Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 43


    "ఆమె నిన్ను ఉద్యోగంలోంచి తీసేయమంది...." అన్నాడు వెంకటేశ్వర్లు.
    "మీరు నన్ను ఉద్యోగంలోంచి తీసేయకపోయినా ఆమె నొక్కించదు. తనా మాత్రం తీవ్రంగా రియాక్ట్ కాకపోతే బాగుండదు కదా?" అన్నాడు రాంకుమార్.
    "సురేఖ నటించిందని నువ్వనుకుంటే అది నీ భ్రమ. నీ విషయంలో ఆమె చాలా తీవ్రంగా రియాక్టయింది...." అన్నాడు వెంకటేశ్వర్లు.
    "ఎందుకని?"
    "మన మోచేతిక్రింద నీళ్ళుతాగే మనిషికెంత ధైర్యం అని ఆగ్రహించింది సురేఖ" అన్నాడు వెంకటేశ్వర్లు.
    సురేఖ పేరు చెప్పి తననదల్చుకున్న మాటలు వెంకటేశ్వర్లు చెబుతున్నాడా అని రాంకుమార్ కి అనిపించింది. అయినప్పటికీ ధైర్యంచేసి-"మీ అభిప్రాయం మీది-నా అభిప్రాయం నాది" అన్నాడు. వెంకటేశ్వర్లిచ్చిన చనువతడి కా ధైర్యాన్నిచ్చింది.
    "నీ అభిప్రాయానికి నేను కారణం తెలుసుకోవచ్చా?"
    "మీరు సురేఖ మాటలకు చాలా విలువనిస్తారు. ఆమె తీవ్రంగా రియాక్టయి ఉంటే మీరు నాతో యింత మృదువుగా మాట్లాడి వుండేవారు కాదు" అన్నాడు రాంకుమార్.
    "తెలివైనవాడివే...." అన్నాడు వెంకటేశ్వర్లు.
    తానప్పుడే సురేఖను పెళ్ళాడేసినంత ఆనందం పొందారు రాంకుమార్.
    "కానీ-నిఒజం చెబుతున్నాను. నీ విషయంలో సురేఖ చాలా తీవ్రంగా రియాక్టయింది. అయినా నేను నీతో మృదువుగా మాట్లాడడానికి వేరే కారణముంది" అని వెంకటేశ్వర్లు ఒక్కక్షణమాగి మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. "గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు జరిగాయి. ఎప్పుడూ ఆమె యింత తీవ్రంగా రియాక్టవలేదు. ఇప్పుడింత తీవ్రంగా రియాక్టయిందంటే అందుకేదో కారణముండి వుండాలి. వూహించగలవా?"
    "ఆమె గదిలోనికి కన్న తండ్రి కూడా అడుగుపెట్టడు. ఆ విధంగా నేను చేసినది క్షమించరాని నేరం" అన్నాడు రాంకుమార్.
    "నిజమే-కానీ సురేఖ కోపానికి అసలు కారణ మది కాదు. అది నీ కర్ధం కావాలంటే ముందు నీవు స్త్రీ మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవాలి" అన్నాడు వెంకటేశ్వర్లు.
    స్త్రీ తనకోసం కాక, తనవారికోసం జీవించే ఆదర్శత్యాగమూర్తి. ఈ సృష్టి రహస్యమంతా స్త్రీ త్యాగంలోనే ఇమిడి ఉంది. ఇంతకాలం సురేఖ ఎవర్నీ ప్రేమించలేదు. ఇటీవల ఆమె ఎవరినో ప్రేమించింది. ఎప్పుడయితే ప్రేమలో పడిందో ఆమె తన శరీరం తనదికాదనీ తన ప్రియుడిదనీ భావిస్తుంది. తన శరీరంమీద ఎవరు వాంఛపెంచుకున్నా ఆమె సహించి క్షమించగలదు. తన ప్రియుడి శరీరంపై - ఎవరు మోజుపడినా ఆమె భరించలేదు.
    "నీ విషయంలో అదే జరిగింది" అన్నాడు వెంకటేశ్వర్లు.
    "అతడెవరో మీకు తెలుసా?"
    "తెలియదు..... నువ్వు మాత్రం కాదని నాకు తెలుసు" అని "రాంకుమార్! సురేఖ ప్రియుడెవరో నువ్వు తెలుసుకుని నాకు చెప్పాలి" అన్నాడు వెంకటేశ్వర్లు.
    "ఎందుకు?"
    "సురేఖ తన ప్రేమను రహస్యంగా వుంచింది. అంటే ఆమె ప్రేమనందుకున్న యువకుడికి బహిరంగంగా ఆమెను ప్రేమించే అర్హతలేదు. ఆ ప్రేమికుడికి నా ఎదుట నిలబడి మాట్లాడే ధైర్యం లేదు."
    "అతడెవరో తెలుసుకొనడంవల్ల మీకేం ప్రయోజనం."
    "చాలా ప్రయోజన ముంది-" అన్నాడు వెంకటేశ్వర్లు "నా కూతుర్ని నాకు తెలియకుండా ప్రేమించడం వల్ల - ఎలాంటి పర్యవసాన ముంటుందో ప్రపంచానికి తెలియాలి...."
    "మీరు మీ అమ్మాయిని ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నారు. ఆమె ప్రేమ నెలాగూ తిరస్కరించలేరు" అన్నాడు రాంకుమార్.
    "ఆ పొరపాటు అభిప్రాయాన్ని తుడిచిపెట్టడం కోసం ఆ ప్రేమికున్ని కాలరాస్తాను" అన్నాడు వెంకటేశ్వర్లు.
    "క్షమించాలి-ఇందుకు నేను సహకరించలేను."
    "ఎందుకని?"
    "ఇతరులకు ప్రమాదం కలిగించే పనులు నేను చేయలేను...."
    "అందువల్ల నీకే ప్రమాద మేర్పడితే?"
    "అంటే?" అన్నాడు రాంకుమార్ ఆశ్చర్యంగానూ, భయంగానూ.
    "నేను నీ తెలివిని పరీక్షించాలనుకుంటున్నాను. అందుకు సరిగ్గా వారం రోజులు టైమిస్తున్నాను. ఈ వారం రోజుల్లోనూ నువ్వు సురేఖ ప్రియుడెవరో తెలుసుకోవడమే కాక సురేఖ కతడిపై ద్వేష భావాన్ని కలిగించి నిన్ను ప్రేమించేలా చేసుకోవాలి. అప్పుడు నేను నిన్ను నా యింటల్లున్ని చేసుకుంటాను.....నువ్వు సురేఖ ప్రియుడెవరో తెలుసుకొనకపోతే శాశ్వతంగా ఒక బంగారు అవకాశాన్ని పోగొట్టుకుంటావు. అది ప్రమాదమే కదా!" అన్నాడు వెంకటేశ్వర్లు.
    రాంకుమార్ ఆయన కళ్ళలోకి సూటిగా చూశాడు. తన కిటువంటి సవాలెదురౌతుందని అతడనుకోలేదు.
    "ప్రయత్నిస్తాను" అన్నాడతడు.
    "ఆలోచించుకో - ఇది నీ తెలివికి పరీక్ష. వారంరోజుల్లో అనుకున్నది సాధించకపోయావా నీ వుద్యోగం వూడినట్లే...."
    రాంకుమార్ తెల్లబోయి "ఈ సవాలుకూ నా వుద్యోగానికీ ముడిపెడుతున్నారా?" అన్నాడు.
    "అవును-సురేఖను ప్రేమించే ముందు నీ అర్హత నీవు చూసుకోవాలి. అనాలోచితంగా వీరోచిత కార్యాలు చేయాలనుకునే వారికి నావద్ద స్థానం లేదు. నీ అర్హతను నిరూపించుకునేందుకు నీకు వారంరోజులు టైముమాత్రమే కాదు-నీ ఖర్చుల కవసరపడుతుందని కొంత డబ్బు కూడా యిస్తున్నాను" అన్నాడు వెంకటేశ్వర్లు.
    ఆయన తన జేబులోంచి ఒక గోధుమరంగు కవరు తీసి రాంకుమార్ కి అందించాడు. అతడది విప్పిచూశాడు. అందులో ఆరువేలున్నాయి.
    "ఇప్పట్లో నాకు ఖర్చులేమున్నాయి?" అన్నాడు రాం కుమార్.
    "ఏమిటా?" అని, "ఒక అజ్ఞాత వ్యక్తిని వెతికి పట్టుకోవాలి. అందుకు ఎల్లకాలం సురేఖను అంటిపెట్టుకుని ఉండాలి. వెతికి పట్టుకున్న వ్యక్తిపై సురేఖకు ద్వేషం కలిగించాలి. నీపై ప్రేమను పుట్టించాలి. వీటన్నింటికీ ఎన్నో ప్రాంతాలు తిరగాలి. ఎన్నో నాటకాలాడాలి. అందుకు బోలెడు ఖర్చవుతుంది. నిజానికి ఆరువేలు సరిపోతుందనుకోను. కానీ నేనంతమాత్రమే నీ కివ్వగలను. ఆపైన నీ తెలివి ఉపయోగించాలి" అన్నాడు వెంకటేశ్వర్లు.
    రాంకుమార్ వెంకటేశ్వర్లు దగ్గర సెలవు తీసుకున్నాడు.

                                       2

    జరిగిన విశేషాన్ని నెమరు వేసుకుంటూనే రాంకుమార్ తన గదిలోనికి వెళ్ళాడు. అప్పుడే ఒక పనివాడతన్ని సమీపించి-"సార్-టెలిగ్రాం వచ్చింది-మీకు-" అన్నాడు.
    రాంకుమార్ టెలిగ్రాం అందుకుని చదివాడు.
    "మదర్ సీరియస్. స్టార్ట్ ఇమ్మీడియేట్లీ....."
    టెలిగ్రాం అతఃది తండ్రి ఇచ్చాడు.
    రాంకుమార్ కు కాళ్ళు చేతులూ ఆడలేదు. అతడు వెంటనే వెంకటేశ్వర్లును కలుసుకున్నాడు. ఆయన విషయం విని-"వారంరోజుల వరకూ నీవు సెలవు తీసుకోవాల్సిన అవసరంలేదు. నీ యిష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చు. అయితే సవాలుకు నేనిచ్చిన గడువులో ఒక్క రోజు కూడా నేను తగ్గించేదిలేదు. ఆపైన నీ యిష్టం" అన్నాడు.
    అతడు వెంకటేశ్వర్లు వద్ద సెలవు తీసుకుని మళ్ళీ తన గదికి వెళ్ళే కాసేపు నిదానంగా ఆలోచించాడు. ఆ టెలిగ్రాం వెంకటేశ్వర్లు-సవాలులో తన్నోడించడాని కాడుతున్న నాటకం కాదుగదా అని కూడా రాంకుమార్ కి అనుమానం వచ్చింది.
    మరోసారి అతడు టెలిగ్రాంను పరీక్షించాడు. దానిమీద వివరాలనుబట్టి అది నిస్సందేహంగా తన ఊరి పోస్టాఫీసు నుంచే వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS