Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 42

 

    "ఎందుకు క్షమించాలో చెప్పి ఏడు - అప్పుడా విషయం చూద్దాం" అన్నాడు చక్రపాణి.
    చక్రపాణి కి విశ్వం తన కధ వివరిస్తుంటే అక్కడున్న అందరూ వింటున్నారు. వింటున్న అందరి ముఖాల్లోనూ కుతూహలం వుంటే ఒక్క అరుణ ముఖంలో మాత్రం అంతు లేని బాధ వుంది.
    "నేను చిన్నప్పుడు ఇల్లు వదిలి పెట్టగానే చేతులు మరి ఆఖరికి అనసూయమ్మ యింట పడ్డాను. అనసూయమ్మ నన్ను చాలా బాగా చూసుకొంది. పియ్యుసీ దాకా చదివించింది కూడా. అయితే అనసూయమ్మ నిజస్వరూపం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. అందరికీ తెలిసిన ప్రకారం ఆమె అందరి లాంటిదే! డబ్బు న్న ఆడది, ఐతే ఆమెకు డబ్బు ఎక్కడ్నించి వస్తోంది?
    "నాకులాంటి అనాధ బాలుర్ని ఆమె చాలామందిని చేరదీసింది. మమ్మల్ని ఆకర్షణీయంగా తయారు చేస్తుంది. అడిగినంత డబ్బు ఇస్తుంది. జల్సాగా గడపమని ప్రోత్సహిస్తుంది. తనే స్వయంగా తాగుడు కూడా అలవాటు చేసింది. మా అందరికీ స్కూటర్లు కొని పెట్టింది. మేము చేయవలసిన పనల్లా అందమైన ఆడవాళ్ళని వలలో వేసుకోవడం, అలా మా వలలో పడిన పతితులయిన ఆడవాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవడం ఆవిడ జీవనాధారం. కొంతమందిని వేశ్యా వృత్తిలోకి దింపుతుంది. కొంతమందిని స్మగ్లింగ్ వ్యవహారాలకుపయోగించుకుంటుంది. బాగా డబ్బున్న వాళ్ళయితే బ్లాక్ మెయిల్ చేస్తుంది.
    ఈ జీవితం నాకు నచ్చలేదు. సుమారు సంవత్సరం క్రితం నేను నా అసంతృప్తిని వ్యక్తపరిచి ఆమె బారి నుండి బయట పడదామనుకున్నాను. మొదట్లో వయసు పొంగులో తాగడమూ, వ్యభిచారించడమూ సరదాగానే అనిపించినప్పటికీ -- నామూలంగా ఎందరో ఆడపిల్లల కన్నీళ్ళు కాలవలై ప్రవహిస్తున్నాయని గ్రహించాక అనసూయమ్మను వదిలి పెట్టి పోవాలనుకుననాను. నేను నా నిర్ణయం చెప్పగానే ఆమె కంగారు పడి కారణం అడిగింది. వెళ్ళి పోయి ఏం చేస్తావంది?"
    నేను మామయ్యా గురించి చెప్పాను. ఆడపిల్లల శీలాలతో ఆడుకోవడం ఇష్టం లేదని నా మరదల్ని పెళ్ళి చేసుకొని పవిత్ర జీవితం గడపాలను కొంటున్నానని చెప్పాను. ఆమె నా ఆలోచనలను మెచ్చుకొని పవిత్ర జీవితం తనవద్ద ఉంటూ కూడా గడపవచ్చునని చెప్పింది. "నువ్వెలాగూ నేరస్థుడివే. ఇప్పటికి ఒకటి రెండు సార్లు చిల్లర దొంగతనాల్లో జైలుకు వెళ్ళావు. అందువల్ల నీకేక్కడా ఉద్యోగం దొరకదు. స్మగ్లింగ్ వ్యవహారాల్లో నాకు చేదోడు వాదోడు గా వుండు చాలు " అంది.
    అనసూయమ్మకు ఒక ముఠా వుంది. ఆ ముఠాలో నేను ఒకణ్ణి. అయిదారు పర్యాయాలు నేను దొంగతనాలకు వెళ్ళాను. రెండు సార్లు దొరికిపోయి కొద్ది నెలలు జైల్లో వుండి వచ్చాను. అందువల్ల అనసూయమ్మ మాటవిని స్మగ్లింగ్ వ్యవహారాలకు నా కార్యకలాపాలు పరిమితము చేసుకోవాలను కొన్నాను.
    ఐతే అనసూయమ్మ నా మరదలి ఫోటో చూసింది. కన్ను చెదిరి పోయింది. అలాంటి పిల్లుంటే లక్షలకు లక్షలు సంపాదించ వచ్చుననుకుంది. పెళ్ళి పేరు చెప్పి మాయమాటలు చెప్పి అరుణను తీసుకువచ్చి తనకు అప్పగించ'మంది. అందుకు నేను ఇష్టపడకపోతే తాత్కాలికంగా నవ్వి ఊరుకుంది.
    'ఆ తర్వాత వారం రోజుల్లో అనసూయమ్మ ముఠాతో పాటు నేనూ ఒక వ్యవహారంలో పాల్గొన్నాను. అప్పుడు ఒక హత్య జరిగింది. ముఠాలోని మనిషి అక్కడి దృశ్యాన్ని ఫోటో తీశాడు. శవం దగ్గర నేనున్న ఫోటో ఒకటి బాగా ఎన్ లాడ్జి చేయించి అనసూయమ్మ తర్వాత నాకు చూపించింది.
    ఆ హత్య కేసు పరిశోధనలో వున్నదని నాకు తెలుసు. ఈవిధంగా హత్య కేసులో ఇరికించబడతానని మాత్రం నాకు తెలియదు. నన్ను హంతకుడ్ని చేస్తానని బెదిరించి అనసూయమ్మ. అరుణ విషయంలో నన్ను ఒప్పించింది. ఐతే ఆ ఆలోచనే నాకు భయంకరంగా తోచింది. ఐనా తప్పదు. లేకపోతే నేను ఉరికంబం ఎక్కాల్సి వుంటుంది.
    బాగా అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు జైలు కొత్త కాదు. తాత్కాలికంగా అరుణను రక్షించడం కోసం పోలీసులకు దొరికిపోయే విధంగా నేరం చేయాలనుకొన్నాను. ఫలితంగా ఒక మైనారిటీ తీరని అమ్మాయిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాను. ఆరువారాలు జైలు శిక్ష విధించారు. ఇంకా ఎక్కువ పడాల్సింది కానీ అనసూయామ్మ చాలా సాక్ష్యాలను సమయానికి దొరక్కుండా చేసింది. పోలీస్ సర్కిల్స్ లో కూడా ఆమెకు చెప్పుకోదగ్గ పలుకుబడి వుంది.
    జైల్లోంచి బయటపడ్డాక నాకింక తప్పలేదు. అనసూయమ్మ తొందరపెట్టి నన్ను పంపించింది. మనసు ఎంతో ఎదురు తిరుగుతున్నప్పటికీ , స్వార్ధం కోసం మరదల్ని బలిపెట్టక తప్పదని ఇలా వచ్చేశాను. నా నేరం బయట పడినందుకు నాకు బాధగా లేదు. ఏదో ఒకరోజు నేను  హంతకుడిగా న్యాయస్థానం ముందు నిలబడక తప్పదు. అది ఈరోజు కాస్త ముందుగా జరుగుతోంది. ఇదీనా కధ. మీరు నన్ను మన్నించినా సరే, మన్నించక పోయినా సరే జరుగవలసిన అపరాధం జరక్కుండా ఆగింది."
    విశ్వం కధ విని చక్రపాణి పళ్ళు పటపటా కొరికాడు. "ఒరేయ్ ఏడో ఏట పారిపోయి మళ్ళీ యిప్పుడు తిరిగి వచ్చినందు కట్రా. అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వస్తున్న నా బంగారు తల్లిని, నా ఇంటి దీపాన్ని బోగం కొంప లకి అప్పగించడానికి పనిగట్టుకుని వస్తావుట్రా--
    నేను క్షమించినా నిన్ను దేవుడు క్షమిస్తాడుట్రా--"
    చక్రపాణి భార్య కూడా విశ్వాన్ని నానా మాటలు అంది.
    'అమ్మా! ఎందుకే బావను అడిపోసుకుంటారు. దారి తెలియని వయసులో దారి తప్పాడు. ఇది దారికి వచ్చే వయసు కాదు. అయినా తన తప్పు తెలుసుకొన్నాడు. నా కోసం తను పనిగట్టుకుని జైలుకు వెళ్ళాడు. ఇప్పుడతను చెబితే తప్ప తెలియని రహస్యాలు మనకు చెప్పి మనచేత నిందా వాక్యాలు విని సహిస్తున్నాడు. అంతటితో అయిందా, అందుగురించి ఇప్పుడు జైలుకు వెడతాడు. ఏం చేయాలో ఆలోచించ కుండా వూరికే బావను తిడతారేం?' అంది అరుణ.
    నేను ఆశ్చర్య పడ్డాను. నేనొక్కడినే కాదు. ఆమె మాటలకు అక్కడున్న అందరూ విశ్వంతో సహా ఆశ్చర్య పడ్డట్లున్నారు.
    "క్షమించు అరుణా! నీ సానుభూతికి నేను తగను. నిన్ను మోసం చేద్దామనే ఇక్కడకు వచ్చాను. కానీ నిండు మనసుతో నువ్వు నన్ను ప్రేమిస్తుంటే దానిలో కరిగిపోయాను నేను . నాకు నేనుగా యింకా మిగలలేదు. నీకు అన్యాయం చేయలేదు. అది నా గొప్పతనం కాదు. నీ ప్రేమ గొప్పతనం " అన్నాడు విశ్వం.
    'అతను చెబుతున్నది నిజమే. అరుణ ప్రేమ నన్ను కూడా మార్చింది" అన్నాను నేను.
    అరుణ ప్రేమ నాకు ఆశ్చర్యంగా కూడా వుంది. రూపంతో నిమిత్తం లేకుండా ఆమె బావ  అనే వ్యక్తిని ప్రేమించింది. ఆ బావను నేననుకొని నాతొ ప్రేమగా మసిలి నన్ను మార్చింది. ఆ తర్వాత నకిలీ విశ్వం వస్తే వాడ్ని ప్రేమించింది. వాడు అందవికారంగా వున్నాడని బాధ పడలేదు. ఇప్పుడు విశ్వాన్ని ప్రేమిస్తోంది. అతడు హంతకుడని, తనను మోసం చేయడానికి వచ్చినవాడని తెలిసి కూడా అతను చేసిన తప్పులన్నీ క్షమించగలుగుతోంది. ఇది చాలా చిత్రమయిన ప్రేమ! నేను ఆమెకు బావగా పుట్టి వుండినా ఎంతో బాగుండేది!
    తర్వాత పెద్ద విశేషాలేమీ లేవు. విశ్వం పోలీసులకు లొంగిపోయి తన కధంతా చెప్పుకొన్నాడు. అతని కధంతా విన్నాక పోలీసుల అనసూయమ్మ పై దాడి చేశారు.
    ఆవిడ ముఠాలు మొత్తం మూడున్నాయి. అన్నీ పట్టుబట్టాయి. ఆమె అధ్వర్యంలో వున్న అయిదు వందల యువతులకు మోక్షం లభించింది. ఆ ఐదు వందల యువతుల కన్నీటి గాధలు పేపర్ల లో ప్రత్యెక విశేశాలుగా వచ్చాయి. చరిత్ర కనీవినీ ఎరుగని స్త్రీ దోషిగా అనసూయమ్మ ను చాలా పత్రికలూ అభివర్ణించాయి.
    తను ఏ కారణంగా జైలుకు వెళ్ళాల్సి వచ్చిందో గుర్తించిన అనసూయమ్మ వూరుకోలేదు. ఆవిడ విశ్వం మీద బాగానే పగ తీర్చుకుంది. ఆవిడా తో పాటు విశ్వం పై కూడా తల మోయలేనన్ని నేరాలు మోపబడ్డాయి. ఆ నేరాల్లో చాలావాటికి రుజువులున్నాయి. ఎందరో కన్నెపిల్లలకు విశ్వం అన్యాయం చేసిన మాట నిజం. అనసూయమ్మ ప్రోత్సాహం వల్ల జరిగినప్పటికీ నేరాలు చేసిన విశ్వానికి పూర్తీ బాధ్యత లేకుండా పోదు.
    పత్రికల్లో అనసూయమ్మ ముఠా గురించిన వివరాలు ప్రచురించబడ్డప్పుడు విశ్వం ఫోటో లు కూడా పడ్డాయి. ఆడపిల్లల పాలిటి శాపంగా అతడు అభివర్ణించబడ్డాడు.
    విశ్వానికి ఇరవై ఏళ్ళు కారాగార వాసం విధించబడింది. అరుణ కన్నీళ్ళతో అతనికి వీడ్కోలు చెబితే -- 'నాకోసం నీ కన్నీళ్లు వృధా చేయికు...." అన్నాడతను.
    నేను చక్రపాణిని వివాహం విషయం అడిగాను" అయన సుముఖంగానే ఉన్నాడు గానీ అరుణ ఒప్పుకోలేదు.
    'అదేమిటి? ఆజన్మాంతం కన్యగా వుండి పోతావా?' అన్నాను.
    "బావను పెళ్ళి చేసుకోవాలను కుంటే బోలెడు మంది బావలు అయ్యారు. అందుకని బావను కాని వాణ్ణి పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. బావలు నాకు అచ్చి రాలేదు" అంది అరుణ.
    "నీకోసం నేనెంతో కష్టపడి నిన్ను దుర్మార్గుడి బారి నుండీ ఘోర వామానాల బారి నుండి రక్షించాను. నా ప్రేమకు ఇంతకంటే ఋజువేంకావాలి? అన్నాను.
    "నీ ప్రేమకు ఋజువు అక్కర్లేదు. కానీ నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న బావ- దుర్మర్గుడే కావచ్చు. కానీ అతడి దుర్మార్గాన్ని బయటపెట్టి ప్రపంచమంతా అతన్ని అసహ్యించుకునేలా చేశావు. అతన్ని జైలు పాలు చేశావు. బావకు నీవల్ల వచ్చిన అపఖ్యాతికీ, కారాగారావాసానికి ఈ జన్మకు నిన్ను క్షమించలేను" అంది అరుణ.
    ఏమనాలో నాకు తెలియలేదు. ఆమెను రక్షించాను. ఓ దుర్మార్గుడికి శిక్ష పడేలా చేశాను. అందుకే అరుణ నన్ను అసహ్యించు కుంటే ఏమనాలి?
    నా మనసులోని ఆలోచన అరుణ పసిగట్టి నట్లుంది. "నీకూ బావకూ చాలా తేడా వుంది. నామీద అభిమానంతో నువ్వు మరో వ్యక్తికీ అన్యాయం చేశావు. నామీద అభిమానంతో బావ తనకు తనే అన్యాయం చేసుకున్నాడు....' అంది.
    ఆమె తర్కంలో లోపమున్నదని నాకు తెలుసు. చక్రపాణి గారిని లోబరచుకుని ఎప్పటికైనా అరుణను నాదాన్ని చేసుకోవాలి. ఎటొచ్చీ ఇన్ని ప్రయత్నాలు తర్వాత కూడా నేనింకా ఆరంభం లోనే వుండడం నాకు బాధగా వుంది.

                      ---అయిపొయింది -----   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS