"మరి ఏం చెయ్యాలంటావ్ ?"
"నేను విశ్వంతో స్వయంగా మాట్లాడితే తప్ప ఉపాయం లేదు" అన్నాను.
ఆమె అలోచించి "విశ్వం ఎక్కడుంటాడో చెబుతాను. నువ్వు వాడ్ని గుర్తు పట్టగలవా?" అంది.
"ఇంతవరకు అతన్ని చూడలేదు. ఫోటో చూపిస్తే గుర్తుపట్టగలను " అన్నాను.
"ఇంట్లో ఫోటో లేదు. కానీ -- సాయంత్రం రా. విశ్వాన్ని చూపిస్తాను" అందామె.
అక్కణ్ణించి కదిలాను. ఈ వ్యవహారమంతా ఏదో మిస్టరీ గా తోచింది నాకు.
విశ్వం సంగతి తెలుసుకోవడం నాకు చాలా కష్టమయింది. అరుణను నకిలీ విశ్బం బారి నుండి రక్షించుకోవడాని కసలు విశ్వాన్ని కలుసుకోవడం చాలా అవసరమనిపించింది. ఎందుకంటె అరుణను నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. ఆమె నాకు దక్కకపోతే పోయింది , మిత్రఘాతుకడయిన నకిలీ విశ్వం చేతిలో ఆమె పడకూడదు.
విశ్వాన్ని కలుసుకుందుకు చక్రపాణి గారి ఇదివరలో ప్రయత్నించాడట. అతనిచ్చిన అడ్రసు నుబట్టి ఏవిధమైన సమాచారమూ లభించలేదుట. అందుకే నేనో ఉపాయమాలోచించాను.
విశ్వం పేరున నేసే ఓ ఉత్తరం రాసి దాంతో పాటే నేనూ హైదరాబాద్ బయల్దేరాను. తిన్నగా ఆ పోస్టూఫీసుకు వెళ్ళాను. పోస్టు దగ్గర కాశాను. నేను చేరిన మరునాడు నా ఉత్తరం ఆ పోస్టాఫీసు చేరింది. పోస్టు మాన్ కూడా దాని గురించి అడగలేదు. ఏదో తోచిన పేరు చెప్పి పోస్టు చూసి ఆ ఉత్తరాన్ని గమనించాను. అది గుర్తు కోసం ఎర్ర కవర్లో రాశాను. ఆ తర్వాత పోస్టు మాన్ ని అనుసరించసాగాను.
ఆ ఎర్ర కవరు పోస్టు మన్ ఒక గదిలో ఇచ్చాడు. ఉత్తరం మీద చిరునామా కూ అ గదికీ యే విధమయున సంబంధమూ లేదు. బహుశా పోస్టు మన్ కూ అతనికీ యీ విషయంలో అండర్ స్టాండింగ్ వుండి వుంటుంది.
తన చిరునామా విషయం ఇంత రహస్యంగా వుంచాడంటే విశ్వం లో నిజంగా ఏదో పెద్ద రహస్యం ఉన్నదనే అనుకోవాలి. నాకు కుతూహలం పెరిగింది. ఆ గదిలో ఉత్తర మందుకున్నతన్ని పకలరించాను.
ముందతను తనకేమీ తెలియదని బుకాయించాడు. నేను నిజంగానే విశ్వం శ్రేయోభిలాషినని అతన్ని నమ్మించే సరికి నా తలప్రాణం తోకకు వచ్చింది. అప్పుడతను చెప్పినదాన్ని బట్టి ఈ ఇంటికి వచ్చాడు.
ఈ ఇంట్లో ఒక నడివయస్కురాలుంది. విశ్వాన్ని చనువుగా వాడు అని అంటోంది. కానీ అతని గురించి ఏమీ చెప్పడం లేదు. కానీ విశ్వం స్థానంలో ఒక నకిలీ విశ్వం తయారయ్యాడంటే ఆమె కంగారు పడింది. విశ్వం, అరుణ ల ప్రేమ గురించి ఈమెకు బాగా తెలిసి వుండాలి.
అసలీ విశ్వం ఎవరు? నిజంగా అరుణకు బావాయేనా? తన ఉనికిని అంత రహస్యంగా వుంచవలసి నవసరం విశ్వానికి యెందుకు కలిగింది?
జవాబులు నాకు స్పురించడం లేదు. ముందుగా విశ్వం ఎప్పుడొస్తాడో తెలియదని చెప్పిన ఆమె తర్వాత అతన్ని సాయంత్రం చూపిస్తానంది. విశ్వాన్ని చూపించడమేమిటి? విశ్వం వస్తాదనవచ్చు . ఇంకోలాగనవచ్చు. చూపిస్తాననడమేమిటి? కదలలేని స్థితిలో వున్న వాళ్ళను, బందీలుగా వున్న వాళ్ళను మాత్రమే చూపించడం జరుగుతుంది.
ఆవిడ చెప్పిన చూపిస్తానన్న పదం పొరపాటున వాడబడిందా? లేక విశ్వం నిజంగానే ఎక్కడయినా బందీగా వున్నాడా?"
సాయంత్రం ఆవిడ చెప్పిన ప్రకారం ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఒక మగమనిషి ఉన్నాడు. సుమారు నా వయసే వుంటుంది. ఎటొచ్చీ నాకంటే అందంగానే వున్నాడు.
"వీడే విశ్వం !" అందావిడ.
అతనకి నన్ను నేను పరిచయం చేసుకొన్నాను.
"నాకు ఒక్కటే ఉపాయం కనబడుతోందండీ -- ఈ ఉత్తరం ఎలాగోలా మీరు అరుణకు చేరేలా చేయాలి" అన్నాడు విశ్వం.
ఉత్తరం చదివాను.
"ప్రియమైన మరదలికి--
చాలాకాలంగా ఉత్తరం రాయనందుకు మన్నించగలవు. నాకువచ్చిన ఇబ్బందులేమిటో స్వయంగా వచ్చి మనవి చేసుకుంటాను. మనం కలుసుకునేందుకు ఇంక ఎంతో కాలం పట్టదు. రాగానే నన్నెలా గుర్తు పట్టాలనుకుంతున్నావా?" నా దస్తూరీ వుందిగా !
నీ విశ్వం"
ఆ ఉత్తరం చదవగానే ఒక విషయం గుర్తుకు వచ్చింది. విశ్వం దస్తూరీలో ఒక ప్రత్యేకత వుంది. ఇది విశ్వం దస్తూరీయే ! ఆ విషయం నిరూపించడానికి దస్తూరీ నిపుణులే అవసరం లేదు!
ఉత్తరం జేబులో పెట్టుకుని "మీ ఇబ్బందులేమిటో తెలుసుకోవలనుంది నాకు. నేను అరుణ శ్రేయోభిలాషిని --" అన్నాను.
"ప్రస్తుతానికి ఉత్తరం ఆమెకు చేర్చడమే మీరు నాకు చేయగల ఉపకారం" అన్నాడు విశ్వం.
'అయితే ఉత్తరంలో మరి రెండు మాటలు రాయాలి. మీరు కారణంతరాల వల్ల గత కొద్ది మాసాలుగా హైదరాబాదు వదిలిపెట్టి పోయినట్లు స్పష్టంగా అరుణకు తెలియజేయడం అవసరం' అన్నాను.
అతని ముఖంలో కంగారు పనబడింది. "ఆ అవసరం లేదనుకుంటాను" అన్నాడు.
"పరిస్థితి మీకు బాగా అర్ధం కాలేదు--" అన్నాను.
ఆ నడివయసు ఆవిడ కలగజేసుకుని "రాయడం మంచిదని నాకూ అనిపిస్తోంది. ఉత్తరం మరీ ఇంత చిన్నగా ఉండడం బాగోలేదు. చాలా అలోచించి రాత్రికి ఇంకో ఉత్తరం రాయి. ఉదయం ఇతను వచ్చి పట్టుకు వెడతాడు" అంది.
"ఉత్తరం కోసం నేను మళ్ళీ రావాలా? ఇప్పటి కిప్పుడు రాసి ఇస్తే సరిపోదూ?" అన్నాను.
"జాగ్రత్తగా అలోచించి రాయాలి కదా. ప్రొద్దున్నే వచ్చేయ్ " అంది.
మర్నాడు ఉత్తరం రెడీగా వుంది. ఈసారి ఉత్తరం చాలా పకడ్బందీగా వుంది. దాన్ని కవర్లో పెట్టి అరుణకు పోస్టు చేశాను.
11
ఆ వుత్తరం బాగా పనిచేసింది. నకిలీ విశ్వం గాడి రంగు బయటపడింది.
వాడెంత ప్రయత్నించినా విశ్వం దస్తూరీ అనుకరించలేకపోయాడు. చక్రపాణి పోలీసుల దాకా వేడతాననేసరికి వాడు ఇల్లు వదిలి పారిపోయాడు.
అదృష్ట మేమంటే వాడు అరుణకు నా గురించి చెప్పలేదు. తనే ఆమెను పెళ్ళి చేసుకునేందుకు సిద్దపడ్డాడు కాబట్టి, నా గురించి చెప్పినా నమ్మడనుకున్నాడో ఏమో వాడు నన్ను రక్షించాడు. నేను రక్షించబడినప్పటికీ అరుణకు నాపైన కరుణ కలగలేదు.
ప్రస్తుతం ఆ ఇంట్లో ఏమి జరుగుతూ వుంటుందో ఊహించగలుగుతున్నాను. అరుణ మానసికంగా బాగా దెబ్బతిని వుంటుంది. తన బావకు ఉత్తరం రాసి వుంటుంది. ఈసారి బావ అంటూ ఎవరు వచ్చినా నమ్మననీ దస్తూరీ పరీక్ష పెడతాననీ రాసి వుంటుంది. అందవికారంగా వున్న నకిలీ విశ్వం తన మేనళ్ళుడూ కానందుకు చక్రపాణి కూడా తేలిగ్గా ఊపిరి పీల్చుకుని వుంటాడు. అయితే విశ్వం పేరు చెప్పి తాన కూతుర్ని మోసం చేయడానికి ప్రయత్నాలేందుకు జరుగుతున్నాయీ అని అయన మధనపడడం కూడా జరుగుతుంటుంది.
అరుణ నన్ను చూసినా మాట్లాడదు. నాకెంతో బాధగా వుంటుంది. నన్ను వాళ్ళింటి కి రానివ్వదు. నా అసహయతకు దుఃఖం వస్తోంది. అయినా నేనామెకు హాని తలపెట్టలేదు. నేనామెను ప్రేమిస్తున్నాను.
అరుణ బావ వచ్చి తను అరుణను ప్రేమించడం లేదని చెప్పి నేనామెకు చేసిన ఉపకారం గురించి ఆమెకు చెబితే అప్పుడైనా ఆమె నన్ను మన్నించగలుగుతుందేమో!
మానవుడు ఆశాజీవి. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. అరుణకు జీవిత భాగస్వామి గా చేసుకోవాలన్నకోరిక తప్ప మరేమీ నాకిప్పుడు మిగలలేదు.
నేను ఎదురు చూస్తుండగానే ఒకరోజు బజార్లో నా కేదురాయినప్పుడు -- ఎప్పట్లా ముఖం తిప్పేసుకోకుండా నావైపు చూసి నవ్వింది అరుణ. అప్పుడు నాకెంత సంతోషం కలిగిందో మాటల్లో వర్ణించి చెప్పలేను.
"ఎన్నాళ్ళకు నన్ను చూసి నవ్వావు?" అన్నాను.
"నాకు చాలా సంతోషంగా వుంది. ఇప్పుడు నాకేవారి మీద ద్వేషం లేదు ...." అంది అరుణ.
"ఏమిటి కారణం?"
"బావ వచ్చాడు" అంది అరుణ. అమెసంతోషం మాటల్లో తెలిసిపోతోంది.
నా ఉలికి పాటును పైకి కనపడనీయకుండా "ఇది మూడో సారి కదూ?" అన్నాను.
'అవును, ఇదే ఆఖరు సారి కూడా!" అంది అరుణ. "
"ఎందుకని?"
"బావను గుర్తు పట్టడానికి మార్గం తెలిసింది" అంది అరుణ.
ఏమిటా మార్గమని అడగలేదు. విశ్వం వచ్చాడన్న మాట!
"మా ఇంటి కొస్తే బావను పరిచయం చేస్తాను" అంది అరుణ.
"అక్కర్లేదు!" అన్నాను.
"ఎందుకని?" అంది అరుణ.
