Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 4

    బయట పురుషోత్తమరావు, మధుమూర్తి సీరియస్ గా సర్పంచులు కావటానికి పథకాలు ఆలోచిస్తున్నారు.


    "మా అల్లుడు వచ్చాడట -"

    రాధిక గుండెలో రాయిపడింది. ఆమె మరెవరో కాదు. సాక్షాత్తు మేనత్త పేరు అన్నపూర్ణ. ఆమెను గధ్వాలకిచ్చారు. 'చీ ప్రతిసారీ ఆడదే కాపురానికి వెళ్ళడం ఏమిటి! మగాడు వెళ్ళాలి' అని పట్టుబట్టి, భర్తను కాపురానికి తెచ్చుకుంది. ఆమె ప్రభుత్వానికి సహకరిస్తానని పందెంకాసి పట్టుబట్టి మరీ కనేసిందో కూతుర్ని.

    "రాధికా! సాయంత్రం వరకు మనకు ఏకాంతం కుద రదే." అన్నాడు అసహ్యంగా.
 
    "అంతే......ఇక ఈ ఇంట్లో మాట్లాడడం కుదరదు. నువ్వు కాముని చెరువు దగ్గర కూర్చో. నేను వచ్చేస్తాను" అన్నది.

    "అలాగే....... ఏం అత్తయ్యా బావున్నావా!"

    "ఏదో ఇలా ఉన్నాము. నువ్వేం ప్లాన్ చేస్తున్నావ్? ఫారిన్ వెళ్తావా - ఇక్కడే పి.హెచ్.డి. చేస్తావా!" అన్నది కూర్చుంటూ.

    "రాసిన పరీక్ష ఫలితాలు రానీ" అన్నాడు నవ్వుతూ.

    "రిజల్ట్స్ గురించి ఏమయినా అనుమానం ఉందా" అబ్బే అన్నట్టు చూచాడు.

    "మా స్వర్ణ గ్రాడ్యుయేషన్ అయిపోతుందీ సంవత్సరం"

    సిద్దార్ధ చిరాకుగా చూచాడు. మన హైందవ కుటుంబాలలో ఈ మేనరికం వరసలు అతనికి బొత్తిగా గిట్టవు. పుడుతూండగానే భార్యాభర్తలు అంటారు.

    యశోదకు అవి గిట్టవు. అయినా అన్నపూర్ణ వదిలిపెట్టదు. అతను అత్తనెలా తప్పించుకోవాలో అర్ధంకాక తికమక పడుతున్న సమయాన బయట యెవరో పిలిచారు.

    "అత్తయ్యా! నా ఫ్రెండ్స్ యెవరో వచ్చినట్టున్నారు మీరు భోజనంచేసి వెళ్ళండి." అన్నాడు.

    అతనికి మనసులో కసిగా ఉన్నది. చెల్లెలికి ఆల్చిప్పలతో చేసిన బొమ్మలు, తల్లికి కొబ్బెర టెంకలతో చేసిన కుంకంభరిణ తెచ్చాడు. ఇవ్వాలంటే కుదరటంలేదు.

    విసుగ్గా వెళ్ళిపోయాడు.

    "వదినా- -" యశోదవైపు తిరిగింది అన్నపూర్ణ.

    "వదినా! వాడిప్పుడే వచ్చాడు. లేనిపోని విషయాలు చర్చ ఎందుకు" అన్నపూర్ణ మాటలు త్రుంచేసింది.

    అన్నపూర్ణమ్మకు యశోద వ్యక్తిత్వం ఎప్పుడూ ఓ సవాలే. మూతి తిప్పుకుంది. ఆడవారికో స్వంత నిర్వచనం ఇచ్చుకుంది. చీటికీ మాటికీ ఏడుస్తూ, పిల్లలను తిడుతూ. భర్తను సాధిస్తూ, ప్రక్కవారిని నిష్టోరోక్తులాడుతూ ఉండాలి.

    యశోద దానికి పూర్తిగా విరుద్దం. ఆమె మనసులో ఏం ఉంటుందో తెలియదు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది.

    "నా కూతురికేమిటే! బంగారుబొమ్మ. నా ఆస్తికి వారసురాలు. దానికి భర్త దొరకడనా?"

    "అన్నయ్యకే అమ్మాయి దొరకదు. అన్నయ్య కుంటివాడు గుడ్డివాడు" అన్నది వెటకారంగా రాధిక. అన్నపూర్ణమ్మ వెళ్ళిపోయింది.


                                     2


    "ఇక్కడ హిప్నటిజమ్ క్లాసులు నడుపుతున్నాము" అన్నాడు అర్జున్.
 
    అది ఊరవతల శివుని గుడి.

    ఆలనా పాలనా లేక పాడుపడింది. దాన్ని స్వాములవారి మఠం అని కూడా అంటారు. అక్కడ భక్తులు, భగవంతుని పేరిట నిర్యాణం పొందేవారట.

    సజీవంగా సమాధిని చేయించుకుని కైంకర్యం పొందేవారట. అక్కడ అర్జున్ వాళ్ళు రోజు కలుసుకుంటారు.

    "హిప్నాటిజమ్ క్లాసులు ఎవరు తీసుకుంటున్నారు" సిద్దార్ధ అడిగాడు.

    "సిటీ నుండి ప్రొఫెసర్ రఘురామ్ వస్తాడు.

    "అతను పి.హెచ్.డి. చేసాడా?"

    "లేదు. ఒక సాంస్కృతిక సంస్థ అతడిని సన్మానించి, 'ప్రొఫెసర్' డిగ్రీలాంటిదిచ్చారట."

    "ఛీ..........ఛీ.... యూనివర్శిటీలే అర్డనరీ డాక్టరేట్స్ ఇచ్చి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారంటే, ఈ సాంస్కృతిక సంఘాలు బయలుదేరాయి." విసుక్కున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS