీ తనవంటి సామాన్యుడికి.....
    అంటే ఆ పెళ్ళికూతురెలాగుంటుందో ఊహించుకోవచ్చు. అందులోనూ ఆమె సీతాపతి దంపతుల దాంపత్య ఫలం.....రాంకుమార్ పెళ్ళికూతుర్నే చూస్తున్నాడు.
    అదే సురేఖ అయితే.....
    సురేఖ ఆధునికంగా అలంకరించుకుంటుంది. ఆమెను చూడగానే మోజు పుడుతుంది. ఆమె చూపుల్లో ఏదో మత్తు....
    "ఒకసారి తలెత్తమ్మా!" అంది రాంకుమార్ తల్లి.
    పెళ్ళికూతురు సిగ్గుపడుతూ తలెత్తింది.
    రాంకుమార్ ఆమెవంకే చూస్తున్నాడు.
    ఆమె అతణ్ణి చూసింది......ఒకే ఒక్కసారి రెప్పలు రెపరెపలాడించి చూసి తల దించుకుంది.
    రాంకుమార్ ఉలిక్కిపడ్డాడు.    
    అతడు చూపులు మరల్చుకోలేకపోయాడు.
    ఆమె ఎవరు?
    దివ్యలోకాలనుంచి దిగివచ్చిన దివ్యకాంతయా?
    సురాసురుల కమృతం పంచిపెట్టిన మోహినియా?
    ఆమె ఎవరైనప్పటికీ-సీతాపతి దంపతుల కూతురు కావడానికి మాత్రం వీల్లేదని అతడనుకున్నాడు. అదే నిజమైతే ఈ సృష్టి విచిత్రాల్ల్లో అదొక్కటని కూడా అతడనుకున్నాడు. అతడి దృష్టిలో సురేఖ లేదిపుడు.
    
    "నీ పేరేమిటమ్మా?"
    "శోభ!" అంది పెళ్ళికూతురు.
    వీణమీటినట్లున్న ఆ స్వరం ఆమె రూపానికే శోభనిచ్చినట్లు ఫీలయ్యాడు రాంకుమార్.
    రాంకుమార్ ముఖభావాలు సీతాపతికి సంతృప్తిని కలిగించాయి. ఆయన మళ్ళీ కాబోయే అల్లుడి పక్కకు చేరి నెమ్మదిగా కబుర్లు ప్రారంభించాడు. తన కూతురి గురించిన విశేషాలు చెబుతున్నాడాయన.
    శోభ తండ్రిగా సీతాపతి అంటే గౌరవం పెరిగింది రాంకుమార్ కి.
    పెళ్ళిచూపుల తతంగం పూర్తయ్యాక - "పిల్లనచ్చిందా?" అని తల్లి అడిగినప్పుడతడు వెంటనే తలూపి ఆమెకే ఆశ్చర్యాన్ని కలిగించాడు.
    రాంకుమార్ వెంకటేశ్వర్లు తనపై విసిరిన సవాలు గురించీ, తన తెలివిని పరీక్షించుకోవాల్సిన అవసరం గురించీ మరిచిపోయాడు.
    "కతికితే అతకదన్న భయం నాకు లేదు. ఈ రోజుకు మీరు మా ఇంట్లోనే వుండిపోవాలి" అని సీతాపతి బలవంతపెట్టాడు.
    ఆ సాయంత్రం ఆ ఇంటి ఆవరణలో పూలమొక్కల చాటున రాంకుమార్, శోభ ఏకాంతంగా మాట్లాడుకున్నారు.
    ఆమె తెలివి, చలాకీతనం, వినయం-అన్నీ రాం కుమార్ కు నచ్చాయి.

                                       4

    "అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా? మీరాకతో మా యింటికి సందడి వచ్చింది. కనీసం మరో రెండ్రోజులుండాలి" అన్నాడు సీతాపతి-పెళ్ళిచూపులైనా మర్నాడు!
    "మీరంత అభిమానంగా అడుగుతూంటే మాకూ ఉండాలనే ఉంది. కానీ అబ్బాయుండనంటున్నాడు...." అన్నాడు రాంకుమార్ తండ్రి.
    "పాపం-అతనికిక్కడ కాలక్షేపం కావడంలేదనుకుంటాను.....ఈ వీధిలోనే నా స్నేహితుడి కొడుకున్నాడు, అతడు భలే సరదామనిషి. ఒకసారి అల్లుడికి పరిచయం చేస్తాను...." అన్నాడు సీతాపతి.
    రాంకుమార్ అసలు బాధవేరు. వారంరోజులు గడువు పూర్తికాగానే అతడు వెంకటేశ్వర్లును కలుసుకుని-"నన్ను వెతుక్కుంటూవచ్చే అమ్మాయిని తప్ప నేను ప్రేమించలేను. నా తెలివందుకంగీకరించడంలేదు. ఆమె ప్రియుడెవరో వెతికి మీ కప్పగించి ఒక జంటమధ్య విలన్ గా మారడానికి కూడా నా తెలివి అంగీకరించలేదు. వేరెవ్వరినో గాఢంగా ప్రేమించిన యువతి మనసును నా వైపు తిప్పుకోవాలనుకోవడం తెలివికాదు. నన్నలాంటి పనికి ప్రోత్సహించిన మీ వద్ద ఉద్యోగం చేయడమూ తెలివికాదు-" అని చెప్పి ఉద్యోగానికి రాజీనామా యివ్వాలనుకున్నాడు.
    అప్పుడు వెంకటేశ్వర్లు రాంకుమార్వంటి సమర్దున్ని పోగొట్టుకున్నందుకు విచారిస్తాడు. రాంకుమార్ని ఉద్యోగంలో కొనసాగమని బ్రతిమాలుతాడు.
    రాంకుమార్ తన తెలివిని నిరూపించుకుంటాడు. కనీ వెంకటేశ్వర్లిచ్చే ప్రతిఫలాన్ని మృదువుగా తిరస్కరిస్తాడు.
    అప్పుడు వెంకటేశ్వర్లు ముఖభావాలు చూడ్డంకోసమైనా ఒకసారి ఆయన్ను కలుసుకోవాలని రాంకుమార్ ఆత్రపడుతున్నాడు. అందుకే శోభ ఆకర్షణను కూడా జయించి అక్కణ్ణించి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు.
    కానీ సీతాపతి ఇంతా అంతా అనరాని బలవంతం చేశాడు. శోభకూడా అతణ్ణి ఏకాంతంలో వేడుకుంది.
    రాంకుమార్ మనసూగిసలాడుతోంది.    
    వారంరోజుల తర్వాత వెంకటేశ్వర్లుకి కనపడకపోతే ఆయన తనను మోసగాడనుకుంటాడేమో! తనపై ఆగ్రహిస్తాడేమో!
    అప్పుడు తనది కావలసిన పై చేయి ఆయనదవుతుంది. అలా జరగడం అతడి కిష్టంలేదు.
    రాంకుమార్ మనోభావం తెలియని సీతాపతి అతణ్ణి తన స్నేహితుడి కొడుక్కు పరిచయం చేశాడు. అతడి పేరు కిశోర్.
    కిశోర్ మహా చొరవ మనిషి.
    "మీరు చాలా అదృష్టవంతులు. నిన్ననే నేను ఊర్నించి తిరిగివచ్చాను. రెండురోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతున్నాను. కొత్తగా ఉద్యోగం వచ్చింది. జాయినవ్వాలి. మీకు నా కంపెనీ లభించే అదృష్టముంది-" అన్నాడు కిశోర్.
    మాటవరసకి-"ఎక్కడ మీ ఉద్యోగం?" అన్నాడు రాంకుమార్.
    "అంతా అనుకోకుండా జరిగింది. ఏదో పనిమీద ఆ ఊరెళ్ళాను. మా బంధువుకు తోడుగావెళ్ళి వెంకటేశ్వర్లనే ఆయన్ను కలుసుకున్నాను. ఆయన నా వివరాలడిగి ఉద్యోగమిస్తాను చేస్తావా అన్నాడు. ఆయనకు పెర్సనల్ సెక్రటరీ. నెలకు రెండువేలు జీతం...."
    రాంకుమార్ తెల్లబోయి- "ఆయనకు పర్సనల్ సెక్రటరీ అంతవరకూ లేడా?" అన్నాడు.
    "ఉన్నాడు, కానీ అతడొకసారి పొరపాటున ఆయన కూతురు పడక గదిలోనికి వెళ్ళాడుట. అలాంటి పొరపాటును వెంకటేశ్వర్లు సహించడు. అందుకని అతణ్ణి ఉద్యోగంలోంచి తీసేశాట్ట" అన్నాడు కిశోర్.
    రాంకుమార్ కు నోటమాట రాలేదు.
    కిశోర్ మళ్ళీ తనే ఇలా అన్నాడు - "ఆయన చాలా తెలివైనవాడు. పాత సెక్రటరీనాయన ఉద్యోగంలోంచి తీసేస్తున్నట్లు చెప్పలేదుట. పరోక్షంగా అతడి తప్పును గురించి వివరించాట్ట. ఉద్యోగంలోంచి తీసేసినపుడు మూడునెలల జీతం ఇవ్వాలిట. తీసేస్తున్నానని చెప్పక పోయినా మూడునెలల జీతమూ ఇచ్చేశాట్ట. బుర్రలో తెలివున్నవాడి కెవరికైనా విషయం అర్ధమవుతుంది. అతడికా తెలివిలేకపోతే మళ్ళీ వస్తాడట. అప్పుడతన్ని నాకు చూపిస్తానన్నాడు....."
    రాంకుమార్ తేరుకుని "చాలా విచిత్రంగా ఉంది." అన్నాడు.
    "విచిత్రమే....ఆ వెంకటేశ్వర్లు చాలా తెలివైనవాడు. నేనడక్కుండానే పాతసెక్రటరీ వివరాలన్నీ ఆయన చెప్పడానికి కారణం-నన్ను హెచ్చరించాలని!" అన్నాడు కిశోర్.
    "అంతే అయుంటుంది - అన్నాడు రాంకుమార్ అన్యమనస్కంగా.
    "ఇంతకీ వెంకటేశ్వర్లు అంచనా నిజమవుతుందో కాదో - ఆయన దృష్టిలో తెలివైనవాడుగా భావించబడ్డ ఆ పాతసెక్రటరీ తెలివితక్కువగా - నా జాయినింగ్ డేట్ కి వస్తాడేమోనని ఆశగా ఉంది. అలాంటి తెలివితక్కువ వాళ్ళని నాకు చూడాలంటే యిష్టం! ఎందుకంటే వెంకటేశ్వర్లు వంటివాడు తన కూతుర్నిచ్చి తన సెక్రటరీకే పెళ్ళి చేస్తాడని నమ్మేవాడుంటే అతణ్ణి నేను చూడ్డమేకాదు.....వీలుంటే మీక్కూడా చూపిస్తాను...." అన్నాడు కిషోర్.
    అతడితో మాటలు ముగిసేక రాంకుమార్ తిన్నగా తల్లివద్దకు వెళ్ళి - "అమ్మా! టెలిగ్రామిచ్చి నువ్వు మహోపకారం చేశావు. నా తెలివిని నిలబెట్టావు. ఇకమీదట అన్నింటికీ నువ్వు చెప్పినట్లే వింటాను. ఇక నా యజమానిని కలుసుకునే ప్రయత్నం చేయను..." అన్నాడు.
    సీతాపతి విషయం విని-"కిశోర్ చాలా సరదా మనిషి. నేను చెప్పానుగా అల్లుడు మనసు మార్చుకుంటాడనీ...." అన్నాడు రాంకుమార్ తండ్రితో.
    తను వెంకటేశ్వర్లును కలుసుకోకుండా అక్కణ్ణించి తన సామాను తెప్పించుకోవడ మెలాగా అని ఆలోచిస్తున్నాడు రాంకుమార్.


                           -:అయిపోయింది:-
   


 Previous Page

WRITERS
PUBLICATIONS