అతనికి ఆశ్చర్యం వేసింది. ఏమీ లేకపోవడం అంటే? లారీలూ, షెల్టర్లూ, విమానాలూ, పత్రికలూ, హిట్లరూ, ఎ.ఆర్.పీ. ఆమె, తానూ -అన్నీ ఉండగా అందరూ ఉండగా ఏమీ లేకపోవడమేమిటి? తెలివిగా తనంతట తనే కనురెప్పల మధ్య నవ్వుకున్నాడు. ఒకసారి జేబులోకి చెయ్యిపోనిచ్చి తీసివేశాడు.
"మీ ఆయన ఎక్కడున్నాడు?" అన్నాడతను.
"ఈజిప్టులో"
"పాపం" అన్నాడతను.
"ఏం?" అంది ఆమె.
"సైన్యంలో ఎందుకు చేరాడు?"
"ఎందుకా" -ఆమె అతనికేసి ఓ నిమిషం చూసి మెల్లగా "మీరెందుకు చేరారూ?" అంది.
"నే నీ దేశంలోనే వున్నానుగా"
"అయితేనేం?"
"ఎందుకు చేరానా!" అతను ఆలోచిస్తూ ట్రాము బద్దీలకేసి చూశాడు. అవి సాగిసాగి ఎక్కడో చీకట్లో కలసిపోయాయి. దారిపక్క ఓ పెద్ద గోతిలోంచి రెండు పందికొక్కులు ఉత్సాహంగా యివతలకి వచ్చి పరిసరాల్ని పర్యవేక్షించాయి.
"ఎందుకేఁవిటీ?" అతను కారణాలు వెతుక్కుంటూ స్వగతంలా మాట్లాడుతున్నాడు. "ఉద్యోగమూ లేదు. డబ్బూలేదు. నా భార్య చనిపోయింది. ఏం తోచలేదు. సైన్యంలో చేరేశాను" ఇలాగ అని ఆలోచిస్తూ అతను అక్కడే నుంచునిపోయాడు.
నాలుగడగులు ముందుకు వెళ్ళిన ఆమె వెనక్కి తిరిగి "ఆగిపోయారేం!" అంది.
"మర్చిపోయాను" క్రాపు సవరించుకుని అతను ముందుకు సాగాడు.
"మీ భార్య ఎందుకు పోయిందీ!" ఆమె అడిగింది.
"నన్ను ప్రేమించి"
ఆమె వింతగా అతనికేసి చూసింది. అతను కంగారుగా తల పక్కకి తిప్పుకున్నాడు.
"ఎప్పుడయింది మీ పెళ్ళి?" అంది ఆమె.
"మేం పెళ్ళి చేసుకోలేదు"
"అంటే?"
పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. మా కులాలు వేరు. ఆమె నాతో వచ్చేసింది"
"తర్వాత"
"రిజిష్టరు మారేజీ చేసుకుందామని అనుకున్నాం. కాని ఉద్యోగం కోసం ఊరూరా తిరుగుతూ నాగపూర్ వెళ్ళాం. అక్కడ సత్యాగ్రహంలో చేరాం. మమ్మల్ని జైలులో పెట్టారు. మాకు మలేరియా వచ్చింది. మమ్మల్ని వదిలిపెట్టారు. నాకు మలేరియా దానంతట అదే కుదిరింది. ఆమెకు కుదరలేదు సరియైన మందులేక......." అతను గుండెలమీద చెయ్యి పెట్టి రాసుకున్నాడు. ఆమె అవ్యక్తంగా వచ్చే ఒక ఆలోచనను తల్చుకుని భయపడి "అబ్బా" అంది.
"ఏం?" అన్నాడతను.
"ఏమీలేదు" అందామె.
అతనికి తిరిగి ఆశ్చర్యం వేసింది. తెలీని బాధ. వొంటరితనమూ, యుద్ధమూ -ఈజిప్టు, మలేరియా -యిన్నీ వుంటే లేకపోవడం ఏమిటీ?
ఆకాశంమీద ఆర్ద్ర నక్షత్రం మీద ఒక లేతమబ్బు కప్పుకొని ఉంది. పక్కసందులో ఒక ఆంగ్లో -ఇండియన్ యువతీ, యువకుడు ఒకరిమీద ఒకరు తూలుతూ నడుస్తున్నారు.
"మీరు వెల్సు రాసిన Things to come చదివారా?"
"నాకు వెల్సు అంటే అయిష్టం" అందామె.
"అందులో Walking disease వచ్చిందట యుద్ధం మూలాన్ని. మనకీ ఆ జబ్బు వచ్చిందేమో" అతను నవ్వుదామని ప్రయత్నించి దానికి బదులుగా దగ్గాడు.
