చంద్రం అతని బాధ అర్థం చేసుకుని కెమేరా ఎడ్జస్ట్ చేసి తలుపులు మూసి బయటకు వెళ్ళిపోయాడు.
* * *
అప్పట్నుంచి అదో థ్రిల్ అయిపోయింది. వారానికి ఒకటి రెండుసార్లు చంద్రానికి అవకాశం దొరికినప్పుడల్లా వీడియోలో మాట్లాడటం హరిణి దగర్నుంచి మళ్ళీ వీడియో ద్వారానే జవాబు రావటం ఇదో అందమైన ఆట అయిపోయింది. చంద్రం నైపుణ్యం వల్ల యిద్దరూ ఒకరికొకరు ఎదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నట్లే అనుభూతి కలిగేది. ప్రశ్న జవాబు, స్వగతాలు, గుసగుసలు జీవితంలో మళ్ళీ వేగం పుంజుకున్నట్లయింది. తాత్కాలికంగా ఏర్పడిన విషాదచ్చాయలు తొలగిపోయినాయి. మహేష్ శ్రద్ధగా చదువుకోగలుగుతున్నాడు.
ఓ సాయంత్రం సునంద వచ్చింది. మహేష్ పుస్తకాల్లో లీనమై వున్నాడు.
"మహేష్."
"అతను తలెత్తి చూశాడు. సునంద చాలా దిగులుగా కనిపించింది. జుట్టు వదులుగా వుండి కళ్ళమీదకు పడుతూ ఆ దిగులులో చాలా అందంగా కనిపించింది.
"మహేష్! నేను పెళ్ళి చేసుకోబోతున్నాను"
"కంగ్రాట్స్."
రెండుమూడు సంవత్సరాలలో సునంద ఎన్నోసార్లు అతన్ని కలుసుకుంది. హరిణికి దూరంగా వుండటం వల్ల తనపట్ల ఎంతో ప్రసన్నత ఏర్పడుతుందేమోనని ఎంతో ఆశపడింది. కాని నిజం అర్థమయ్యాక ఆ ఆశ వదిలేసుకుంది.
"అనుకున్నవారు కాకపోయాక_ ఎవరో ఒకరు."
"అలా అనకు సునందా. పెళ్ళి అనేది జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన. దానికి ఎంతో విలువ ఇవ్వాల్సిన అవసరముంది."
"అది కొందరి విషయాల్లోనే మహేష్. ఆ అదృష్టం అందరికీ రాదు."
"అతనేం చేస్తాడు?"
"పెద్ద బిజినెస్ మేగ్నెట్."
"ఇంకేం? డబ్బుంటే అన్ని అసంతృప్తులూ తొలగిపోతాయి."
"అందులోవున్న సాధక బాధకాలేమిటో టెన్షనేమిటో డబ్బున్నవాళ్ళకే తెలుస్తుంది."
"కావచ్చు" అన్నాడు మహేష్ ఒప్పుకుంటూ.
చాలాసేపు యిద్దరూ మౌనంగా కూర్చుని వున్నారు. మహేష్ మెడిసిన్ టెక్ట్స్ బుక్ లోని పేజీలవంక చూస్తూ స్తబ్దుగా వుండిపోయాడు.
గుండెల్ని తొలిచే ఆ నిశ్శబ్దంలో చిన్న సవ్వడి.
మహేష్ తలెత్తి చూసేసరికి సునంద ఏడుస్తోంది. అతని కడుపు తరుక్కుపోయినట్లయింది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని "ఏమిటి సునందా" అన్నాడు.
"మహేష్! నేను...."
"......."
"మహేష్! నేను."
"నిండు జీవితంలోకి ప్రవేశించబోతున్నావు."
"ఐ...."
"సునందా"
"నిన్ను...."
హఠాత్తుగా అతని గుండెల మీదకు వొరిగి ఇంకా ఏడుస్తోంది.
జాలిగా ఆమె కన్నీళ్లు తుడిచాడు.
ఆ చేతినలా ఆబగా పట్టుకుని ముఖం పైకెత్తింది "ఒక్కసారి...."
"వద్దు సునందా."
* * *
మహేష్ ఫైనలియర్ ఎం.బి.బి.ఎస్. ప్యాసయిపోయాడు. పరీక్షల ముందు హరిణి వీడియోలో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది. ప్యాసయ్యాక కంగ్రాట్యులేషన్స్ చెప్పింది.
అతను హౌస్ సర్జన్ లో చేరాడు.
హరిణి ఫైనలియర్ లోకి వచ్చింది. ఆమె బాగా చదవటానికి అతను సాధ్యమైనంతవరకూ ఇన్ స్పిరేషన్ ఇస్తున్నాడు.
రోజులు గడిచిపోతున్నాయి. పరీక్షలు దగ్గరకొస్తున్నాయి.
ఉన్నట్లుండి హరిణి కనబడటం మానేసింది. ఎవర్నయినా అడుగుదామంటే కొన్ని సంవత్సరాలుగా ఆమె గురించి ఎవరితోనూ ప్రస్తావించటం మానేశాడు. తమ ఇద్దరిడీ చెడిపోయిందనే అందరూ అనుకుంటున్నారు. ఇన్నాళ్ళుగా తాము ఇద్దరూ సంభాషించుకోవటం, ఒక్కొక్కరు కలుసుకోవటం కేవలం వీడియో ద్వారానే జరుగుతోంది. ఇప్పుడు చంద్రం ఊళ్ళో లేడు. కొంతమంది ఫ్రెండ్స్ నార్త్ ఇండియా టూర్ వెళుతూ_ తమ పర్యటన అంతా చిత్రీకరించటానికి చంద్రాన్ని తీసుకువెళ్ళారు.
మహేష్ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. ఆమె కాలేజీలో ఎక్కడన్నా కనిపిస్తుందేమోనని అక్కడక్కడా నిలబడి చూశాడు. హాస్పటల్ వార్డ్స్ లో పనిచేస్తూ ఆమె క్లాస్ మేట్స్ తిరిగే వార్డ్స్ అన్నీ వెయ్యికళ్ళతో చూసేవాడు.
హరిణి కనిపించలేదు.
ఏం జరిగింది? ఏదన్నా అవసరముండి ఊరు కాని వెళ్ళిందా?
ఓరోజు సునంద కనిపించింది. ఆమెకు పెళ్ళయి చాలారోజులయి పోయింది. పుట్టింటికి వచ్చి, మహేష్ ని చూడటానికి గదికి వచ్చింది.
పూర్వంకన్నా వళ్ళు వచ్చి నిండుగా, చాలా అందంగా వుంది.
"ఏమన్నా....విశేషమా?" అనడిగాడు.
"ఛీ. అదేంలేదు" అంటూ నవ్వింది.
కాసేపున్నాక మెల్లిగా విషయం బయటపెట్టాడు. "సునందా! ఓసారి హాస్టల్ కి వెళ్ళి హరిణిని చూసిరావటానికి ఏమన్నా అభ్యంతరమా?" అనడిగాడు.
"అభ్యంతరమేంలేదు" అంటూ సునంద అప్పటికప్పుడే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది.
ఓ గంట పోయాక తిరిగివచ్చింది. "మహేష్ హరిణికి జ్వరంగా వుంది. లేవటంలేదు" అని చెప్పింది.
"అయ్యో! ఎలా వుందిప్పుడు?"
"తగ్గలేదు. హరిణి చాలా చిక్కిపోయింది మహేష్."
"మరి....అలావుంటే హాస్పటల్ లో ఎందుకు చేరలేదు?"
"తనకి హాస్పటల్లో చేరాలనిలేదుట. అక్కడే వుండి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది."
"ఏమన్నది?"
"నిన్ను....చూడాలని వున్నదని కొట్టుకుపోయింది."
అతనేం మాట్లాడలేదు.
"మహేష్! ఒకసారి నిన్ను రమ్మన్నది."
అతను ఉలిక్కిపడ్డాడు. "రమ్మన్నదా?"
"అవును మహేష్. పాపం చాలా చాలా ఎదురుచూస్తోంది."
"నో! నేను వెళ్ళలేను" అనుకున్నాడు మహేష్.
