కట్టి విడిచిన పట్టు చీర
వసుంధర
సాయంత్రం ఆరయింది.
శీతాకాలం కావడం వల్ల అప్పుడే బీచి దగ్గర చీకటిగా ఉంది.
పున్నమి వెన్నెల సముద్రంలో అందంగా ప్రతిఫలిస్తోంది.
"ఈరోజు కిక్కడే వుండి పోదాం--" అన్నాడు శాస్త్రి.
"మరి భోజనం ?' అన్నాడు శర్మ.
"నాకు పిడతకింద పప్పుతోటే కడుపు నిండిపోయింది" అన్నాడు శాస్త్రి. అతడి చేతిలో యింకా ఆ పొట్లం వుంది.
"ఇప్పుడలాగే అనిపిస్తుంది. ఓ గంట పోయాక ఆకలేస్తుంది--"
'ఆకలేస్తుందని బెంగెందుకు? ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు కనుకనా?" అన్నాడు శాస్త్రి.
"మనం వర్తమానం చూసి తృప్తి చెందడం వల్ల భవిష్యత్తు లో ఏడుస్తున్నాం--" అన్నాడు శర్మ.
"మనిషి జీవించేది భవిస్యత్తు లో కాదు. వర్తమానం లో!"
"ఈ క్షణం లో వర్తమానం భవిష్యత్తు లో గతం మనిషి బ్రతికేది వర్తమానం కోసం కాదు భవిష్యత్తు కోసం...."
"ఇంతకీ భవిష్యత్తు లో నీకేం కావాలో చెప్పు!"
"ఈ పున్నమి వెన్నెలలో బీచి వద్ద నీకు నేనూ నాకూ నువ్వూ జంటగా ఉండడం వల్ల ఈ వర్తమానం గతంగా మారితేనే మంచిదని పిస్తోంది. ఆ గతాన్ని భవిష్యత్తు లో కూడా తలచుకోకూడదనిపిస్తోంది-" అన్నాడు శర్మ.
"ఈరోజు నీకేదో అయింది -" అన్నాడు శాస్త్రి.
"శాస్త్రీ! మనం కూడా ఇలా ఎన్నాళ్ళు ఆగమ్మ కాకుల్లా తిరుగుతాం. పెళ్ళి చేసుకుందాం. బ్రతుకు బాట ఏర్పాటు చేసుకుందాం--" అన్నాడు శర్మ.
"నువ్వు పెళ్ళి చేసుకుంటానంటే వద్దన్నానా?' అన్నాడు శాస్త్రి.
"సుఖమైన కష్టమైనా మనం జంటగా అనుభవించాలి--"
"అలాగనకు . అది భారత యుద్ధ కాలంలోనే విచిత్రంగా చెప్పుకోబడింది. అంత పెద్ద మహాభారతంలో ఒక్క ద్రౌపది కి తప్ప ఏ స్త్రీకి ఒకరు మించి భర్తలు లేరు--" అన్నాడు శాస్త్రి.
'ఛా -- నా ఉద్దేశ్యమది కాదు. నువ్వూ నేను కూడా వేర్వేరు అమ్మాయిల్ని పెళ్ళి చేసుకుందాం.
"పెళ్ళి కి ముందు జీవితంలో స్థిరపడాలి గదా!" అన్నాడు శాస్త్రి.
"పెళ్ళయితే గాని మనం స్థిరపడలెం! భార్యలు మన తత్వాన్ని మార్చుతారు--" అన్నాడు శర్మ.
"అయితే సరే -- నువ్వో పిల్లను చేసుకో, నాకో పిల్లను చూసిపెట్టు----"
"చూడ్డం అయింది-----"
"ఎవరు?"
"మన వీధిలోనే వుంటున్నారు. సోమయాజులు గారు. అయనకిప్పుడు రెండో పెళ్ళాం. ఆమె వయసు పాతిక్కి లోపే!"
'అయితేమాత్రం -- పెళ్ళయిన వాళ్ళను చేసుకుంటామా? నలుగురూ ముఖం మీద ఉమ్మేస్తారు.."
"వెధవ జోకులు వేయకు. నేను నీకు చెప్పేది సోమయాజులు గారి పెద్ద భార్య కూతుళ్ళ గురించి...."
"ఎవరు వాళ్ళు?"
"అమల- విమల --"
"పేర్లు బాగున్నాయి కానీ....?"
"ఊ నీ సందేహమేమిటో చెప్పు...."
"మనుషులు బాగుంటారా?"
"ఆడపిల్లలకు వయసు వంద వంకర్లు తీరుస్తుందంటారు. వాళ్ళ శరీరాలకు వంకరలె అందాన్నిచ్చాయి----"
"అంటే=-- పోలియో వచ్చిందా?"
శర్మ చిరాగ్గా - "అసలు ముందు పెళ్ళి నీకే అర్జంటు. నీ వెధవ జోకులు పెళ్ళాం తప్ప వేరెవ్వరూ భరించలేరు"అన్నాడు.
"మరి వంకర అంటే ఏమిటి?"
"బాపూ బొమ్మ చూశావు కదా -- ఆడపిల్ల బొమ్మ వంకరిలే అందం. ఏ వంకర్లూ లేని పిల్ల సిలిండర్ల ఉంటుంది----......"
"ఓహో -- నాకది తట్టనేలేదు.... అయినా నువ్వింత కవితా ధోరణి లో మాట్లాడతావని నాకేం తెలుసు? బొత్తిగా సెన్సాఫ్ హ్యూమర్ లేని నువ్వీ రోజున ఇలా మాట్లాడుతున్నావంటే నిజంగానే యిది పెద్ద విశేషం....అదిసరే కానీ వాళ్ళను నేనెప్పుడూ చూడలేదు. నువ్వెలా చూశావూ?' అన్నాడు శాస్త్రి.
"నువ్వూ చూసి వుండే వాడివి నీలో సౌందర్య దృష్టి ఉంటే?"
శాస్త్రి సాలోచనగా -- "అందమైన ఆడపిల్ల కనబడితే అప్రయత్నంగా నా దృష్టి ఆటే మళ్ళుతుంది. వాళ్ళు నిజంగా అందమైన వాళ్ళేనా?" అన్నాడు.
"నువ్వు ముందు ఆడదాన్ని చూడవు. మెరిసే చీరనో, గుబాళించే సెంటు పరిమళాన్నో గమనించి ఆ తర్వాత మనిషిని చూస్తావు. సవతి తల్లీ అధ్వర్యంలో పెరుగుతున్న యీ పిల్లలు మంచి బట్ట కట్టుకోరు. చూడ్డానికి పని మనుషుల్లా కనిపిస్తారు. ఇంటి పనీ, బయట పనీ వాళ్ళే చేయాలి. ఒసరిద్దరూ కలిసి ఇరవై కేజీల బరువుసంచీలు పట్టుకుని వస్తుంటే నేను సాయం చేశాను...."
"ఇంతకీ నీకు వాళ్ళెలా పరిచయమయ్యారు?"
"అలోచించి చూడు...."
శాస్త్రి వెంటనే -- "ఓహో -- నువ్వు వాళ్ళింట్లో ప్రయివేటు చెబుతున్నావు కదూ!" అన్నాడు.
"అవును రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు దాకా సోమయాజులు గారి బావమరిది కి ప్రయివేటు . శనాదివారాలు సెలవు. ఈరోజు శనివారం...."
"ఆ యింట్లో నాకు ప్రత్యేకమైన ఆకర్షణేది కనపడక ప్రయివేటు ఒప్పుకోలేదు. నువ్వోప్పుకున్నావు...."
'ఆకర్షణ నీకేం కనబడుతుంది? సోమయాజులు గారి భార్య వయసు పాతిక్క లోపే అయినా మనిషి యాభై ఏళ్ళదానిలా ప్రవర్తిస్తుంది. గోచీ పోసి ఏడు గజాల చీర కడుతుంది. రూపాయి కాసంత బొట్టు పెడుతుంది. ఇరవై నాలుగ్గంటలూ పూజలూ, స్నానాలూ! నిన్నూ నన్నూ బాబూ అని పలకరిస్తుంది. మనదేశపు ఆడవాళ్ళు పెళ్ళి అవగానే ముసలివాళ్ళయిపోతారు. విదేశాల్లో ఆడవాళ్ళు ముసలితనంలో కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఏమైతేనేం ఆ యింట్లో ఆకర్షణ లేదు...."
"నీకుంది కాబట్టి చేరావు. ఇంతకీ ఆ పిల్లలతో పరిచయ మెలగయింది నీకు? సరుకులు మోసినప్పుడేనా?" "కాదు, ఆ పిల్లలిద్దరూ ప్రయివేటుగా ఇంటర్మీడియట్ కు కడుతున్నారు. సోమయాజులు గారి బావమరిదికి పాఠం చెబుతుంటే యేవో సందేహాలు తీర్చుకుందుకు నా దగ్గరకు వస్తుండేవారు...."
"అంటే వాళ్ళు నిన్ను వలలో వేసుకున్నారన్న మాట...."
"వాళ్ళకు మగాళ్ళతో మాట్లాడ్డానికే మొహమాటం. చాలా మంచి పిల్లలు. అసలు సంగతి తెలిస్తే నువ్వు తెల్లబోతావు.... వాళ్ళ సవతి తల్లి మన గురించి అరా తీసింది. అన్నీ తెలుసుకున్నాకనే నన్ను తన తమ్ముడికి ప్రయివేటు మాస్టర్ని చేసింది. ఆ కుర్రాడు చాలా తెలివైన వాడు. నిజానికి వాడికి ప్రయివేటు అవసరం లేదు"
"అంటే?"
"ఇంకా అర్ధం కాలేదా?" నేనా పిల్లల్లో ఒకర్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని ఆ తల్లి ఆశ...."
"ఆ ఆశను నువ్వు నిజం చేస్తున్నావు...."
"నువ్వూ చేస్తావు....' అన్నాడు శర్మ.
"నీకెలా తెలుసు?"
"రేపు ప్రయివేటు చెప్పడానికి నువ్వూ రా!"
"నేను రాను...."
"వచ్చి తీరాలి...."
"ఏమిటీ జబర్దస్తీ....?"
"నీ మంచి నీకు తెలియనప్పుడు ఇద్దరిలో కాస్త పెద్దవాడ్నిగా నేను కాస్త జబర్దస్తి చేయక తప్పదు...."
"అరే -- హటాత్తుగా నువ్వు పెద్దవాడివై పోయావే...కారణమేమిటి?"
"ఆ అమ్మయిలిద్దరిలో అమల పెద్దది. అమలను నేను ప్రేమిస్తున్నాను....' అన్నాడు శర్మ మొహమాటపడుతూ.
'అంటే విమలను నేను ప్రేమించాలన్న మాట.... ఒకవిధంగా నిన్ను మెచ్చుకోవాలి. ఇద్దరిలో చిన్నపిల్లనే వదిలినందుకు...."
"పేరుకే వాళ్ళు చిన్నా పెద్దా..... వాళ్ళిద్దరూ కవలలు..."
శాస్త్రి తెల్లబోయి -- "అయితే నేనీ ప్రేమకు ఒప్పుకోను. ఇందులో నీ స్వార్ధమేదో వుంది. నువ్వు వాళ్ళిద్దర్నీ వలలో వేసుకుని-- ఒకర్ని పెళ్ళి చేసుకొని ఇంకొకర్ని నాకు అంటగట్టాలనుకుంటున్నావు--" అన్నాడు.
"ఎదిసినట్లుంది -- ఇన్నేళ్ళ మన స్నేహాన్నిదా నువ్వర్ధం చేసుకున్నది!"
"మన స్నేహాన్ని నేనన్ని విషయాల్లోనూ నమ్ముతాను. ఆడవాళ్ళ విషయం లో మాత్రం కాదు. వాళ్ళిద్దరూ ఒక్కలాగే ఉంటే ఎవరెవరో తెలియక నేనిబ్బంది పడాలి. తోలి నుంచీ పరిచయమున్న నీకు నన్ను మోసం చేసే అవకాశముంది.
శర్మ నవ్వి -- "అదానీ అనుమానం! అక్క చెల్లెళ్ళు ఇద్దరూ అందంలో ఒకరికొకరు తీసిపోరు. కాని పోలికల్లో ఎవరికి వారే! ఒకే తల్లి బిడ్డలని చెబితే నమ్మడం కష్టం..." అన్నాడు.
"అయితే సరే -- రేపు నేను వస్తాను ప్రయివేటుకి. అప్పుడేం జరుగుతుంది?"
"గదిలో సోమయాజులు గారి బావమరిది ఉంటాడు. అమల, విమల ప్రవేశించగానే నువ్వు విమలతో మాట్లాడు. నేను అమలతో మాట్లాడుతాను. సోమయాజులు గారి బావమరిది గది మధ్యలో తన పాఠాలు తను చదువు కుంటాడు. ఆడపిల్లలు తమ కష్టం సుఖం నీతోటీ నాతోటీ చేప్పుకుంటారు....."
"వాళ్ళకు మగాళ్ళ తో మాట్లాడడమంటే భయమన్నావు...."
"భయమే -- కానీ సవతి తల్లి పోరుతుంటే ఏం చేస్తారు? వాళ్ళ పెళ్ళి కుదర్చడాని కామె యీ మార్గం తప్ప ఇంకేవీ ఆలోచించదు...."
"సరే -- నీ మాట మీద వస్తున్నాను. కానీ నీకు ముందుగా మాటివ్వలెను...." అన్నాడు శాస్త్రి గంభీరంగా.
