Previous Page Next Page 
వసుంధర కధలు-6 పేజి 38

 

    "మైగాడ్ !' అన్నాడు వెంకన్న.
    రాజమ్మ వణుకుతూ -- "ఈ నోట్ బుక్ ఒనర్ని మళ్ళీ చూస్తె నువ్వు గుర్తు పట్టగలవా?" అంది.
    "పట్టలేను. అతడి ముఖం సరిగ్గా చూడలేదు. అతడో కొత్త రకం యెర్ర ప్యాంటు వేసుకుని వున్నాడు. ఆ పాంటు ఆధారంగానే అతన్ని కాసేపు అనుసరించి ఆఖరికి మిస్సయ్యాను--"అంది సీతమ్మ.
    "ఎవడో తను చేయాల్సిన హత్యలన్నీ చక్కగా ముందే రాసి పెట్టుకున్నాడు...." అన్నాడు వెంకన్న.
    "అప్పుడే అయిపోలేదు. ఇంకా వున్నాయి చూడండి!" అంది సీతమ్మ.
    ఈసారి పేజీ తిప్పుతుంటే వెంకన్న చేతులు వణికాయి.
    అక్కడ....మూడంకే వేసి వుంది.
    నేను రెండో అట సినిమా చూసి వాడింటికి వెడతాను. తలుపులు తీసి వాడు నేనేవరినని అడుగుతాడు. వాడిని ఒక్క గుద్దు గుద్ది నేను లోపలకు వెడతాను. తిరిగి వాడు లేచేలోగా కత్తి వాడి గుండెల్లో దిగిపోతుంది.
    తర్వాత పేజీలో నాల్గంకే వేసి వుంది. అక్కడ....
    అది నన్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తుంది-- రా అన్నయ్య అంటూ. నేనా రాత్రి దానింట్లోనే భోం చేస్తాను. అది గదిలో పడుకుని నన్ను హల్లో పడుకోమంటుంది. కాసేపలాగే జరుగుతుంది. ఓరాత్రి వేళ నేను దాని మంచం మీదకు వెడతాను. అది ప్రతిఘటిస్తుంది. కానీ నా బలానికి లొంగి పోతుంది.
    ఆ తర్వాత పేజీలో అయిదంకే వేసి వుంది. అక్కడ ఒకే ఒక వాక్యం సగంలో ఆపి వేయబడి వుంది.
    రాత్రి రెండో అట సినిమా చూసి ....
    అంతే రాసి వుంది.
    "ఎవడో హత్యల గురించి పధకం వేసుకుని క్లుప్తంగా రాసి పెట్టుకున్నాడు. ఇంచుమించుగా అన్ని ఒకలాంటి పధకాలే. ఆ హంతకుడెవరో తెలిస్తే బాగుండును!" అన్నాడు వెంకన్న.
    "ఆ హంతకుడికి అందరిలోకి రంగారావు మీదా, తర్వాత హత్య చేయబోయే వాడి మీదా చాలా పగ ఉన్నదనుకుంటాను...." అంది సీతమ్మ.
    "ఈ నోట్ బుక్ రంగారావుని చంపినవాడిదేననిపిస్తోంది. దాన్ని బట్టి ఆలోచిస్తుంటే రంగారావు హత్యను ఒక స్త్రీ చూసిందనే చెప్పుకోవచ్చు. కానీ ఆ స్త్రీ ఎవరో ఎలా తెలుస్తుంది?' అన్నాడు వెంకన్న.
    "పేపర్లో ప్రకటన వేస్తె?" అన్నాడు వెంకన్న.
    "దేని గురించి?" అందిసీతమ్మ.
    "రంగారావు ను చంపినవాణ్ని చూసిన స్త్రీ ఆవివరాలను ఏదో రూపంగా డిటెక్టివ్ వెంకన్న కు అందజేయమని కోరుతూ పేపర్లో ప్రకటన చేయవచ్చు--" అంది రాజమ్మ.
    "ప్రకటనకు ఖర్చవుతుంది? అదెవరు భరిస్తారు?" అన్నాడు వెంకన్న.
    "ఎవరు భరిస్తారన్న ఆలోచన వుంటే ఆ నోట్ బుక్ గురించి చర్చించడం టైం వెస్ట్!" అంది రాజమ్మ ఉక్రోషంగా.
    సరిగ్గా అప్పుడే బల్ల మీద టెలిఫోన్ మోగింది. టెలిఫోన్ రంగును బట్టి అది వంటింట్లోంచి భార్యామణి పద్మావతీ దేవి చేసినదేనని గ్రహించాడు వెంకన్న.
    "హలో -- దేవీ! ఏమిటి విశేషం?' అన్నాడు వెంకన్న.
    "రంగారావు హంతకుడి ఆచూకీ తెలుసుకుందుకు మీరు పేపర్లో ప్రకటన వేయించండి--" అందామె.
    "ఎందుకని?"
    "ఆ హంతకుడు కార్యక్రమంలో ఓ ఆడదాని మానభంగం కూడా వుంది ...." అంది పద్మావతీ దేవి.
    "మగవాళ్ళ ప్రాణాలు పోయినా నీకు బాధ లేదు కానీ -- ఆడదాని మానం గురించి ఈ నిర్ణయం తీసుకున్నావా?' అన్నాడు వెంకన్న వెటకారంగా.
    "అవును మరి. మీ మగాళ్ళ ప్రాణాలన్నీ ఆడదాని మానం చుట్టూనే గదా ఉంటున్నాయి...." అంది పద్మావతీ దేవి.
    కిసుక్కుమని నవ్విన శబ్దం విని వెంకన్న తన అసిస్టెంట్  వేపు చిరాగ్గా చూసి -- "నా భార్య నాతొ మాట్లాడుతున్నప్పుడు వినవద్దని మీ కెన్ని సార్లు చెప్పాను?" అన్నాడు.
    వెంకన్న కు ఏ ఫోన్ కాల్ వచ్చినా వినేందుకు సీతమ్మకూ, రాజమ్మకూ సదుపాయముంది. అది వారు ఎప్పుడూ ఉపయోగించుకుంటూనే వుంటారు. వెంకన్న కోప్పడగానే వాళ్ళు ఫోన్ క్రింద పెట్టేసి గప్ చిప్ అయిపోయారు.
    "డబ్బు కోసం చూడకండి. పేపర్లో ప్రకటన ఇస్తారు కదూ?' అంటూ ఫోన్ పెట్టేసింది. పద్మావతీ దేవి , ఆవిడలా ఫోన్ పెట్టేసిందంటే అది విన్నపం కాదనీ, అజ్ఞ అని అర్ధం.
    వెంకన్న ఫోన్ పెట్టేసి -- "రాజమ్మా! నీ సలహా పాటిస్తున్నాను. పేపరుకు ప్రకటన తయారు చేయించు" అన్నాడు.
    రాజమ్మా నవ్వి, "నా సలహా పాటిస్తున్నారా? మీరెవరి సలహా పాటించారో నాకు తెలియదనుకుంటున్నారా?" నేనూ నా సలహా పాటించే వాళ్లుండడం కోసమైనా త్వరగా పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను-" అంది.

                                  3

    "హలో!" అన్నాడు వెంకన్న.
    "మాట్లాడేది డిటెక్టివ్ వెంకన్న గారేనా?" అంది ఓ స్త్రీ కంఠం.
    "అవును --ఏం?"
    "నేను పేపర్లో మీ ప్రకటన చూశాను?" అందా కంఠం.
    "అలాగా -- మీరు రంగారావింట్లో హత్య చూసిన స్త్రీయా? అన్నాడు వెంకన్న . అతడి కంఠంలో కుతూహలముంది.
    "అవును."
    "వాట్....." ఉలిక్కిపడ్డాడు వెంకన్న. అది కలా, నిజమా అని ఒళ్ళు గిల్లుకున్నాడతను'-- "హలో వివరాలన్నీ త్వరగా చెబుతారా!"
    అదే ఫోన్ కాల్ సీతమ్మ, రాజమ్మ కూడా వింటున్నారు. వినేది నోట్ చేసుకోవడం కోసం ఇద్దరి చేతుల్లోనూ పెన్సిల్స్ నోట్ బుక్స్ సిద్దంగా వున్నాయి.
    "వెంకన్న గారూ! రంగారావు పరమ దుర్మార్గుడు . ఆ విషయం చూచాయిగా విని వున్నా ఆరోజతడు నాపట్ల పశుత్వం వహించేవరకూ దుర్మార్గం అనేది ఎంత భయంకరమైన విషయమో అర్ధం చేసుకున్నాను. అటువంటి వాణ్ని హంతకుడనకూడదు. యోధుడనాలి. ఆదృశ్యం కళ్ళారా చూసినందుకు  నాకెంతో ఆనందంగా వుంది. ఆ మహానుభావుడిని పూజించాలి తప్పితే జైలు పాలు చేయకూడదు. అనవసరంగా మీరీ కేసు పై ఆసక్తి చూపకండి! స్త్రీ లోకం ధన్యవాదాలర్పిస్తున్న ఆ మహానుభావుడికి ఆపద తల పెట్టకండి."
    ఫోన్ క్లిక్ మంది.
    "హలో! హలో!" అన్నాడు వెంకన్న నిరుత్సాహంగా.
    "రాజమ్మ సలహాల వల్ల ప్రయోజనం పొందిదిందెవరు?" అంది సీతమ్మ.
    "బాస్! సీతమ్మ మీ సతీమణినే అవమానిస్తోంది --" అంది రాజమ్మ.
    "వాట్ - నువ్వు శ్రీ వెంకన్న సతీమణి వా? నాకు తెలియదే--" అంది  సీతమ్మ.
    రాజమ్మ ముఖం ఎర్రగా అయింది. ఆమె ఏదో అనబోయేంతలో బల్ల మీద ఫోన్ మ్రోగింది.
    "హలో!" అన్నాడు వెంకన్న.
    "నా పేరు శివుడు. మా అన్నయ్య విష్ణువు నెవరో హత్య చేశారు!" అందవతలి కంఠం.
    "హలో! ఇది డిటెక్టివ్ వెంకన్న యిల్లు. ఇక్కడ జోక్స్ వినబడవు-" అన్నాడు వెంకన్న.
    "అయాం సారీ వెంకన్న గారూ -- నేను జోక్ చేయడం లేదు. మా అన్నయ్య విష్ణువు నెవరో ఘోరంగా హత్య చేశారు. కుర్చీలో కట్టేసి తల కోసేశారు...."
    వెంకన్న చేతిలోని రిసీవర్ జారిపోయింది.
    "హలో! హలో!" అంటోంది అవతలి కంఠం.
    వెంకన్న మళ్ళీ రిసీవర్ అందుకుని -- "అంతా వివరంగా చెప్పండి!" అన్నాడు.
    విష్ణువు అసలు పేరు విష్ణుమూర్తి. శివుడి అసలు పేరు శివరావు. ఇద్దరూ అన్నదమ్ములు. ఉన్నవాళ్ళే కానీ మరీ అంత పేరున్న వాళ్ళు కాదు. హత్యా స్థలానికి పోలీసులు వచ్చారు. తన అన్నని ఎవరంత ఘోరంగా చంపారో శివుడికే  తెలుసుకోవాలనుంది. అందుకు అతను వెంకన్న సహాయం కోరుకున్నాడు.
    వెంకన్న కూడా సీతమ్మ ను తీసుకుని హత్యా స్థలానికి వెళ్ళాడు. దారిలో  అతను సీతమ్మ తో "రాజమ్మ బదులు నిన్ను తీసుకు వెళ్ళడానికి కారణం తెలుసా? నోట్ బుక్ ఒనర్ని చూస్తె గుర్తు పడతావని!" అన్నాడు.
    "కనపడతాడని మీకు నమ్మకముందా?" అంది సీతమ్మ.
    "కనపడతాడన్న నమ్మకం నాకుంది. కానీ నువ్వు గుర్తు పడతావన్న నమ్మకం నాకు లేదు --" అన్నాడు వెంకన్న.
    హత్యా స్థలం వారు చేరుకునేసరికి పోలీసు లింకా అక్కడే వున్నారు. వెంకన్న, పోలీస్ ఇన్స్ పెక్టర్ని ఒకరి నొకరు పలకరించు కున్నారు. అయితే వెంకన్న రాకపట్ల ఇన్స్ పెక్టర్ అంత కుతూహలం చూపించలేదు.
    వెంకన్న కు తెలిసిన ముఖ్య విశేషమేమిటంటే -- హంతకుడు తనకు సంబంధించిన ఆచూకీ ఒక్కటి కూడా వదిలిపెట్టినట్లు కనబడడం లేదు. ఎక్కడా వేలిముద్రలే లేవు.
    పోలీసులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు.
    శవం మాత్రం చాలా భయంకరంగా వుంది. కుర్చీలో తలలేని మొండెం . దాని ఒడిలో తల.
    వెంకన్న శివుడనబడే శివరావుని పలకరించాడు. తనకు తోచిన ప్రశ్నలన్నీ వేశాడు.
    విష్ణువు కి పెళ్ళయింది. ఏడాది క్రితం. అతడి భార్య చనిపోయింది. అతడికి పిల్లలు లేరు. భార్య పోయాక అతను కాస్త విరక్తుడయ్యాడు. రెండో పెళ్ళి గురించి చాలామంది అతన్ని ఒత్తిడి చేస్తున్నారు. అతడికింకా ముప్పై నిండలేదు. అతడి పేరు మీద రెండు లక్షల ఆస్తి వుంది.
    "వారసులు లేకపోతే మీ అన్నయ్య ఆస్తి ఎవరికి చెందుతుంది?" అన్నాడు వెంకన్న.
    "నాకే!" అన్నాడు శివరావు.
    "మీ అన్నయ్య భార్య ఎలా చనిపోయింది?"
    "హటాత్తుగా అబార్షనై మరణించింది--"
    "అది సహజమైన చావేననుకున్నారా?"
    "అయ్యా వెంకన్నగారూ నేను మిమ్నల్ని కోరింది మా అన్నయ్యను చంపిన హంతకుడిని పట్టుకోమని. మీరేమో మా యింట్లో యింతవరకూ పోయిన వారి వివరాలు  అడుగుతున్నారు...."
    "తీగలాగితే డొంక కదలడమంటే ఇదే మరి?" అన్నాడు వెంకన్న.
    "అంటే?"
    "మీ అన్నయ్య పేరున రెండు లక్షల ఆస్తి వుంది. ఆయనకు వారసులు లేకుండా చనిపోతే అది మీకే చెందుతుంది. అబార్షనై అయన భార్య పోయింది. తర్వాత అయన పోయాడు. అందువల్ల ఈ కేసుకి  మొదటి అనుమానితుడు మీరే!" అన్నాడు వెంకన్న.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS